*సర్వకార్య శుభఫలప్రదం.. పంచాంగ శ్రవణం..!*
* *జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు*
* *కలెక్టరేట్ సభా భవన్ లో శ్రావ్యంగా సాగిన శ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాంగ శ్రవణం*
* *సంప్రదాయ వస్త్రధరణలో ఆకట్టుకున్న అధికారులు*
కడప, మార్చి 22 (ప్రజా అమరావతి): ఉగాది రోజు నిర్వహించే పంచాంగ శ్రవణం.. సర్వకార్య శుభఫల ప్రధదాయకం అని.. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్ని కార్యాల్లో శుభాలు, ఆయురారోగ్యాలు పుష్కలంగా అందాలని.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆకాంక్షించారు.
శ్రీ శోభకృత్ నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని.. బుధవారం జిల్లా కలెక్టరేట్ సభాభావన్ లో... తిరుపతి లోని ఎస్.వి.వేదిక్ యూనివర్సిటీ ,అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.కె.హెచ్. రాజేష్ కుమార్ వారిచే పంచాంగ పఠనం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజుతో పాటు.. జేసి సాయికాంత్ వర్మ, మున్సిపల్ కమిషనర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్, జిల్లా అటవీశాఖాధికారి సందీప్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ రాహుల్ మీన, డీఆర్వో గంగాధర్ గౌడ్, ఆర్డీవో ధర్మచంద్రా రెడ్డి ..లు సంప్రదాయ వస్త్రధారణతో హాజరయ్యారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ.. “ఉగాది పచ్చడి” ఈ పండుగకు ప్రత్యేకమైందని.. షడ్రుచుల సమ్మేళనం – తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు సంతృప్తస్థాయిలో అందడంతో.. తెలుగు నేలపై.. సంక్షేమ పథకాల తోరణాలు ప్రతి గుమ్మం ముందూ శోభిల్లుతున్నాయన్నారు. ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసే పర్వదినం ఉగాది పండుగ అని.., జీవన గమనంలో.. కష్ట సుఖాలు సహజమే అనే సత్యాన్ని.. ఆరు రుచులు మేళవించిన "ఉగాది పచ్చడి" తెలియజేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సంప్రదాయాలను గౌరవిస్తూ... ఉగాది పచ్చడి ని ప్రసాదంగా స్వీకరించి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
ఈ తెలుగు సంవత్సరం.. మీ కుటుంబాల్లో అందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, సంక్షేమ, సౌభాగ్యాలతో శోభాయమానంగా వెలుగొందాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పల్లెసీమలు.. పశుసంపద, వ్యవసాయ, ఉద్యాన పంటలతో సుభిక్షంగా కలకళలాడాలని అభిలషిస్తూ .. మరోసారి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో తిరుపతి ఎస్.వి.వేదిక్ యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డా.కె.హెచ్. రాజేష్ కుమార్.. పంచాంగ శ్రవణం చేస్తూ.. ఉగాది పండుగ.. వసంతాలకు ఋతువులకు మధ్య అవినాభావ సంబంధం, సూర్యునికి, సకల ఋతువులకు, ప్రాతః సాయంకాలాది త్రికాలములకు ఉషోదయం మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుద్ద పాడ్యమి (ఉగాది) రోజున సృష్టి జరిగిందని పురాణాల్లో చెప్పడం జరిగిందన్నారు.
వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారిధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని.. ఒక పురాణం చెబితే... చైత్ర శుద్ద పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుప బడుతుందని మరో పురాణం చెప్పబడిందన్నారు. అలాగే.. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణంగా.. ఆ యోధాగ్రని స్మృతిగా.. ఉగాది ఆచరింపబడుతుందని మరో చారిత్రక వృత్తాంతం అని తెలిపారు. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని మేల్కొలిపి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ‘ఉగాది’ అని వివరించారు. అనంతరం.. ఈ ఏడాదిలో రాశులు, సూర్యచందుల గమనాన్ని బట్టి.. పంచాంగాన్ని.. చదివి వినిపించారు.
** *పండితులకు ఉగాది పురస్కారాల ప్రదానం..*
ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వేదపండితులకు, అర్చకులకు, కవులకు అందించే ఉగాది పురస్కారాలు.. జిల్లాకు చెందిన ముగ్గురికి వరించాయి. ఈ సందర్భంగా..ఎస్.వి.వేదిక్ యూనివర్సిటీ, తిరుపతి లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డా.కె.హెచ్. రాజేష్ కుమార్, ప్రొద్దుటూరు, పులివెందులకు చెందిన అర్చకులు టి.రాజగోపాలాచార్యులు, కలుబండి రామకుమార్ శర్మ లకు.. దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా.. ప్రభుత్వం నుండి రూ.10 ,116 లు పారితోషికం, ప్రశంసా పత్రం, కండువాలను.. జిల్లా కలెక్టర్ అందజేశారు.
అనంతరం.. ఉత్తమ అర్చకులు నాగేంద్ర శర్మ, జగన్ మోహనాచార్యులు, రాఘవాచార్యులు, గోపాలకృష్ణ శర్మ, అనిల్ కుమార్, ప్రధాన అర్చకులు కేసరి, శ్రావణ్ కుమార్, కె.హెచ్. విజయ్ కుమార్,దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు.. పొలతల ఈవో మహేశ్వర రెడ్డి, డీఈఈ గంగయ్య , సీనియర్ అసిస్టెంట్లు రామ ప్రసాద్ రెడ్డి, రామ మోహన్, ఇన్స్పెక్టర్లు నరసింహ సింగ్, శివయ్య,, జనార్దన్, జూనియర్ అసిస్టెంట్ లక్షుయ్య, కంప్యూటర్ ఆపరేటర్ మాలతి ..లకు జిల్లా కలెక్టర్, జేసీలు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి, సంప్రదాయ ప్రసాదాలను సభికులందరికి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో..డిఆర్డీఏ పీడి ఆనంద్ నాయక్, వ్యవసాయ శాఖ జేడీ నాగేశ్వర రావు, దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ సంచాలకులు శంకర్ బాలాజీ, బిసి సంక్షేమ శాఖాధికారి డా. వల్లూరు బ్రహ్మయ్య, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, సమగ్ర శిక్ష ఏపిసి ప్రభాకర్ రెడ్డి, టూరిజం అధికారి మల్లికార్జున్, కలెక్టరేట్ ఏఓ గంగయ్య, సెక్షన్ సూపర్ ఇన్ టెన్ డెంట్లు, శివా రెడ్డి, వెంకట రమణ, రమణ, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment