రాష్ట్రంలోని 147 గ్రామీణ నియోజకవర్గాల్లో వ్యవసాయ ప్రయోగశాలలు.



రాష్ట్రంలోని 147 గ్రామీణ నియోజకవర్గాల్లో వ్యవసాయ ప్రయోగశాలలు


- ప్రతి జిల్లా కేంద్రంలో ఒక జీవ, సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాల

- భూమిలో నేల సారం తెలుసుకునేందుకు త్వరలో ప్లాంట్ డాక్టర్ విధానం

- త్వరలో 2000 గ్రామ వ్యవసాయ సహాయకుల పోస్టుల భర్తీ

- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి


నెల్లూరు, ఏప్రిల్ 27 (ప్రజా అమరావతి): రైతులకు మెరుగైన సేవలందించేందుకు రాష్ట్రంలోని అన్ని గ్రామీణ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 147 వ్యవసాయ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నట్లు  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

 గురువారం ఉదయం నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో  రూ. 2.40 కోట్లతో నూతనంగా నిర్మించిన జీవన, సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాలను జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నిరంజన్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. 

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని మొదటిసారిగా నెల్లూరులో ఈ ప్రయోగశాలను నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి అన్నదాతకు అన్ని విధాల అండగా ఉంటున్నారని, 10778 రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, ఇతర అన్ని రకాల వ్యవసాయ సేవలు నేరుగా రైతులకు అందుతున్నాయన్నారు. త్వరలోనే అన్ని రైతు భరోసా కేంద్రాలకు శాశ్వత భవన నిర్మాణాలు పూర్తి చేయనున్నామని, ఇప్పటికే 3000 భవనాలు పూర్తయ్యాయని, మరో నాలుగు వేలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.  క్షేత్రస్థాయిలో  రైతులకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు త్వరలోనే ఖాళీగా ఉన్న 2000 గ్రామ వ్యవసాయ సహాయకుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు.  రైతులు ఎక్కడా మోసపోకుండా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యతను పరీక్షించేందుకు గ్రామీణ నియోజకవర్గానికి ఒక ల్యాబ్ చొప్పున 147 ల్యాబ్ లను నిర్మిస్తున్నామని, ఇప్పటికే 73 ప్రారంభమయ్యాయని, 50 నిర్మాణ దశలో ఉండగా, మరో 24 మొదలు కావాల్సి ఉందన్నారు.  రాష్ట్రంలో నాలుగు రీజనల్ కోడింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయని, అత్యంత గోప్యంగా   సేకరించిన శాంపిల్స్ ను పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  భూసార పరీక్షల నిమిత్తం ప్లాంట్ డాక్టర్ విధానాన్ని త్వరలో తీసుకొస్తున్నామని, తద్వారా ఏ నేలలో ఏ పంట వేయాలో రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను పూర్తిగా అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ, రైతాంగానికి ఏ లోటు  రాకుండా అన్ని విధాల చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 

 తొలుత ప్రయోగశాలను ప్రారంభించిన మంత్రి అన్ని గదులను పరిశీలించి, వివిధ పరీక్షల నిమిత్తం ఏర్పాటుచేసిన పరికరాలను, వాటి పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రయోగశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.


 ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ రాజు, డీడీలు శివన్నారాయణ, సత్యవాణి, ఏడీలు నరసోజిరావు, శ్రీనివాసులు, కన్నయ్య, ల్యాబ్ ఇంచార్జ్ సుమలత, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, సిబ్బంది  పాల్గొన్నారు. 


Comments