కుక్కల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా ఏబీసీ ప్రోగ్రామ్

 కుక్కల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా ఏబీసీ ప్రోగ్రామ్



- త్వరలో పిగ్స్, బెగ్గర్స్ ప్రీ సిటీగా కార్యాచరణ


- బెగ్గర్స్ కోసం ప్రత్యేక వసతి సదుపాయాలు


- మెగా ఏబీసీ ఆపరేషన్స్  ఏఆర్వీ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన‌ ఎంపీ భరత్


రాజమండ్రి, మార్చి 20 (ప్రజా అమరావతి): తెలంగాణా రాష్ట్రం హైదరాబాదులో జరిగిన‌ విషాద సంఘటన తరువాత కుక్కల సంతతి తగ్గించేందుకు రాజమండ్రి నగర పాలక సంస్థ ప్రజల విజ్ఞప్తి మేరకు చర్యలు చేపట్టడం హర్షణీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. సోమవారం నగరంలోని 49 వ డివిజన్లో గల ఏనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) కేంద్రం వద్ద నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన‌ మెగా ఏబీసీ అండ్ ఏఆర్వీ డ్రైవ్ కార్యక్రమాన్ని ఎంపీ భరత్, కమిషనర్ దినేష్ కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ‌ భరత్ మాట్లాడుతూ ఇదొక మంచి కార్యక్రమమని, నగర వాసులు స్వాగతించాల్సిన‌ కార్యక్రమమని అన్నారు. ‌ఒక సర్వే ప్రకారం నగరంలో దాదాపు 15 వేల కుక్కలు ఉన్నట్టు తెలుస్తోందని, వీటి సంతతి, సంఖ్యను తగ్గించేందుకు ఏబీసీ ఆపరేషన్స్ అత్యవసరమని అన్నారు. ‌అలాగే యాంటీ రేబీస్ వేక్సినేషన్ (ఏఆర్వీ) నిమిత్తం వీధి కుక్కల డ్రైవ్ ను పశు సంవర్థక శాఖ, జంతు ప్రేమికులు సంయుక్తంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ‌కార్యక్రమం ప్రారంభోత్సవ సందర్భంగా సోమవారం 150 కుక్కలకు ఏబీసీ‌‌ ఆపరేషన్స్ నిర్వహిస్తారని, వారానికి 500 వీధి కుక్కలకు ఈ ఆపరేషన్స్ నిర్వహించి, వారం రోజుల పాటు వాటి సంరక్షణ బాధ్యత కూడా సంబంధిత అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుందని తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి యాభై శాతం పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్టు చెప్పారు. ఏదేమైనా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను అనుసరిస్తూ ప్రకారం ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఎటువంటి అపోహలను నమ్మవద్దని ప్రజలకు ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఇదే విధంగా పిగ్ ఫ్రీ సిటీగా, బెగ్గర్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. బెగ్గర్స్ అని కాకుండా సమాజంలో వారికంటూ ఒక గౌరవం కల్పించే దిశగా ఎంపీ నిధులతో ఇప్పటికే ఒక కారిడార్ ను నిర్మించామని, దాంట్లో వీరందరికీ వసతి సౌకర్యాలు ఎన్జీవో ద్వారా సేవలూ అందేటట్టు చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. అలాగే వరాహాలు నగరంలో సంచరించకుండా వాటి పెంపకందార్లకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించేందుకు నగర పాలక సంస్థ కృషి చేస్తోందని ఎంపీ భరత్ తెలిపారు. తద్వారా అందమైన నగరంగా తీర్చిదిద్దబోతున్నట్టు తెలిపారు. నగర కమిషనర్ కే దినేష్ కుమార్ మాట్లాడుతూ ఏబీసీ ఆపరేషన్స్ చేసిన ప్రతీ కుక్కకు 'ఐ యామ్ వేక్సినేటెడ్' అనే రేడియం టాగ్ కట్టి ఉంటుందని చెప్పారు. నగరంలోని 50 వార్డులలో 50 బృందాలతో ఈ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామని‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీసీ పీ సత్యవేణి, అడిషనల్ ఎంహెచ్ఓ డాక్టర్ జీ మధుబాబు, వెటర్నరీ డాక్టర్ అరుణ, వార్డు ఇన్చార్జి బర్రే కొండబాబు, నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, పాలిక శ్రీను, చోడిశెట్టి సత్యవాణి, గారా చంటి, కొమ్ము జాగ్లిరు, గుడాల ప్రసాద్, గుడాల ఆదిలక్ష్మి, తిరగాటి దుర్గ, ప్రవీణ్, వై రామకృష్ణ, ఆది శేషు తదితరులు పాల్గొన్నారు.

Comments