జోనల్ వ్యవస్థ,స్థానికత అంశాలపై రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణపై మంత్రుల బృందం సమావేశం
అమరావతి,12 ఏప్రిల్ (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన అనంతరం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపధ్యంలో జోనల్ వ్యవస్థ,స్థానికత అంశాల్లో చేపట్టాల్సిన మార్పులకు సంబంధించి 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అంశాలపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం (జిఓయం) ప్రాధమికంగా సమావేశమై చర్చించింది.రాష్ట్ర విభజన నేపధ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన దృష్ట్యా పాత జోనల్ విధానంలో మార్పులు,స్థానికత తదితర అంశాలపై ఈమంత్రుల బృందం ప్రాధమికంగా చర్చించింది.ఆంశంపై మరిన్ని సమావేశాలు నిర్వహించి విస్తృత స్థాయిలో వివిధ ఉద్యోగ సంఘాలు,ఇతర వర్గాలతో చర్చించి వారి సూచనలు,సలహాలను తీసుకుని దీనిపై ఒక ముసాయిదాను రూపొందించి ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకోవాల్సి ఉంది.అనంతరం పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో కేంద్రానికి పంపి తద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులు పొందాల్సి ఉంది.ఈఅంశపై తొలి సమావేశం కావడంతో మంత్రుల బృందం ప్రాధమికంగా వివిధ అంశాలపై చర్చించడం తోపాటు సమీప రాష్ట్రాల్లో జోనల్ వ్యవస్థ,స్థానికత అంశాలు ఏవిధంగా అమలవుతున్నదీ అధికారులను వివరాలు అడిగి తెల్సుకుంది.
రాష్ట్ర సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రస్తుతం ఉన్న జోనల్ వ్యవస్థ,స్థానికత అంశాలపైన వివరించారు.అంతేగాక 1975 రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన ముఖ్య అంశాలను వివరించారు.
ఈసమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి,ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమం)చంద్రశేఖర్ రెడ్డి,ఎక్సైజ్ మరియు యువజన సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ,ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ ఆర్) చిరంజీవి చౌదరి,జిఎడి అదనపు కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment