శాసనసభ, అమరావతి (ప్రజా అమరావతి);
*స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చ*
*నిబంధనలు అతిక్రమించి నిధుల విడుదలకు చంద్రబాబు ఒత్తిడి*
*కుంభకోణం జరిగిన తీరుకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను సభ ముందుంచిన నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన*
*రూ.3356 కోట్ల ప్రాజెక్టును టేబుల్ ఐటమ్‌గా తెచ్చి కేబినెట్ ఆమోదం*
*డీపీఆర్, సర్టిఫికేషన్ లేకుండానే ప్రాజెక్టు అమలుకు ఆమోదం*
*సీమెన్స్ వాటా ఇవ్వకుండానే రూ.371 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు సర్కార్*
అసెంబ్లీ వేదికగా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సంచలన విషయాలను ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బయటపెట్టారు. రూ.3356 కోట్ల విలువైన ప్రాజెక్టు అంటూ ఎంవోయూ చేసుకుని జీవో ఇచ్చే సమయానికి ఆ విషయాలనే ప్రస్తావించలేదని బుగ్గన తెలిపారు. శాసన సభా సమావేశాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ స్కామ్‌పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో స్కీమెన్స్ కుంభకోణం జరిగిన తీరును శాసనసభ ముందు ఉంచారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లోనే ఈ కుంభకోణం మొదలైదన్నారు. సీమెన్స్ సంస్థ రూ.3,300 కోట్ల పెట్టుబడి అని ప్రచారం చేశారని.. అందులో సీమెన్స్ సంస్థ 90శాతం పెట్టుబడి పెడుతుందని అబద్ధాలు చెప్పారన్నారు. అసలు జీవోకి, ఎంవోయూకి చాలా తేడా ఉందని.. రూ.371 కోట్లను విడుదల చేసే ముందు సరైన వివరాలు నమోదు చేయలేదని బుగ్గన సభలో వెల్లడించారు. అంతేకాకుండా ఫేక్ ఇన్వాయిస్‌లతో నిధులు కాజేశారని.. ఎలాంటి ఒప్పందాలు లేకుండా పలు కంపెనీలకు నిధులు మళ్లించారని.. నైపుణ్య శిక్షణ పేరుతో టీడీపీ నేతలు భారీగా దోచుకున్నారని బుగ్గన ఆరోపించారు.
*స్పెషల్ ఐటైంగా కేబినెట్ ముందుకు*
సహజంగా టెండర్ ప్రక్రియ లేనిదే ప్రభుత్వంలో ఏ పనీ జరగదు. కానీ నాటి ప్రభుత్వం మాత్రం టెండర్‌తో పనే లేకుండా నామినేషన్ పద్ధతిలో రూ.371 కోట్లు ఓ కంపెనీకి కట్టబెట్టారన్నారు. అప్పటికే తన మనుషులను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నియమించిన.. సీమెన్స్ ఒప్పందాన్ని చంద్రబాబు కేవలం ఒక నోట్ ఆధారంగా స్పెషల్ ఐటైంగా కేబినెట్ ముందుకు తీసుకువచ్చి ఆమోదం తెలిపారన్నారు. ఏదైనా ప్రాజెక్ట్ ముందుకొస్తే డీపీఆర్ ఇవ్వాలి. డీపీఆర్ సిమెన్స్ కంపెనీ ఇవ్వకుండా ఇతరులు ఇచ్చారు. కంపెనీ ఇవ్వకుండా ఇతరులు డీపీఆర్ ఎలా తయారు చేస్తారు. ఒక కంపెనీకి ప్రభుత్వం రూ. 3వేల కోట్లు ఖర్చు పెడుతుందా?. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదు. అంతే కాకుండా
జీవోలో ఇదే అంశాన్ని పొందుపరచిన చంద్రబాబు సర్కారు.. ఒప్పంద సమయానికి మాత్రం జీవోలోని అంశాలు కనుమరుగు చేసిందన్నారు.
*పథకం ప్రకారం కథ నడిపించిన చంద్రబాబు*
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు కాకముందే గంటా సుబ్బారావు అనే వ్యక్తిని ఏపీఎస్ఎస్‌డీసీకి సీఈవోగా నియమించారని.. సీఎఫ్ఎంఎస్ కార్పొరేషన్‌కి కూడా ప్రైవేట్ వ్యక్తినే సీఈవోగా పెట్టుకున్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు దగ్గరి వ్యక్తిగా పేరున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణను డైరెక్టర్‌గా నియమించారని గుర్తు చేశారు.
