సమన్వయంతో పనిచేసి శ్రీ కోదండరామస్వామి వారి కల్యాణోత్సవం ను విజయవంతంగా నిర్వహించండి.

         


*సమన్వయంతో పనిచేసి శ్రీ కోదండరామస్వామి వారి కల్యాణోత్సవం ను విజయవంతంగా నిర్వహించండి**మార్చి 31 నాటికి శ్రీ సీతారాముల కల్యాణం  ఏర్పాట్లు పూర్తి చేయండి*  


*భక్తులంతా కోదండరాముని కల్యాణం తనివితీరా చూసేలా సదుపాయాలుండాలి* 


*జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి*


కడప, మార్చి 19 (ప్రజా అమరావతి): జిల్లా అధికారులు,టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి ఒంటిమిట్టలో ఏప్రిల్ 5 న జరిగే  శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి ..లు సంబంధిత అధికారులను ఆదేశించారు.


ఆదివారం స్థానిక టిటిడి కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలన భవనం సమావేశపు హాలులో... టీటీడీ ఈవో ధర్మా రెడ్డి, ఎస్పీ అన్బు రాజన్, జేసి సీఎం సాయికాంత్ వర్మ, టీటీడీ జెఈఓ వీరబ్రహ్మం లతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, టీటీడీ అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ వి.విజయ్ రామరాజు  మాట్లాడుతూ.. శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ..ఏప్రిల్ 5వ తేదీన జరిగే  సీతారాములవారి కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున.. పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు  ప్రముఖులు, అత్యంత ప్రముఖులు రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లను ప్రణాళికా  సిద్ధం చేయాలన్నారు.  జిల్లా అధికారులు, టీటీడీ    అధికారులు  సంయుక్తంగా నిర్వహించాల్సిన పనులపై ఆయా విభాగాలకు సంబంధించి  అధికారులతో ప్రత్యేక టీములుగా నియమించామన్నారు.  ఇందులో భాగంగా భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆర్టీసీ బస్సుల ఏర్పాటు,హెల్ప్ డెస్క్ లు, సైన్ బోర్డులు, పారిశుధ్యం, విఐపి పాసులు, పార్కింగ్ ప్రదేశాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాట్లకు సంబంధించి  కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. వీరికి కేటాయించిన విధులను ఆయా విభాగాలకు సంబంధించి అధికారులతో ప్రతి రోజు సమన్వయం చేసుకుని స్వామి వారి కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మార్చి 31వ తేదీ నాటికి ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 


టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి  మాట్లాడుతూ..

టీటీడీ అధికారులు, జిల్లా లోని అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేసుకుని మార్చి 31వ తేదీ లోగా కల్యాణ వేదిక వద్ద సిసి కెమెరాలు ,కంట్రోల్ రూమ్, బ్యారికేడ్లు , గ్యాలరీలు, విద్యుత్  ఇతర పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరులో మరోసారి పనుల పురోగతిపై క్షేత్ర స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు ఈవో  వివరించారు. ఏప్రిల్ 5వ తేదీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 

శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు  సమర్పిస్తారని తెలిపారు. కల్యాణానికి  విచ్చేసే భక్తులకు వారు కూర్చునే గ్యాలరీల్లోనే అన్నప్రసాదం ,తాగునీరు, అక్షింతలు అందించే ఏర్పాటు చేస్తామన్నారు.


జిల్లా ఎస్పీ శ్రీ అన్బురాజన్ మాట్లాడుతూ ..గత ఏడాది 3500 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈసారి 4వేల మందిని బందోబస్తుకు నియమిస్తున్నామని చెప్పారు. పార్కింగ్, సిసి కెమెరాలు , కంట్రోల్ రూం నిర్వహణకు సంబంధించిన సిబ్బంది రెండు రోజుల ముందు నుంచే విధుల్లో ఉంటారన్నారు.


చివరగా  శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం , శ్రీ సీతారామ కల్యాణానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, గైడ్ లైన్స్.. అనే బుక్ లెట్ ను వారు ఆవిష్కరించారు. 

     

అనంతరం వీరు కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.


ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో ధర్మచంద్రా రెడ్డి, ఓఎస్డీ రఘునాథ్, డ్వామా, డిఆర్డీఏ పీడిలు యదుభూషన్ రెడ్డి, ఆనంద్ నాయక్,  డీఎస్పీ శివారెడ్డి, వ్యవసాయ శాఖ జేడి నాగేశ్వరరావు, సమగ్ర శిక్ష ఏపిసి ప్రభాకర్ రెడ్డి,  డీపీఓ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ సీఈవో సుధాకర్ రెడ్డి,  పంచాయతీ రాజ్ ఎస్ఈ  శ్రీనివాస్ రెడ్డి,  డిటిసి మీరాప్రసాద్,  ఆర్టీసీ ఆర్ ఎం గోపాల్ రెడ్డి, టిటిడి పిఆర్వో రవి, సమాచార శాఖ ఏడి వేణుగోపాల్ రెడ్డి, ఏపీఎంఐపి పీడి రవీంద్రారెడ్డి, టీటీడీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.Comments