*15 జిల్లాల్లో... 41 డిగ్రీలకు పైగా
*
*అప్రమత్తత ప్రకటించిన వాతావరణ శాఖ*
హైదరాబాద్ (ప్రజా అమరావతి): రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఉదయం నుంచే వేడి తీవ్రత క్రమంగా పెరిగింది. కొన్ని జిల్లాల్లో ప్రజలకు ముచ్చెమటలు పట్టాయి. మధ్యాహ్నానికి కాక పుట్టించే స్థాయిలో సూర్య కిరణాలు ప్రతాపం చూపాయి. 15 జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. గరిష్ఠంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 42.8 డిగ్రీలు నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో 42.7, నల్గొండ జిల్లా కట్టంగూర్, ఆదిలాబాద్ అర్బన్‌లలో 42.6, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 42.5, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లలో 42.4, జగిత్యాల జిల్లా మల్లాపూర్, మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లలో 42.2, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం తక్కళ్లపల్లి, నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం లక్మాపూర్, వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం కేతేపల్లిలలో 42.1, రాజన్నసిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మార్తాన్‌పేట, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లలో 41.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో గరిష్ఠంగా సైదాబాద్ మండలం అస్లాంగఢ్‌లో 37.7 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలపై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సంస్థ (టీఎస్‌డీపీఎస్) అప్రమత్తత ప్రకటించింది. సోమవారం విడుదల చేసిన ఉష్ణోగ్రతల బులిటెన్‌లో ఆరెంజ్ రంగు సూచికను విడుదల చేసింది.
*నేడు.. రేపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు..*
రాష్ట్రంలో బుధవారం గురువారాల్లో సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ సూచించింది. రాష్ట్రంలోకి దేశంలోని ఆగ్నేయ దిశ నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తున్నట్లు పేర్కొంది.
addComments
Post a Comment