పారిశుధ్య పరిరక్షణ అందరి బాధ్యత

 పారిశుధ్య పరిరక్షణ అందరి బాధ్యత



- నగర పాలక సంస్థకు సహకరించాలి


- రోడ్డుపై ఎక్కడికక్కడ చెత్తా చెదారం వేస్తే ఎలా?


- 'గుడ్ మార్నింగ్ రాజమండ్రి'లో ఎంపీ మార్గాని భరత్ రామ్


రాజమండ్రి, మార్చి 20 (ప్రజా అమరావతి): నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో, పారిశుధ్య నిర్వహణలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం చాలా అవసరమని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజమండ్రి నగరంలోని 24వ వార్డు గీత అప్సరా థియేటర్ ప్రక్క వీధి కేవీఆర్ స్వామి రోడ్డు నుండి 'గుడ్ మార్నింగ్' కార్యక్రమం నిర్వహించారు. రోడ్డును ఆనుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారితో ఎంపీ భరత్ ముచ్చటించారు. ఆకు కూరలు విక్రయించుకునే మహిళల ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉదయమే వచ్చి ఆకు కూరలు అమ్ముకుంటే రోజుకు రూ.200లు వస్తాయని ఓ మహిళ చెప్పింది. మరి కుటుంబం ఎలా గడుస్తుందని ఎంపీ ప్రశ్నించారు. మాకు జగనన్న పెన్షన్ వస్తుందని, జగనన్న వల్లనే మా కుటుంబం ఎటువంటి భారం లేకుండా గడిచిపోతోందని ఆనందంగా ఆ మహిళ చెప్పింది. సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆ చిరు వ్యాపారాలు చేసుకునే ప్రతీ ఒక్కర్నీ ఎంపీ భరత్ అడిగారు. ఆ తరువాత అక్కడ చెత్తా చెదారాన్ని చూసి..ఇలా వ్యర్థాలను వదిలేయకండి..డస్ట్ బిన్లలో వేస్తే నగర పాలక సిబ్బంది వచ్చి తీసుకువెళతారని చెప్పారు. నగరాన్ని అందంగా తీర్చిదిద్దడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని, అది మన బాధ్యత కాదన్నట్టు ఉండకూడదని హితవు పలికారు. ఒక చోట అపారిశుద్ధ్యాన్ని చూసి నగర పాలక శానిటరీ అధికారులకు, సిబ్బందికీ 'ఇదేంటిది..ఇలా ఉంటే ఎలా..ఇలాంటివే గమనించాలి..నిర్లక్ష్యం పనికి రాదని'..సున్నితంగా మందలించారు. మెయిన్ రోడ్డుపై జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ భరత్ పరిశీలించారు. త్వరితగతిన పనులు జరగాలని విద్యుత్ శాఖ తదితర అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, 24వ వార్డు ఇన్చార్జి అరవ సురేష్, రాజ్ కుమార్ బెజవాడ, కాంతారాం పాటిల్, ఇజ్జరపు శ్రీను, అందనాపల్లి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Comments