*లెటర్ నెంబర్, తేదీ లేకుండానే ఒప్పందం*
మరో విచిత్రం ఏంటంటే అసలు సీమెన్స్‌కు సంబంధించి జీవోలోని అంశాలు, సంబంధిత లేఖలను ప్రస్తావించకుండానే ఒప్పందంపై అప్పుడు స్కిల్ డెవప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు, సీమెన్స్ ఇండియా హెడ్ సుమన్ బోస్ సంతకాలు చేశారని బుగ్గన తెలిపారు. ఒప్పందంలో ఎక్కడా తేదీ, లెటర్ నెంబర్ లేకుండా ఒప్పందం చేసుకోవడం ఏంటని బుగ్గన ప్రశ్నించారు.
*నిధుల విడుదలకు చంద్రబాబు ప్రత్యేక చొరవ*
అంతే కాకుండా సీమెన్స్ నుంచి 90 శాతం వాటాలో ఒక్కపైసా రాకుండానే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా డబ్బు రూ.371 కోట్లు విడుదల చేసిందన్నారు. ఏపీ ప్రభుత్వం వాటాగా డబ్బులు విడుదల చేసేందుకు నాటి ఆర్థికశాఖ అధికారులు అభ్యంతరం తెలిపారని.. అప్పటి ఎండీ గంటా సుబ్బారావు ప్రతిపాదనతో స్వయంగా చంద్రబాబు జోక్యం చేసుకుని నిధులు విడుదల చేయించారని.. ఇదే విషయాన్ని నాటి ఉన్నతాధికారులు తమ నోట్ పైల్స్‌లో ప్రస్తావించారని బుగ్గున సభలో వెల్లడించారు.
డిజైన్ టెక్ కంపెనీకి ఈ ప్రాజెక్టులో ఏ భాగస్వామ్యం లేకుండా ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఏమీ చేయకుండా డిజైన్ టెక్ కంపెనీకి రూ.370 కోట్లు అప్పనంగా ఇచ్చేశారు.
*ఒప్పదంతో సంబంధం లేదన్న సీమెన్స్ గ్లోబల్ సంస్థ*
అసలు ఈ ఒప్పందతో తమకు సంబంధం లేదని సీమెన్స్ గ్లోబల్ సంస్థ స్పష్టం చేసిందన్నారు. సీమెన్స్ గ్లోబల్ సంస్థకు తెలియకుండానే ఈ ఒప్పందం జరిగిందని.. ఒక్క పైసా కూడా తమకు అందలేదని, ఇందుకు సంబంధించిన మరిన్ని ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిందన్నారు. అంతేకాకుండా కొంత డబ్బు హైదరాబాద్, ఫుణె వెళ్లాయని వారి అంతర్గత విచారణలో గుర్తించారని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు.
*జీఎస్టీ అధికారుల ఆరాతో వెలుగులోకి స్కామ్*
ఈ కుంభకోణం మన రాష్ట్రంలో మొదలై విదేశాలకు పాకిందన్నారు బుగ్గన. ఇక్కడ దోచుకున్న సొమ్మును
షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించి తిరిగి హవాలా మార్గంలో దేశానికి రప్పించారని.. జీఎస్టీ అధికారుల ఆరాతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిందని.. షెల్ కంపెనీల ద్వారా డబ్బులను విదేశాలకు మళ్లించారని.. తిరిగి వాటిని హవాలా రూపంలో మన దేశంలోని కంపెనీలకు రప్పించారని.. ఈడీ, సెబీ సోదాల్లో అవన్నీ షెల్ కంపెనీలుగా గుర్తించారన్నారు.
*అక్రమాలు వెలుగులోకి వచ్చినా తొక్కిపట్టిన చంద్రబాబు*
ఈ అక్రమాలన్నీ చంద్రబాబు హయాంలోనే వెలుగు చూశాయని, ముఖ్యమంత్రి హోదాను అడ్డు పెట్టుకుని చంద్రబాబు ఏసీబీని తొక్కిపెట్టి విషయాలు వెలుగులోకి రాకుండా దాచిపెట్టారని బుగ్గన అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కుంభకోణంపై దృష్టి సారించి విచారణకు ఆదేశించామని.. ఈ కేసులో ఇప్పటికే పలువురిని సీఐడీ, ఈడీ అధికారులు అరెస్ట్ చేశారన్నారు. కేసును సీఐడీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారని సభలో బుగ్గన తెలియజేశారు.
addComments
Post a Comment