భూసేకరణ పనులు వేగంతం చేయాలి.

 *భూసేకరణ పనులు వేగంతం చేయాలి*


 

*: జిల్లా జాయింట్ కలెక్టర్ టి.ఎస్.చేతన్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మార్చి 29  (ప్రజా అమరావతి):


జిల్లా పరిధిలో చేపడుతున్న వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పనులను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, 716జి, 342, 44 రహదారులు, ఏపీఐఐసీ, వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియపై ఆర్డీఓలు, తహసీల్దారులతో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్ తో కలిసి ఇప్పటివరకు జరిగిన పురోగతిపై జెసి సమీక్ష నిర్వహించారు. అలాగే పెండింగ్ పనులకు కారణాలు గురించి రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులతో అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ  రెవెన్యూ మరియు ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఉద్యోగులు సమన్వయ సహకారాలతో భూసేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లా నుంచి వెళ్లే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, 716జి, 342, 44 జాతీయ రహదారులు, ఏపీఐఐసీ, రాయదుర్గం-  తుంకూరు రైల్వే ప్రాజెక్టులకు, ఇరిగేషన్ కు సంబంధించి భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం చేయరాదని ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియ ఆలస్యం చేయడం వల్ల ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని, ఆయా ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఆయా మండలాల తహసిల్దార్లు పై పనుల మీద ప్రత్యేక దృష్టి సారించాలని, శ్రద్ధ పెట్టి పనిచేసి వేగంగా భూసేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా సకాలంలో భూసేకరణ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కదిరి, ముదిగుబ్బ, పెనుకొండ,  బత్తలపల్లి తదితర ప్రాంతాల్లో అవార్డులు మంజూరైనప్పటికీ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు సక్రమంగా లేవని, వెంటనే పూర్తి వివరాలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. భూసేకరణ అంశంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తెలిపితే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ఈ సమావేశంలో ఆర్డీవోలు భాగ్యరేఖ, తిప్పే నాయక్, రాఘవేంద్ర, కలెక్టరేట్ సూపరింటెండెంట్ ఆనంద్, తహసీల్దార్ లు, నేషనల్ హైవేస్, ఏపీఐఐసీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments