విశాఖ -బలమైన ఆర్ధిక కేంద్రం...


ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్, విశాఖపట్నం (ప్రజా అమరావతి);


*గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ – 2023లో డెలిగెట్స్‌ను ఉద్దేశించి మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.* 


*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:*


గౌరవనీయులైన రాయబారులకు, కాన్సుల్‌ జనరల్స్, విదేశీ దౌత్యవేత్తలకు, నా మంత్రివర్గ సహచరులకు, పారిశ్రామిక ప్రతినిధులకు, వ్యాపారవేత్తలకు, అధికారులకు, ఆహుతులకు శుభోదయం.


*రూ.13 లక్షల కోట్లు- 340 ఎంఓయూలు* 

ఈ సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్ల విలువైన 340 పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలతో ముందుకు రావడం రాష్ట్రానికి గర్వకారణం. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 రంగాల్లో దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 


*తొలిరోజు రూ.11.85 లక్షల కోట్లకు...*

ఈ రోజు రూ.11.85 లక్షల కోట్లు విలువైన పెట్టుబడులకు సంబంధించిన 92 ఎంఓయూలును  కుదుర్చుకోనున్నాం. వీటి ద్వారా దాదాపు 4లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మిగిలిన 248 ఎంఓయూలు రేపు కార్యరూపం దాల్చనున్నాయి.  ఈ ఒప్పందాల విలువ రూ.1.15 లక్షల కోట్లు కాగా... వీటి ద్వారా దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 

రిలయెన్స్‌ గ్రూపు, ఆదానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, జిందాల్‌ గ్రూప్, మోండలీస్, పార్లీ, శ్రీ సిమెంట్స్‌ వంటి కంపనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. ఈ సందర్భంగా వారికి ధన్యవాదమలు. 


*జీఐఎస్‌కి స్వాగతం...*

ఆంధ్రప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు – 2023 కు వచ్చి, ఈ సదస్సులో భాగస్వాములైన మీ అందరికీ  కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘనస్వాగతం పలుకుతున్నాను. 

మిమ్మల్ని అందర్నీ కలుసుకునే ఈ సదస్సు ద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులందరికీ మేం ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. మీరు మాకు చాలా చాలా ముఖ్యమైన వారు. మా రాష్ట్రం యొక్క బలాలు, మేము కల్పించే విభిన్న అవకాశాలను, వ్యాపార రంగంలో స్నేహపూర్వక వాతావరణం, బలమైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్యకరమైన పోటీ, ఆవిష్కరణల విషయంలో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీ భాగస్వామ్యం ద్వారా స్థిరమైన, దీర్ఘకాలిక వృద్ధి సాధించడంపట్ల మేం సంకల్పంతోనే ఉన్నాం. 


*విశాఖ -బలమైన ఆర్ధిక కేంద్రం...



*

పలు ప్రభుత్వ, మరియు ప్రైవేట్‌ రంగ యూనిట్లు, పోర్ట్‌ ఆధారిత మౌలిక సదుపాయాలు, మెడ్‌టెక్‌ జోన్‌ మరియు టూరిస్ట్‌ హాట్‌స్పాట్‌లతో విశాఖపట్నం అత్యంత బలమైన బలమైన ఆర్థిక కేంద్రంగా ఆవిర్భవించింది. విశాఖపట్నంలో ఈవెంట్‌ను నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. విశాఖపట్నం కేవలం పారిశ్రామిక రంగంలో బలమైన నగరమే కాకుండా, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఈ సదస్సును నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది.


2023 సంవత్సరం భారతదేశానికి చాలా ముఖ్యమైన సంవత్సరం, ఈ ఏడాది సెప్టెంబరులో ఒన్‌ఎర్త్, ఒన్‌ ఫ్యామిలీ, ఒన్‌ ఫ్యూచర్‌ ‘‘ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’’ అనే థీమ్‌తో జీ–20 సదస్సును నిర్వహిస్తోంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో– దేశం నిర్వర్తిస్తున్న జీ –20 అధ్యక్ష బాధ్యతలు మనకు అత్యంత కీలకం అవుతాయని బలంగా నమ్ముతున్నాను. మార్చి చివరివారంలో జరిగే జి–20 వర్కింగ్‌ కమిటీ  సమావేశాలకు విశాఖ నగరం కూడా ఆతిథ్యం ఇస్తోంది. 


ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్‌ ఒకటి. ఈదేశం తన సమర్థతను చాటుకుని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అగ్ర గమ్యస్థానాలలో ఒకటిగా ఉద్భవించింది.


*అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌*

భారత్‌ను వృద్ధిపథంలో నడిపే అగ్రగామి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. సమృద్ధిగా ఉన్న సహజ వనరులు, ఖనిజ సంపద, 974 కి.మీ తీరప్రాంతం మొదలైన వాటితో సహా అనేక సహజమైన, ప్రకృతి సిద్ధమైన బలాలు, సానుకూలతలు రాష్ట్రానికి ఉన్నాయి. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరుపోర్టులకు తోడు కొత్తగా రానున్న మరో నాలుగు పోర్టులతో రాష్ట్రానికి బలమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 6 విమానాశ్రయాలు ఉన్నాయి, వీటిలో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు. దేశంలో అభివృద్ధి చెందుతున్న పదకొండు పారిశ్రామిక కారిడార్లలో మూడు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. వీటిలో 10 పారిశ్రామిక నోడ్స్‌ఉన్నాయి. అనేక ప్రముఖ విద్యాసంస్థలు, వ్యూహాత్మక ప్రాంతాలతో సానుకూలతలు, ల్యాండ్‌ బ్యాంక్, నైపుణ్యం కలిగిన యువత, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక – వ్యాపార పర్యావరణ వ్యవస్థ ఇక్కడ ఉంది. అంతేకాదు.. పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చేందుకు అవసరమైన విధానాల కార్యాచరణ ప్రణాళికలు సహా చురుకైన, సానుకూలత ఉన్న  ప్రభుత్వం ఇక్కడ ఉంది. 


*ఏపీ- దేశంలో అత్యధిక జీస్‌డీపీ*

అంతేకాకుండా 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 11.43% జీఎస్‌డీపీ వృద్ధిరేటు సాధించింది, ఇది దేశంలోనే అత్యధికం. ఇంకా, గత మూడు సంవత్సరాలల్లో ఎగుమతులు కూడా వృద్ధిచెందాయి. సీఏజీఆర్‌(సగటు వార్షిక వృద్ధిరేటు) 9.3% నమోదయ్యింది. సుస్థిరమైన, స్థిరమైన అభివృద్ధి కోసం మేం చేస్తున్న ప్రయత్నాలను నీతి ఆయోగ్‌ కూడా గుర్తించింది. సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణ అంశాల్లో 2020–21 ఏడాదికి ఇచ్చిన  ఎస్‌జీడీ ఇండియా ఇండెక్స్‌ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం నంబర్‌ 3వ స్థానంలో నిలిచింది. 

అట్టడుగు స్థాయిలో పరిపాలనను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చింది. వ్యాపార వాతావరణాన్ని సృష్టించడంకోసం, స్థిరమైన విధానాలు, పోటీతత్వాన్ని పెంపొందించడానికి, తక్కువ రిస్క్ పెట్టుబడి వాతావరణాన్ని కల్పించడానికి, పారదర్శకతను పెంపొందించడానికి ఈ చర్యలు తీసుకుంది. 


*నాలుగు అత్యంత ప్రాధాన్యాంశాలు...*

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చే, ఆర్థిక మరియు పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన నాలుగు ప్రధాన అంశాలను ఇక్కడ స్పష్టంగా చెప్పదలచుకున్నాను. 

1. గ్రీనిఫికేషన్‌( పర్యావరణ సానుకూలత విధానాలు)

2. ఇండస్ట్రియల్‌ – లాజిస్టిక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 

3. డిజిటలైజేషన్‌

4.ఎంటర్‌ ప్రైజ్‌ మరియు స్కిల్‌ డెవలప్మెంట్‌


గ్రీనిఫికేషన్‌కు ముందు ఒక అంశాన్ని చెప్పదలచుకున్నాను. డీ కార్బనైజేషన్‌ అనేది అత్యంత ముఖ్యమైనది, అత్యవసరమైంది కూడా. సంప్రదాయేతర ఇంధనం దిశగా మార్పు చెందడానికి మేం అత్యంత శ్రద్ధపెట్టాం. సంప్రదాయేతర ఇంధన వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయి. 82 గిగావాట్ల సంప్రదాయేతర ఇంధనం ఉత్పత్తిని సాధించానికి రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి. సోలార్, విండ్, పంప్‌డ్‌ స్టోరేజీ ఈ మూడు రకాల ఇంధనాలు సమ్మిళితంగా పొందడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఈ ప్రాజెక్టులు ప్రారంభించడానికి అవసరమైన ల్యాండ్‌ పార్సిళ్లను కూడా ప్రభుత్వం గుర్తించింది. 


ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక భౌగోళిక లక్షణాలు ఉన్నాయి. 34 గిగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టులకు అవకాశం ఉంది. 24 గంటలపాటు ఈ ప్రాజెక్టు నుంచి సంప్రదాయేతర ఇంధనాన్ని పొందవచ్చు. అలాగే అతి పెద్దదైన తీర ప్రాంతాన్ని వినియోగించుకుని గ్రీన్‌ హైడ్రోజన్‌ వినియోగం, ఉత్పత్తి, ఎగుమతులకు రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయి. 


ఇండస్ట్రియల్‌ మరియు లాజిస్టిక్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ విషయంలో భారతదేశానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పుతీరంలో ఒక గేట్‌వేగా చెప్పదలచుకున్నాను.974 కి.మీ. పొడవైన తీరప్రాంతం రాష్ట్రానికి ఉంది. సముద్ర రవాణా, సంబంధిత అంశాల్లో రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా నాలుగు పోర్టులను నిర్మిస్తున్నాం. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు మరియు కాకినాడల్లో కొత్త పోర్టులను నిర్మిస్తున్నాం. ఇప్పుడు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరు పోర్టులకు ఇవి అదనం. వీటికి సమీపంలో పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణకు అవకాశాలున్నాయి. 


*ఏపీ- మూడు పారిశ్రామిక కారిడార్లు.*

దేశంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే. వైజాగ్‌– చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్, చెన్నై – బెంగుళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్, హైదరాబాద్‌– బెంగుళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్లు రాష్ట్రంలో ఉన్నాయి. డిమాండ్‌ఉన్న ప్రాంతాలకు ఈ కారిడార్లు సమీపంలో ఉన్నాయి. ఈ మూడు కారిడార్లకు పోర్టులతో అద్భుతమైన రవాణా అనుసంధానం కూడా ఉంది. ఈ పారిశ్రామిక కారిడార్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న 10 నోడ్స్‌– ఇండస్ట్రియల్‌ హబ్స్‌గా తయారవుతాయి. 


సరుకు రవాణాలో సమయాన్ని, ఖర్చులను ఆదా చేయడానికి రాష్ట్రంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో 5 మల్టీమోడల్‌ లాజిస్టిక్‌  పార్కులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. సముద్ర ఉత్పత్తులను పెంచడానికి, ప్రాససింగ్‌ల కోసం కొత్తగా 9 హార్బర్లను కూడా కడుతున్నాం. 


అంతేకాక వివిధ పారిశ్రామిక రంగాలకు సంబంధించి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, పుడ్‌ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్‌ తదితర రంగాలకు సంబంధించి నిర్దిష్టంగా క్లస్టర్లు ఉన్నాయి. ఇవి చక్కటి మౌలిక సదుపాయాలను, నిపుణులైన మానవ వనరులను అందిస్తాయి. 


*మెడ్‌టెక్‌ కంపెనీలకు పుట్టినిల్లు ఏపీ.* విశాఖపట్నంలో ఉన్న మెడ్‌టెక్‌ జోన్ల్‌ అనేక మెడ్‌టెక్‌ కంపనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఈ రంగంలో మరింత వృద్ధికోసం ప్లగ్‌ అండ్‌ ప్లే పద్ధతిలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. దీనివల్ల సమయం, ఖర్చులు ఆదా అవుతాయి. 


ఇక మూడో స్తంభంగా నేను పేర్కొన్న డిజిటలైజేషన్‌ కూడా అత్యంత ముఖ్యమైనది. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వం సింగిల్‌ పోర్టల్‌ సేవలను అందిస్తోంది. 23 విభాగాల్లో 90 రకాల వ్యాపార సేవలు ఈ పోర్టల్లో లభిస్తాయి. వ్యాపారాలు ప్రారంభించడానికి అవసరమైన అనుమతులను 21 రోజుల్లో అందిస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణగా మేం నెలకొల్పిన గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా 540 రకాల సేవలను ఏపీ ఇ–సేవల ద్వారా పౌరులకు అందిస్తున్నాం. 


*ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో తొలిస్ధానం.*

వేగవంతమైన ఎంటర్ర్‌ప్రైజెస్‌ డెవలప్‌మెంట్‌ సాధించడానికి అనుకూలమైన వ్యాపార వాతావరణం అవసరమని నేను బలంగా నమ్ముతాను. పెట్టుబడి దారులకు చక్కటి వ్యాపార వాతావరణాన్ని కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దృష్టిపెట్టింది. ఈజ్‌ ఆఫ్‌ డూయినంగ్‌ బిజినెస్‌లో దేశంలోనే మొదటి స్థానంలో రాష్ట్రం ఉండడం దీనికి నిదర్శనం.  గడచిన మూడు సంవత్సరాలుగా రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలోని ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో వాణిజ్య మరియు పారిశ్రామిక వేత్తల నుంచి స్వీకరించిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించింది. రాష్ట్రం అత్యధికంగా 97.89శాతం సానుకూల ఫీడ్‌ బ్యాక్‌తో ప్రథమ స్థానంలో నిలిచింది. పరిశ్రమలు పెట్టేవారికి మరింత సులభతరంగా ఉండడానికి మేం సానుకూలంగా వ్యవహరించి కొన్ని చట్టాలను సవరించడమో, లేక వాటిని తొలగించడమో చేశాం. 

పారిశ్రామికంగా అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే మంచి మౌలిక సదుపాయాలు, మంచి వ్యాపార వాతావరణంతో పాటు, నైపుణ్యం ఉన్న మాన వనరులు కూడా అత్యంత కీలకమైనవి. దీనికోసం దాదాపు 26 చోట్ల నైపుణ్యాభివృద్ధి  కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. పారిశ్రామిక సంస్థల సహకారంతో  స్థానిక యువకుల్లో నైపుణ్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేయడానికి ఈ కాలేజీలను పెడుతున్నాం.  


*ఫోన్ కాల్‌ దూరంలో ప్రభుత్వం...*

ఆంధ్రప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 సందర్భంగా ఈ రెండు రోజుల్లో రాష్ట్రానికున్న బలాలు, సానుకూలతలను మేం ప్రదర్శిస్తాం. రాష్ట్రంలో ఉన్న పుష్కలమైన అవకాశాలపై అవగాహన చేసుకునేందుకు వీలుగా మీమీ బృందాలను వివిధ అంశాలపై ఏర్పాటుచేసిన సెషన్స్‌లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తిచేస్తున్నాను. వ్యాపారాలు చేసేవారికి మంచి వాతావరణం కల్పించేందుకు మేం చాలా కృతనిశ్చయంతో ఉండడమే కాకుండా, మీకు ఎప్పుడు ఏం అవసరమైనా సహకారం అందించేందుకు కేవలం మేం ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటామని అందరికీ తెలియజేస్తున్నాను. 


ఈ సదస్సులో భాగస్వాములు అయినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కార్యనిర్వాహక రాజధాని కానున్న విశాఖపట్నంలో, అందమైన విశాఖపట్నంలో అద్భుతమైన సమయాన్ని గడపాలని ఆశిస్తున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

Comments