సభ్యులకు సకాలంలో సమాధానాలకు,ఫిటిషన్ల పరిష్కారానికి ప్రత్యేక యాప్.


 *సభ్యులకు సకాలంలో సమాధానాలకు,ఫిటిషన్ల పరిష్కారానికి ప్రత్యేక యాప్*

*•పెండింగ్ లో ఉన్న సభ్యుల ప్రశ్నలన్నింటికీ  సత్వరమే సమాదానాలు*

*•పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు*


అమరావతి, మార్చి 14 (ప్రజా అమరావతి): శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు అడిగే పలు ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇచ్చే విధంగా మరియు వారి ఫిటిషన్లను సత్వరమే పరిష్కరించే విధంగా  ఆన్ లైన్ ద్వారా  ఎప్పటి కప్పుడు పర్యవేక్షించేందుకు అవసరమైన ప్రత్యేక యాప్ ను త్వరలో రూపొందించాలని  ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు    మరియు  ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డిని కోరారు.  బడ్జెట్ సమావేశాలు జరుగుచున్న నేపథ్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర డి.జి.పి. కె.రాజేంద్రనాద్ రెడ్డిని కోరారు.   మంగళవారం ఉదయం ప్రారంభమైన బడ్జెట్ సమావేశం ముగిసిన అనంతరం మద్యాహ్నం నుండి ఆంధ్రప్రదేశ్ శాసన సభ కమిటీ హాల్ లో పలు శాఖల కార్యదర్శులు మరియు పోలీస్ అధికారులతో వేరు వేరుగా జరిగిన సమావేశాల్లో వారిరువురూ పాల్గొని సభ్యుల ప్రశ్నలకు సరైన సమాదానాలను అందజేయడం మరియు పోలీస్ బందో బస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. 


ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు మరియు ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్  మాట్లాడుతూ పలు  శాఖల వారీగా పెండింగ్ లో నున్న స్టార్డు, అన్ స్టార్డు మరియు షార్టు నోట్ ప్రశ్నలను వివరిస్తూ వాటన్నింటికీ సకాలంలో సరైన సమాధానాలను అందజేసి జీరో స్థాయికి తీసుకురావాలన్నారు. గౌరవ సభ్యులు పలు ప్రజా సమస్యలపై ప్రశ్నలు అడుగుతుంటారని, ఆ ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు అందజేసినట్లైతే, ఆ వివరాలను తమ నియోజక వర్గాల ప్రజలకు వివరించుకునే అవకాశం గౌరవ సభ్యులకు ఏర్పడుతుందన్నారు. గౌరవ సభ్యులు అడిగే పలు ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇచ్చేందుకు, వారి ఫిటిషన్లను సత్వరమే పరిష్కరించేందుకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో  ఇప్పటికే  ప్రత్యేక యాప్ అమల్లోకి వచ్చిందన్నారు. అదే తరహాలో మన రాష్ట్రంలో కూడా  ప్రత్యేక  యాప్ ను సాద్యమైనంత త్వరగా అమల్లోకి తేవాలని వారు  కోరారు.   క్షేత్ర స్థాయిలో గౌరవ సభ్యుల ప్రొటోకాల్ అమలు విషయంలో పలు ఫిర్యాధులు వస్తున్నాయని, వారి హక్కులకు ఎటు వంటి భంగం వాటిల్లకుండా తగు ఆదేశాలను క్షేత్ర స్థాయి అధికారులకు జారీచేయాలని అన్ని శాఖల కార్యదర్శులకు వారు సూచించారు. 


అనంతరం పోలీస్ అధికారులతో శాంతి, భద్రతల అంశాన్ని సమీక్షిస్తూ ప్రశాంత వాతావరణంలో బడ్జెట్ సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లను చేయాలని  రాష్ట్ర డి.జి.పి. కె.రాజేంద్రనాద్ రెడ్డికి వారు సూచించారు.  గౌరవ సభ్యులు బస చేసే ప్రాంతాలు మొదలు  సమావేశాలకు వారు హాజరు అయ్యేంత వరకూ పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, వారి రాకపోకలకు ఎటు వంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడ గ్యాప్లు  అయితే ఉన్నాయే వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సచివాలయం చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నాలుగు వైపులా పటిష్టమైన పోలీస్ బందో బస్తుతో పాటు అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎటు వంటి ఏమరపాటులేకుండా ఎంతో అప్రమత్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది బందో బస్తు విధులను నిర్వహించాలని వారు సూచించారు. 


               రాష్ట్ర  ఆర్థిక, ప్రణాళిక, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి, రాష్ట్ర డి.జి.పి. కె.రాజేంద్రనాద్ రెడ్డి, శాసన సభ సెక్రటరీ పి.బాలకృష్ణమాచార్యలు తదితరులతో పాటు పలు శాఖల  ప్రిన్సిఫల్ సెక్రటరీలు, సెక్రటరీలు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు   ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


Comments