రాష్ట్ర సచివాలయంలో 16వ సివిల్ సర్వీసెస్ దినోత్సవ వేడుకలు

 రాష్ట్ర సచివాలయంలో 16వ సివిల్ సర్వీసెస్ దినోత్సవ వేడుకలు



అమరావతి,21 ఏప్రిల్ (ప్రజా అమరావతి):సమాజంలో పేదరిక నిర్మూలనకు సత్వర నిర్ణయాలు,ఫలితాల సాధన, పౌరులకు సకాలంలో సేవలందించడమే లక్ష్యంగా సివిల్ సర్వెంట్లందరూ పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు సిసిఎల్ఏ జి.సాయి ప్రసాద్ పిలుపునిచ్చారు.జాతీయ సివిల్ సర్వీసెస్(జాతీయ పౌర సేవల)దినోత్సవాన్నిపురస్క రించుకుని శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో 16వ సివిల్ సర్వీసెస్ దినోత్సవ వేడుకలు జరిగాయి.ఈకార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నసాయి ప్రసాద్ మాట్లాడుతూ 1947లో ఢిల్లీలోని మెట్‌కాఫ్ హౌస్‌లో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్ల ప్రొబేషనర్‌లను ఉద్దేశించి స్వతంత్ర భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రసంగించిన రోజు జ్ఞాపకార్థం ఏప్రిల్ 21 తేదీని జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు.అంతేగాక దేశంలోని వివిధ పబ్లిక్ సర్వీసెస్ విభాగాల్లో నిమగ్నమైన ఉన్నఅధికారుల పనిని గుర్తించేందకు ప్రతి యేటా జాతీయ సివిల్ సర్వీసెస్ 

దినోత్సవాన్నిజరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు.పౌర సేవకులు దేశం యొక్క పరిపాలనా యంత్రాంగాన్ని సమిష్టిగా మరియు పౌరులకు సేవ చేయాలనే అంకిత భావంతో నడపాలనేది కూడా ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.సివిల్ సర్వెంట్స్ అంటే వివిధ విభాగాల్లో లేదా ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న పౌర సేవకులు దేశ పరిపాలనా వ్యవస్థకు మూలస్తంభాలుగా వ్యవహరిస్తారు.

సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా పౌరులకు సకాలంలో మెరుగైన సేవలు అందించేందుకు మనకు మనం పునరింకితులు కావాల్సిన అవసరం ఉందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పేర్కొన్నారు.ముఖ్యంగా మనం ఎవరి కోసం పనిచేస్తున్నామో వారికి సకాలంలో సత్వర సేవలు అందించడం ద్వారా వారికి మేలు చేకూర్చాలని అన్నారు.ప్రజల కోసమే పరిపాలన అనేది దృష్టిలో పెట్టుకుని వివిధ సమస్యలపై పౌరులు తరచు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా సమస్యలను పరిష్కరించి సత్వర సేవలు అందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.పౌరులకు ఏవిధంగా సులభంగా సేవలు,పాలన అందించాలనే దానిపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అన్నారు.

ఈకార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్ధ డైరెక్టర్ జనరల్ ఆర్పి సిసోడియా స్వాగతోపన్యాసం ఇస్తూ వలస పాలన అనంతరం స్వాతంత్ర్యం వచ్చి 76 వసంతాలు పూర్తయినా ఇంకా దేశం అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు వెళుతోందని పేర్కొన్నారు.ముఖ్యంగా పేదరిక నిర్మూలన,ఆహార సమృద్ధి,అణు ఇంధనం, అంతరిక్ష పరిసోధన,శాస్త్ర సాంకేతికత వంటి అనేక రంగాల్లో ఘననీయమైన అభివృద్ధిని సాధించామని తెలిపారు.పౌరులకు సకాలంలో తగిన మెరుగైన సేవలందించేందుకు మనం అందరం పునరంకితం కావాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.కావున ప్రతి ఉద్యోగి వారి ఉద్యోగానికి తగిన న్యాయం చేకూర్చే విధంగా పనిచేయాలని సూచించారు.

సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ గత 50 ఏళ్ళుగా దేశవ్యాప్తంగా జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందని చెప్పారు.ఇంకా ఈసమావేశంలో బిసి సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి,ఐఏఎస్ అధికారులు బాబు ఎ,హెచ్.అరుణ్ కుమార్,వీరపాండ్యన్,బసంత్ కుమార్ తో పాటు సచివాలయ వివిధ విభాగాలకు చెందిన అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

అనంతరం సమావేశంలో పాల్గొన్న వారందరితో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భాంగా ప్రతిజ్ణ చేయించారు.

   

Comments