వెనిగండ్ల ఆధ్వర్యంలో 20 వేల మంది కార్యకర్తలతో చంద్రబాబుకు ఘనస్వాగతం

 *- వెనిగండ్ల ఆధ్వర్యంలో 20 వేల మంది కార్యకర్తలతో చంద్రబాబుకు ఘనస్వాగతం


 *- గుడివాడలో భారీ గజమాలలతో చంద్రబాబుకు సత్కారం* 

 *- ఎన్టీఆర్ నియోజకవర్గంలో వెనిగండ్ల విశ్వరూపం* 

 *- ప్లకార్డులతో కదం తొక్కిన వేలాది మంది కార్యకర్తలు* 

 *- బాబు రోడ్ షోలో స్వయంగా బైక్ నడిపిన వెనిగండ్ల* 

 *- వెనిగండ్లకు ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదు* 



గుడివాడ, ఏప్రిల్ 13 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడలో రెండు రోజుల పాటు పర్యటించేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ సీనియర్ నేత వెనిగండ్ల రాము కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 20వేల మంది కార్యకర్తలతో ఘనంగా స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం పామర్రు నియోజకవర్గం నిమ్మకూరు నుండి బయలుదేరిన చంద్రబాబు గుడివాడ రూరల్ మండలం రామనపూడి, చిన ఎరుకపాడు, బిళ్ళపాడు గ్రామాల మీదుగా గుడివాడ పట్టణానికి చేరుకున్నారు. చంద్రబాబు ప్రయాణించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న వెనిగండ్ల రోడ్లకు ఇరువైపులా ఎక్కడ చూసినా టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలు, కటౌట్లు, స్వాగత బ్యానర్లతో పసుపుమయం చేసేశారు. చంద్రబాబు రోడ్ షోలో స్వయంగా బైక్ నడిపిన వెనిగండ్ల దాదాపు వెయ్యి బైక్ లతో హెూరెత్తించారు. డీజే సౌండ్ నడుమ ఎన్టీఆర్, చంద్రబాబు పాటలతో మోత మోగించారు. వెనిగండ్ల ఫొటోలతో ఉన్న టీ షర్టులను వేసుకుని పెద్దఎత్తున కార్యకర్తలు రోడ్ షోలో కన్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చంద్రబాబు రోడ్ షో పొడవునా వెనిగండ్ల ఆధ్వర్యంలో నాన్ స్టాప్ గా బాణాసంచా కాలుస్తూనే ఉన్నారు. ఇక గుడివాడ పట్టణం విషయానికొస్తే ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న పెద్ద పెద్ద హెర్డింగ్లన్నింటినీ చంద్రబాబు స్వాగత ఫ్లెక్సీలతో వెనిగండ్ల నింపేశారు. వీటితో పాటు పెదకాల్వ సెంటర్, వాసవీచౌక్, మూడెడ్ల రామారావు చౌక్, నెహ్రూచౌక్, నాగవరప్పాడు సెంటర్లను కూడా వదలకుండా పెద్దఎత్తున ఫ్లెక్సీలు, నిలువెత్తు కటౌట్లు, జెండాలతో పబ్లిసిటీని వెనిగండ్ల పీక్ స్టేజ్ కి చేర్చారు. వీటన్నింటినీ చంద్రబాబు ఒకవైపు గమనిస్తూనే స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ గుడివాడ పట్టణంలోని వికేఆర్, విఎన్బి అండ్ ఎజికే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆవరణలో జరిగే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి వేలాదిమంది కార్యకర్తలతో కలిసి బయలుదేరి వెళ్లారు. కాగా, కొమరవోలు, పెదకాల్వ సెంటర్ తదితర ప్రాంతాల్లో వెనిగండ్ల ఆధ్వర్యంలో చంద్రబాబును భారీ గజమాలలతో సత్కరించడం జరిగింది. ఇదిలా ఉండగా చంద్రబాబు గుడివాడ పర్యటనలో పాల్గొనేందుకు వచ్చే టీడీపీ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని వెనిగండ్ల ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో 20వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. అలాగే 20వేల మజ్జిగ, మరో 20 వేల మంచినీటి బాటిళ్ళను పంపిణీ చేశారు. చంద్రబాబు తొలిరోజు పర్యటన విజయవంతం కావడంలో ప్రధాన పాత్ర పోషించిన వెనిగండ్ల లెక్కే వేరని తేలిపోయింది. ఒక్క గుడివాడ నియోజకవర్గం నుండి దాదాపు 20వేల మంది కార్యకర్తలను చంద్రబాబు పర్యటనకు తీసుకురావడం వెనక వెనిగండ్ల పడిన శ్రమకు తగిన గుర్తింపు లభించినట్లైంది. గుడివాడ చరిత్రలో ఎన్టీఆర్ తర్వాత అంతటి సాదర స్వాగతాన్ని చంద్రబాబుకు వెనిగండ్ల అందించారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ నియోజకవర్గంలో వెనిగండ్ల విశ్వరూపమే చూపారు. వెనిగండ్ల ఫొటోతో ముద్రించిన ప్లకార్డులను పట్టుకుని వేలాది మంది కార్యకర్తలు గుడివాడ పట్టణ వీధుల్లో కదం తొక్కారు. దీన్ని చూసిన ప్రజలకు మాత్రం వెనిగండ్లకు ఫాలోయింగ్ మామూలుగా లేదనట్టుగా అర్ధమైపోయింది. చంద్రబాబు పర్యటనతో గుడివాడలో వైసీపీకి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన వెనిగండ్లతో పెట్టుకోవడం మాత్రం అంత ఈజీ కాదని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే మొదలైంది.

Comments