పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు...* *ఆ ఆరుగురు విద్యార్థినులకు మాత్రం ప్రత్యేకం

 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

*పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా*

విజయవాడ (ప్రజా అమరావతి);


*పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు...*

*ఆ ఆరుగురు విద్యార్థినులకు మాత్రం ప్రత్యేకం


*

*•* దేశంలోనే తొలిసారిగా ఏపీలో వినూత్న ప్రయోగం

*•* దివ్యాంగ విద్యార్థినులకు డిజిటల్ విధానంలో పదో తరగతి పరీక్షలు


ఈ ఏప్రిల్ 3నుండి 15వరకు మన రాష్ట్రంలో పదో  తరగతి పబ్లిక్ పరీక్షల సందడి మొదలవుతుంది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పాఠశాల విద్యాశాఖ ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే అనంతపురం జిల్లాలోని ఆర్‌డిటి (రూరల్ డెవలెప్మెంట్ ట్రస్ట్) ఇన్‌క్లూజివ్ హైస్కూల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థినులు ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఆ విద్యార్థునిలే... ఎక్కలూరు దివ్యశ్రీ, పొలిమెర చైత్రిక, ఏకుల సౌమ్య, మేఖ శ్రీధాత్రి, ఉప్పర నాగరత్నమ్మ, చంచు గారి పావని. వీళ్లంతా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రంలో రాయనున్నారు. ఈ విద్యార్థినులు  దివ్యాంగులు (దృష్టి లోపం గలవాళ్లు). ఇలాంటి విద్యార్థుల కోసం సహాయకులు (స్ర్కైబ్) ద్వారా గత కొన్నేళ్లుగా పరీక్షలు రాయిస్తున్నారు కదా! ఇందులో కొత్తదనం ఏముంది? ఆ కొత్తదనమే ఇక్కడి విశేషం...!

*దేశంలోనే తొలిసారిగా ఏపీలో ప్రయోగం* 

ఆంధ్రప్రదేశ్ లో  తొలిసారిగా పదో తరగతి రాష్ట్ర బోర్డ్ పబ్లిక్ పరీక్షలకు దివ్యాంగ (దృష్టి లోపం ఉన్న) విద్యార్థులు డిజిటల్ విధానంలో పరీక్షలు రాసేందుకు హాజరవుతున్నారు. ఈ విద్యార్థులు ల్యాప్ టాప్ లను ఉపయోగించి స్వయంగా గణితం, సైన్స్, తెలుగు వంటి కఠినమైన సబ్జెక్టులతో సహా అన్ని సబ్జెక్టులను తమంతట తామే డిజిటల్‌గా రాయడానికి సమాయత్తం అవుతున్నారు. హిందీ పరీక్ష వీరికి ఉండదు. అందుకు అనుగుణంగా ఎస్సెస్సీ బోర్డు సంచాలకులు డిజిటల్‌గా ప్రశ్నపత్రాలను రూపొందించి, సరఫరా చేయనున్నారు.  భారతదేశంలోని ఇప్పటివరకు ఏ పోటీ పరీక్షలు గానీ, బోర్డు పరీక్షలు గానీ, UPSC పరీక్షల్లో గానీ దృష్టిలోపం గల విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం (డిజిటల్ విధానం) ద్వారా  రాసే సౌలభ్యం కల్పించలేదు. పదో తరగతి పబ్లిక్  పరీక్షల్లో డిజిటల్‌గా యాక్సెస్ చేసి ప్రశ్న పత్రాలను విద్యార్థులకు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కల్పించడం దేశంలోనే ఇదే మొదటిసారి. 

*డిజిటల్ ప్రశ్నాపత్రం* 

ప్రింటెడ్ పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్‌ను పరీక్షా కేంద్రంలోని ఎగ్జామినేషన్ అథారిటీ సిబ్బంది ఆ ప్రశ్నాపత్రాన్ని డిజిటల్ రూపంలో మారుస్తారు. తర్వాత ఈ ప్రశ్నాపత్రాన్ని విద్యార్థుల కంప్యూటర్లలో లోడ్ చేస్తారు.  ఈ విద్యార్థులు ఎన్.వి.డి.ఏ (నాన్ విజబుల్ డెస్క్ టాప్ యాక్సెస్) సాప్ట్ వేర్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని వింటారు. ఇదివరకే ఈ విద్యార్థులకు టైపింగ్ నేర్చుకోవడం వల్ల జవాబులు టైప్ చేస్తారు. 

