సి.ఎం. పర్యటన ఏర్పాట్లు ముమ్మరం
విజయనగరం, ఏప్రిల్ 26 (ప్రజా అమరావతి):
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు శంకుస్థాపనకు మే 3వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం యావత్తూ నిమగ్నమైంది. కేవలం వారం రోజులు మాత్రమే సమయం వుండటంతో పలువురు జిల్లా ఉన్నతాధికారులు భోగాపురం మండలంలో ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగే ఏ.రావివలస గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీమతి దీపిక పాటిల్ బుధవారం శంకుస్థాపన జరిగే ప్రాంతంలో వాహనాల పార్కింగ్ కోసం ప్రదేశాలను ఇతర పోలీసు అధికారులతో కలసి పరిశీలించారు. వందలాది వాహనాల్లో ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి రానున్న దృష్ట్యా అందుకు తగిన పార్కింగ్ ప్రదేశాలను గుర్తించే నిమిత్తం పలు ప్రాంతాలను పరిశీలించారు.
ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో చేరుకోనున్న దృష్ట్యా హెలిపాడ్ నిర్మాణం చేసే ప్రాంతాన్ని మార్కింగ్ చేసి హెలిపాడ్ నిర్మాణ కార్యక్రమాలను రోడ్లు భవనాల శాఖ ఎస్.ఇ. విజయశ్రీ తదితరులు పరిశీలించారు. సి.ఎం. ప్రయాణించే మార్గంలో పొదలు తొలగించే పనులను డ్వామా పి.డి. ఉమాపరమేశ్వరి ఆధ్వర్యంలో చేపట్టారు.
సి.ఎం. శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించే ప్రదేశంలో ఏర్పాట్లు, సభాస్థలి వద్ద వేదిక ఏర్పాట్లను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.సుదర్శన దొర తదితరులు పర్యవేక్షించారు. ఇప్పటికే జి.ఎం.ఆర్. సంస్థ ఆధ్వర్యంలో నేలను చదును చేసి వేదిక నిర్మాణం పనులు చేపట్టగా ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ హెడ్ రామరాజు ఆధ్వర్యంలో సిబ్బంది కూడా కార్యక్రమ ఏర్పాట్లలో పాల్గొన్నారు.
addComments
Post a Comment