ప్రజా సంక్షేమమే..ప్రభుత్వ విధానం..హ్యూమన్ కేపిటల్ మా నినాదం*

 



*రాష్ట్ర ఆర్థిక ప్రగతి సాధించిన మొదటి 5 రాష్ట్రాలలో ఏపీ ఒకటి: ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*ప్రజా సంక్షేమమే..ప్రభుత్వ విధానం..హ్యూమన్ కేపిటల్ మా నినాదం*


*సంక్షేమం వద్దని ప్రతిపక్షాలు ప్రజల ముందు చెప్పగలవా అంటూ ఆర్థిక మంత్రి సవాల్*


*ఐ.టీ.ఐ, పాలిటెక్నిక్, నైపుణ్యాభివృద్ధి సంస్థలను రీడిజైన్ చేశాం*


*అప్పులు, వడ్డీలు, సంక్షేమ పథకాలు, డీబీటీ, జాతీయ రహదారులు,కేటాయింపులు, వేతనాలు,ప్రాజెక్టులన్నింటిపై బుగ్గన మార్క్ క్లారిటీ*


*విద్య, వైద్యం,మౌలిక సదుపాయాలకే సీఎం జగన్ ప్రభుత్వం పెద్దపీట*


*పుట్టుకతో అందరూ సమానం..మా ప్రభుత్వానికి ప్రజలంతా సమానం..ఇదే మా సిద్ధాంతం*


*శాసనమండలి సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ నాలుగేళ్ల కృషిని వెల్లడించిన ఆర్థిక మంత్రి*


అమరావతి, మార్చి, 23 (ప్రజా అమరావతి); రాష్ట్ర ఆర్థిక ప్రగతి సాధించిన మొదటి 5 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని చెప్పడానికి గర్విస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. గ్రోత్ రేట్ సాధించడంలో కొన్ని కారణాలలో సంక్షేమం ఒకటని మంత్రి స్పష్టం చేశారు.

సంక్షేమం వద్దని ప్రతిపక్షం ప్రజల ముందు చెప్పగలదా? అందుకు కట్టుబడి ఉండగలదా? అంటూ మంత్రి బుగ్గన విపక్షాలకు సవాల్ విసిరారు.  2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఎమ్ఎల్ సీలు రవీంద్ర బాబు, విఠపు బాలసుబ్రమణ్యం, ఇందుకూరి రఘు రాజు, ఐలా వెంకటేశ్వరరావు, వాకాటి నారాయణ రెడ్డి అభిప్రాయాలపై  సమాధానంగా గురువారం శాసనమండలి సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ నాలుగేళ్ల కృషిని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.


*రాష్ట్ర స్థూల ఉత్పత్తి-వృద్ధిరేటు*


ఆర్థిక వృద్ధి రేటుపై  కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన  నివేదికల ప్రకారం పర్యవేక్షిస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన పేర్కొన్నారు.2019-20 రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,25,000 కోట్లు కాగా..2022-23 నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.13, 17,000 కోట్లు చేరిందని మంత్రి వివరించారు. ప్రస్తుత ధరల ప్రకారం 2019-20 లో 5.97 % వృద్ధి రేటు నమోదు కాగా..2022-23 లో 16.22 శాతం గ్రోత్ రేట్ సాధించినట్లు తెలిపారు.గత రెండేళ్ల గణాంకాలు పరిశీలిస్తే 2021-22లో 1,77,000 కోట్లు అదనంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధించామన్నారు.2022-23 నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి 1,83,000 కోట్లు అదనంగా నమోదైనట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. 


*ప్రజా సంక్షేమమే మా విధానం..పేద ప్రజల క్షేమమే మా నినాదం*



ప్రజా సంక్షేమమే మా విధానం..పేద ప్రజల క్షేమమే మా నినాదం అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. పేద ప్రజలందరికీ ప్రభుత్వం అన్ని విధాలుగా సాయమందించాలన్న లక్ష్యంలో ఎన్ని అవరోధాలు వచ్చినా అడుగు ముందుకే పడుతుందని ఆయన స్పష్టం చేశారు.దుర్భరమైన, విపత్కర, విపత్తు సమయాల్లో నగదు బదిలీ ప్రక్రియ సరైనదని మేధావులు, నిపుణుల అభిప్రాయాన్ని మంత్రి ప్రస్తావించారు.గ్రోత్ రేట్ సాధించడంలో కొన్ని కారణాలలో సంక్షేమం ఒకటని మరవకూడదన్నారు.పరిపాలనలోని సరికొత్త ఒరవడి సృష్టిస్తూ  ఉత్పత్తి పెంచాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు.


*వృద్ధి రేటు సాధించడానికి ప్రభుత్వం అవలంభించిన మార్గాలు*


అవినీతికి తావులేకుండా పారదర్శకతతో పాలన అందిచడం వృద్ధిరేటు సాధించడంలో కీలకమైందని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. కొన్ని పద్ధతులు, సిద్ధాంతాలు , విధానాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.వృద్ధి రేటు సాధనలో  సంక్షేమం ఒకటన్నారు.మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ..మహిళా సాధికారత కోసం  వారిని సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు.సమాజంలోని ప్రజలను పెద్దఎత్తున భాగస్వామ్యం చేయడం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటిగా మంత్రి చెప్పారు.కేంద్రం ద్వారా అందే నిధుల సమీకరణకు అనుగుణంగా  రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలను రూపకల్పన చేయడం కూడా కలిసి వచ్చిందన్నారు.



 *గత టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో కేటాయింపులు ఇలా*


ఆరోగ్యరంగానికి పెద్దపీట వేస్తూ 13వేల గ్రామ పంచాయతీలలో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు చేసినట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. పీహెచ్ సీల స్థాయిలో ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

104,108 సేవలను ఎవరూ ఊహించని విధంగా వాటి సామర్థ్యం పెంచి క్షేత్రస్థాయికి అందుబాటులోకి తీసుకువెళ్లామన్నారు. ఆరోగ్యశ్రీ సహా మెడికల్ కాలేజీలు, సూపర్, మల్టీ స్పెషాలిటీ వంటి మౌలిక వసతుల కల్పనకు వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.క్లాస్ రూంలు, టాయిలెట్లు, మిడ్ డే మీల్ , స్కాలర్ షిప్ లు, విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలని సంక్షేమ వ్యయం కింద జమకట్టకూడదన్నారు. 2014-19 వరకూ ఐదేళ్ల టీడీపీ సమయంలో రోడ్ల కోసం 25,213 కోట్లు మంజూరు చేస్తే, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మూడేళ్ల కాలంలోనే  2019-22 వరకూ  రూ.21,226 కోట్లు ఖర్చుపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కలిసిమెలిగిన కాలంలోనూ టీడీపీ తన ఐదేళ్ల కాలంలో జాతీయ రహదారుల నిమిత్తం రూ.10, 848 కోట్లు సాధించిందన్నారు. మూడేళ్ల వైసీపీ ప్రభుత్వ కాలంలో రూ.23,500 కోట్ల జాతీయ రహదారులను తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు.


*ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ఢిల్లీకి వెళ్లడంపై దుష్ప్రచారం..ఇదిగో పర్యటనలకు సాక్ష్యాలివే!*


ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన అప్పుల కోసం పోయారని తరచూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తుండడంపై  మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రం వద్దకు వెళ్లినా వెళ్లకున్నా పరిమితులను బట్టి వచ్చే అప్పుు వస్తుందని, పరిమితికి మించి  టీడీపీ ప్రభుత్వం  అప్పులు చేయడం వలన ప్రస్తుత ప్రభుత్వానికి హక్కుగా రావలసిన అప్పులే రావడం లేదని మంత్రి తెలిపారు. రోడ్లు, జలవనరులు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, కేంద్రంతో అనుసంధానమై వివిధ పథకాల ద్వారా నిధులు సాధించడం కోసం ఇలా ఎన్నో అంశాలపై ఢిల్లీలో పర్యటించామన్నారు.డీబీటీ పథకాల రూపంలో గత ప్రభుత్వం , ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మధ్య ఎంత తేడా ఉందో గణాంకాలను శాసనమండలిలో మంత్రి బుగ్గన వివరించారు. 2022-23 కాలానికి గానూ సవరించిన అంచనాల ప్రకారం రూ.47, 240 కోట్లు ఖర్చు చేయగా..ఈ ఆర్థిక సంవత్సరంలో 2023-24 ఏడాదికి గానూ 54,228 కోట్లు కేటాయించామన్నారు. వైఎస్ఆర్ పింఛన్ కానుక కింద  2022-23కి గానూ రూ.17,850 కోట్లు ఖర్చుపెట్టగా..2023-24 బడ్జెట్ లో 21,500 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద గతేడాది రూ.3,988 కోట్లు కేటాయించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,020 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.విద్యాదీవెన కింద గతేడాది  రూ.2,840 కోట్లు ఖర్చు పెట్టగా ఈ ఏడాది కూడా అంతే మొత్తంలో ఖర్చే చేయనున్నట్లు తెలిపారు.వసతి దీవెన కింద గతేడాది రూ.2,083 కోట్లు వెచ్చించగా ఈ వార్షిక బడ్జెట్ లోనూ రూ.2,200 కోట్లు కేటాయించామన్నారు. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 45 లక్షల మంది తల్లులకి రూ.19,600 కోట్లు ఇప్పటిదాకా జమ చేశామన్నారు. ఇప్పటిదాకా వసతి దీవెన 19 లక్షల మంది పిల్లలకు రూ.3,365 కోట్లు ఖర్చుపెట్టామన్నారు. విద్యా దీవెన కింద 25 లక్షల మంది విద్యార్థులకు రూ.9,300 కోట్లు వెచ్చించామన్నారు. ఆసరా కింద 78,75,000 మందికి రూ.12,757 కోట్లు గత నాలుగేళ్లూ జమ చేశాం, ఈ ఏడాది రూ.6500 కోట్లు ఖర్చు పెట్టనున్నామన్నారు. చేయూత కింద రూ.26,40,4000 మందికి విజయవంతంగా నాలుగేళ్లు రూ.14 వేల కోట్లు అందించగలిగామన్నారు.ఎన్నికలకు 3 నెలల ముందు పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2వేలు చేసింది టీడీపీ అని విమర్శించారు.


పింఛన్ల కోసం టీడీపీ ఐదేళ్ల కాలంలో రూ.27,627 కోట్లు మాత్రమే కేటాయించిందని..ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లకే రూ.66,823 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. 


మైనారిటీల సంక్షేమం కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.2,502 కోట్లు కాగా ఈ ప్రభుత్వం రూ.6,866 కోట్లు ఖర్చు పెట్టింది


కాపు సంక్షేమం కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.2,055 కోట్లు కాగా వైసీపీ ప్రభుత్వం రూ.11,366 కోట్లు ఖర్చు పెట్టింది


బీసీ సంక్షేమం కోసం టీడీపీ వెచ్చించింది రూ.11,700 కోట్లు , జగన్  ప్రభుత్వం రూ.66,196 కోట్లు 


క్రాప్ ఇన్సూరెన్స్ కింద టీడీపీ ఖర్చు పెట్టింది రూ.14,33 కోట్లు కాగా వైసీపీ ప్రభుత్వం ఏకంగా రూ.5,795 కోట్లు ఖర్చు పెట్టింది


రైతులకు వడ్డీ లేని రుణాల కింద గత ప్రభుత్వం రూ.651 కోట్లు కాగా, ప్రస్తుత ప్రభుత్వం నాలుగేళ్లలోనే రూ.1700 కోట్లు


నాడు-నేడు కింద జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.7,972 కోట్లు ఖర్చు పెట్టింది. గత ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు.