పరీక్షల పవిత్రతను కాపాడేందుకు, ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఉండేందుకు ఈ పరీక్షల్లో ఇంటర్నెట్, ఆన్‌లైన్‌ను ఉపయోగించరు.

*వీరికి పరీక్ష సమయం ఇలా..*

సాంప్రదాయిక ముద్రిత ప్రశ్నాపత్రాన్ని అందుబాటులో ఉండే డిజిటల్ (స్క్రీన్ రీడింగ్ ఫ్రెండ్లీ)కి మార్చడానికి దృష్టి లోపం ఉన్న విద్యార్థుల పరీక్షలను ప్రారంభించడంలో 15 నిమిషాల ఆలస్యం జరుగుతుంది. కాబట్టి ఈ విద్యార్థులకు చివరి15నిమిషాలు అదనంగా జోడించడం వల్ల ఆ సమయాన్ని భర్తీ చేయడమవుతుంది. 

గతంలో అన్ని పబ్లిక్ పరీక్షల్లో దృష్టి లోపం ఉన్న విద్యార్థి వినడానికి, ప్రశ్నను చదవడానికి, పరీక్షలు రాయడానికి ఒక (స్రైబ్) రీడర్‌ లేదా లేఖరిని నియమించేవారు.  ఈ ఆరుగురు విద్యార్థులకు మినహాయించి, ఇప్పుడూ ఆ సౌలభ్యం ఉంది. 

*భావితరాలకు.. పునాదులు*

ఈ డిజిటల్ విధానం ద్వారా విద్యార్థినులు స్వయంగా  పరీక్షలు రాయడం వల్ల వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగి భవిష్యత్తులో మరిన్ని పోటీ పరీక్షలు రాయడానికి నాంది పలికి మరింతమందికి ఆదర్శంగా నిలవడమే కాకుండా భవిష్యత్తులో సాంకేతిక రంగంలో నిలబడి ఉన్నతశిఖరాలు అధిరోహించడానికి తొలిమెట్టుగా నిలుస్తారు. భారతదేశంలో దృష్టి లోపం ఉన్నవారిలో ప్రస్తుత నిరుద్యోగ రేటు 99%. అయితే ఈ వినూత్న ప్రయోగం  వల్ల దృష్టి లోపం విద్యార్థులే కాకుండా, ఇతర దివ్యాంగ విద్యార్థులకు కూడా 100% ఉపాధి పొందడానికి ఒక మార్గం సుగమం అవుతుంది.

*విద్యార్థులు పరీక్షలు రాయడం వెనక  కృషి*

పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలు మెరుగుపరచడానికి ప్రత్యేక ఉపాధ్యాయులు (సహిత)  పని చేస్తున్నారు. 

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వీరికి సాంకేతిక పరిజ్ఞానాన్ని  ఉపయోగించి దివ్యాంగులకు ఏ విధంగా బోధించాలనే అంశంపై రూరల్ డెవలెప్మెంట్ ట్రస్ట్ (అనంతపురం),  చక్షుమతి  ఎన్జీవో సంస్థ సౌజన్యంతో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 400 మంది ప్రత్యేక ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. 

డిజిటల్ బోధనపై శిక్షణ పొందిన ప్రత్యేక ఉపాధ్యాయులు మిగిలిన 1.8 లక్షల మందిఉపాధ్యాయులకు శిక్షణ అందించనున్నారు.

మార్చి 2025 నాటికి డిజిటల్ విధానం ద్వారా 100% అరుదైన యోగ్యతను సాధించి, ప్రపంచంలోని మొట్టమొదటి ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్సెస్సీ బోర్డు)గా అవతరించాలన్నదే లక్ష్యం. 

హ్రస్వ దృష్టి (లోవిజన్) గల విద్యార్థులకు మాగ్నిఫైర్, ఆడియో రికార్డర్, వైట్ కేన్స్ (బ్లైండ్ స్టిక్స్), బ్రెయిలీ కిట్స్ వంటివి ఇవ్వడం జరిగింది.

ఎన్.వి.డి.ఏ (నాన్ విజబుల్ డెస్క్ టాప్ యాక్సెస్) సాప్ట్ వేర్ ద్వారాపాఠాలు వినడం వంటివి చేస్తున్నారు.

యూడైస్ ఆధారాల ప్రకారం రాష్ట్రంలో 1350 మంది దివ్యాంగ విద్యార్థులు (దృష్టిలోపం గలవారు)  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు.  4408 ట్యాబుల్లో ప్రాథమిక స్థాయికి 2688, సెకండరీ స్థాయికి 1720  ట్యాబులు అందించనున్నాం.



------------------- *అభిప్రాయాలు:* -------------------

*భావితరాలకు నైపుణ్యాలు అందించడమే లక్ష్యం*

‘‘మన రాష్ట్రంలో పాఠశాలలను డిజిటల్‌గా మార్చేందుకు, మన భావి తరాలను భవిష్యత్తు నైపుణ్యాలతో సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆలోచనలు చేస్తుంది.  దివ్యాంగ విద్యార్థులందరికీ పాఠశాల్లో లేదా ఇంటి వద్ద సమాన అవకాశాలు కల్పించేందుకు మన ప్రభుత్వం అంకితభావంతో  పని చేస్తుంది.’’

- శ్రీ బొత్స సత్యనారాయన, రాష్ట్ర విద్యాశాఖామాత్యులు




*మనం భవిష్యత్తులో ఉన్నాం*

‘‘రానున్న కాలంలో డిజిటల్ దే భవిష్యత్తు. మనం భవిష్యత్తులో ఉన్నాం. పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల అభ్యాస అడ్డంకులను మాత్రమే కాకుండా, వారి శారీరక పరిమితుల కారణంగా ఇంట్లో ఉన్న విద్యార్థులకుకూడా కొత్త డిజిటల్ సాధనాలు ఇవ్వడం జరిగింది. వారికి డిజిటల్ టూల్స్‌తో శిక్షణ ఇవ్వడం, టాబ్లెట్ కంప్యూటర్ ఇవ్వడం వల్ల వాళ్లు నిజంగా తరగతి గదిలో ఉండే చదువుకుంటున్నట్లు అనుభూతి పొందుతారు. 

- శ్రీ ప్రవీణ్ ప్రకాష్,ఐ.ఎ.ఎస్., , ప్రిన్సిపల్ సెక్రటరీ, పాఠశాల విద్య


*కొత్త మార్పునకు స్వాగతం*

‘‘ సమగ్ర శిక్షా ద్వారా దివ్యాంగ విద్యార్థులకు అనేక సదుపాయాలు కల్పిస్తున్నాం. అందులో భాగంగా భవిత కేంద్రాలు నిర్వహణ, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహణ, ఉచిత ఉపకరణాలు, అలవెన్సులు అందజేయడం వంటివి చేస్తున్నాం. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా  డిజిటల్ విధానంలో పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న ఈ విద్యార్థులకు నా ప్రత్యేక అభినందనలు. ఇలాంటి మార్పును మనసారా స్వాగతిస్తున్నాను.’’

- శ్రీ ఎస్.సురేష్ కుమార్, ఐ.ఎ.ఎస్., ,  కమిషనర్, పాఠశాల విద్య, ఎస్పీడీ, సమగ్ర శిక్షా



*వారికి ప్రోత్సాహం అవసరం*

‘‘సాధారణ విద్యార్థుల కంటే దివ్యాంగ విద్యార్థులు ఏ రంగంలోనూ తీసిపోరు. ఒకప్పుడు ఇలాంటి విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా అన్ని విధాల తోడ్పడుతూ, వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. దీంతోపాటు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాంకేతికత జోడించడం వల్ల వీళ్లు ఉన్నత శిఖరాలు అందుకునేందుకు ఆస్కారం ఉంది. అయితే దీనికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల తోడ్పాటు ఎంతైనా అవసరం’’.

- శ్రీ బి.శ్రీనివాసరావు, ఐ.ఎ.ఎస్., గారు,  ఎస్ఏపీడీ, సమగ్ర శిక్షా






Comments