--- జూన్ 1వ తేదీ నాటికి పంట పొలాలకు సాగునీరు
--- ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరణ
--- మంత్రి అప్పలరాజు
కాకినాడ, ఏప్రిల్ 21 (ప్రజా అమరావతి): జూన్ 1వ తేదీ నాటికి కాలువల ద్వారా చివరి పంటకు సాగునీరు అందిస్తామని ఈ లోగా కాలువల మరమ్మత్తు పనులు చేసేందుకు ముందస్తు నిధులను సేకరించి సిద్ధం చేస్తామని, అలాగే పండిన ప్రతి ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల (ఆర్బికే) ద్వారా సేకరిస్తామని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శనివారం కాకినాడ కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డిఆర్సి) సమావేశంనకు కాకినాడ జిల్లా ఇంచార్జ్ మంత్రి అప్పలరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ సమావేశంలో ప్రజాప్రతినిధులు, సభ్యుల నుంచి తీసుకున్న సమాధానాలతో పాటు జిల్లా అభివృద్ధిపై ఆయన విలేకరులతో సమావేశాన్ని నిర్వహించి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ చివరి ఎకరాకు నీరు అందేలా ప్రజాప్రతినిధులు కోరారని దాంతో ఈ రెండు నెలల్లో పంట కాలువలకు రిపేరు చేస్తామని ఆ రిపేర్లకు ఎటువంటి ఆటంకం లేకుండా ముందస్తుగానే నిధిని సమకూర్చి సిద్ధం చేస్తామని చెప్పారు. అలాగే రైతుల ముందు పండిన పంటకు రైతుల ముంగిటనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని చెప్పారు. బొండాలు పండించే రైతుల సమస్యలను ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తేగా సీఎం జగన్ ప్రోద్భలంతో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారని దీంతో కేంద్ర ప్రభుత్వం ఆ బొండాలు రకం ధాన్యం కొనేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. పండిన ప్రతి పంటకు సంబంధించి ధాన్యం కొనుగోలు చేస్తామని ఇందులో ఎటువంటి టార్గెట్లు లేవన్నారు. ఈ వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కాకినాడ సమీపంలో ఉప్పాడ మిషన్ అర్బన్ నిర్మాణం జరుగుతోందన్నారు. ఇంకా ఆయన రాజకీయాలపై స్పందించారు. 2019 ఎన్నికలలో వైకాపా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని, వారి నుండి స్పందన అధికంగా వస్తుందని చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాలరావు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కౌడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ పాల్గొన్నారు.
addComments
Post a Comment