ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ

 *- ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ*


 *- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు*

 *- నెహ్రూచౌక్ సెంటర్లో టిడిపి శ్రేణుల సంబరాలు*



గుడివాడ, మార్చి 17 (ప్రజా అమరావతి): రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విర్రవీగుతూ ప్రగల్బాలు పలికారని, ఆయన ఒక చేతగాని దద్దమ్మ అని కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతుండడంతో గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే రావి ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచడం జరిగింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే రావి మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గ టిడిపి పరిశీలకునిగా ఎన్నికల ప్రచారం నిర్వహించానని తెలిపారు. టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు ఉత్తరాంధ్ర పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు బ్రహ్మరథం పట్టారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని, దీనిపై మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు 151 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారంతా రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం లేదని తెలిపారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనేకమంది సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం వాటి పేర్లు మార్చి కొనసాగిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. వైసిపి నాయకులు చేస్తున్న అరాచకాలు, దోపిడీలను ప్రజలు గమనిస్తూ ఉన్నారన్నారు. సరైన సమయంలో వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారన్నారు. మూడేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ఏ గ్రామంలోను అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదన్నారు. ఏ ఒక్క కుటుంబాన్ని ఆదుకోలేదన్నారు. గత 20 ఏళ్లుగా ప్రజలను నమ్మించి దగా చేస్తూ నట్టేట ముంచాడన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయాలని అన్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో ఉత్తరాంధ్ర యువత కూడా సరైన తీర్పును ఇచ్చిందన్నారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీగా మాజీ ఎమ్మెల్యే రావి అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో టిడిపి గుడివాడ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు వాసే మురళి, నాయకులు ముళ్ళపూడి రమేష్ చౌదరి, అసిలేటి నిర్మల, కంచర్ల సుధాకర్, ఆర్ వేణుబాబు, వసంతవాడ దుర్గారావు, పోలాసి ఉమామహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Comments