గత ప్రభుత్వం ఆస్పత్రుల మౌలిక సదుపాయాల కోసం రూ. 1114 కోట్లు ఖర్చు పెట్టగా..నాడు-నేడు కింద ఈ ప్రభుత్వంలో ఆస్పత్రుల గతిని మార్చేలా రూ.2269 కోట్లు వెచ్చించింది


మధ్యాహ్న భోజన పథకం కింద, గత టీడీపీ ప్రభుత్వం రూ.2,673 కోట్లు, మన ప్రభుత్వం రూ.4,638 కోట్లు ఖర్చు పెట్టింది


ఆరోగ్యశ్రీ కింద రూ.4,476 కోట్లు టీడీపీ ఖర్చు చేయగా, వైసీపీ ప్రభుత్వం రూ.7,099 కోట్లు ఖర్చు పెట్టింది


వడ్డీ లేని రుణాల కింద గత ప్రభుత్వం రూ.2,270 కోట్లు కాగా..ఈ ప్రభుత్వంలో రూ.4,752 కోట్లు


చిన్నారులకు సంపూర్ణ పోషణ కింద గత టీడీపీ రూ.2,985 కోట్లు ఖర్చుపెట్టగా, వైసీపీ రూ.6,167 కోట్లు వెచ్చించింది


108 కింద గత ప్రభుత్వం రూ.451 కోట్లు వెచ్చించగా  ఈ ప్రభుత్వంలో రూ.996 కోట్లు ఖర్చు చేసింది


ఆరోగ్యశ్రీ కింద  55.38 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు


ఉచిత విద్యుత్, విద్యుత్ రాయితీ కింద, రైతులు, ఎస్సీ,ఎస్టీలకు గత ప్రభుత్వంలో  రూ.12,374 కోట్లు ఖర్చు చేయగా..వైసీపీ ప్రభుత్వం రూ.23,022 కోట్లు ఖర్చు పెట్టింది


గత ప్రభుత్వంలో వేతనాలు, పెన్షన్ దారుల కోసం రూ.2,18,046 కోట్లు కేటాయింపులు చేయగా ఈ ప్రభుత్వం ఇప్పటికే రూ.2,78,460 కోట్లు ఖర్చు పెట్టింది


*మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్*


స్వర్గీయ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు మీద సంగం బ్యారేజీని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి గత సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం జరిగినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన వెల్లడించారు. కావలి, కణపూర్ కెనాల్ , పెన్నా డెల్టా 3,80,000 ఎకరాలకు స్థిరీకరణకు సంగం బ్యారేజ్ దోహదపడుతుందన్నారు. సంగం, పొదలకూరు రోడ్డు అనుసంధానం, తాగునీరు, భూగర్భ జలాల పెరుగుదల వంటి  అనేక ఉపయోగాలు ఈ ప్రాజెక్టు ద్వారా పరిసర ప్రజలకు అందుతాయన్నారు. అర టీఎంసీ బ్యారేజీ దగ్గర నీటి నిల్వ సామర్థ్యం మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ సొంతమన్నారు. వరదల పరిశీలన, నియంత్రణలకు సంగం బ్యారేజీ ఉపయోగకరమన్నారు. బ్యారేజ్ కెనాల్ ను పర్యాటక కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. బడ్జెట్, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రాజెక్టుల నిర్మాణం, ఉచిత పథకాల గురించి చంద్రబాబు మనసులో మాట పుస్తకంలోని కొన్ని పంక్తులను ప్రస్తావించి ప్రజల సంక్షేమంపై టీడీపీ ప్రభుత్వ విరుద్ధ స్వభావానికవి నిదర్శనమని విమర్శిస్తూ మంత్రి బుగ్గన తన ప్రసంగాన్ని ముగించారు.


 

Comments