*శ్రద్ధ పెట్టి పనిచేయాలి*
*: వివిధ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి*
*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 18 (ప్రజా అమరావతి):
జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, ఈ విషయమై శ్రద్ధ పెట్టి పని చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం పుట్టపర్తి కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో రీ సర్వే, హౌసింగ్, ఇంటి పట్టాల పంపిణీ, జాతీయ రహదాలకు భూసేకరణ, స్పందన, ఉపాధి హామీ, వ్యవసాయ అనుబంధ శాఖలు, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రీ సర్వే భాగంగా ఎంపిక చేసిన గ్రామాల్లో స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియ పూర్తిస్థాయిలో గురువారం నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. అలాగే పెగ్ మార్కింగ్ ప్రక్రియని 27వ తేదీ నాటికి పూర్తి చేయాలని, గ్రౌండ్ టు థింగ్, గ్రౌండ్ వాల్యుడేషన్ పూర్తయిన అనంతరం పెండింగ్ ఉన్న 11 గ్రామాల్లో 7 గ్రామాల్లో 13వ నోటిఫికేషన్ ను ఈనెల 19వ తేదీనాటికి విడుదల చేయాలన్నారు. ప్రణాళిక ప్రకారం సకాలంలో రీ సర్వేను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందులో అలసత్వానికి తావలేదన్నారు. భూహక్కు పత్రాలకు సంబంధించి ఎలాంటి పెండింగ్ లేకుండా పత్రాలను పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో వివిధ జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలన్నారు.
హౌసింగ్ సంబంధించి జిల్లాలో నాన్ స్టార్టెడ్ లో ఉండి మొదలుకాని 10,190 ఇళ్ల నిర్మాణాలను వెంటనే బిలో బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలని, ఈనెల 28వ తేదీలోగా అన్ని ఇళ్లు బిబిఎల్ లోకి రావాలన్నారు. కేటాయించిన స్థలం వద్దకు లబ్ధిదారులను తీసుకువెళ్లి ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. కేటాయించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో మాట్లాడి ఇళ్ల నిర్మాణం వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. బిబిఎల్ స్థాయిలో ఉన్నవి బిఎల్ స్థాయిలోకి తీసుకురావాలని, బిఎల్ స్థాయిలో ఉన్నవి త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలన్నారు. జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి కులాయి కనెక్షన్లు ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఉపాధి హామీ కింద కూలీలకు అవగాహన కల్పించి కూలీల సంఖ్యను పెంచాలని, ఎక్కువమంది కుటుంబాలకు వంద రోజుల పని కల్పించాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల భవన నిర్మాణాలను పురోగతిలోకి తీసుకురావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయ భవనాలు 8, రైతు భరోసా కేంద్రాలు 31, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు 32 ఇంకా మొదలు కాలేదని, ఆయా భవన నిర్మాణాలకు స్థల సమస్యలను వెంటనే పరిష్కరించి వెంటనే వారం రోజుల లోపు అన్ని నిర్మాణాలు మొదలయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వ్యవసాయం కింద ఈ క్రాఫ్ బుకింగ్ కి సంబంధించి రైతుల ఈ కేవైసీ ప్రక్రియ 100 శాతం పూర్తి చేయాలన్నారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద జిల్లాకు కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా సిహెచ్సి గ్రూపులకు యంత్రాలను పంపిణీ చేసేలా చూడాలన్నారు. ఈ విషయమై వారంలో పురోగతి కనిపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల కింద చేపట్టిన అభివృద్ధి పనులను సకలంలో పూర్తి చేసే విధంగా చూడాలని, ప్రభుత్వ లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ కొండయ్య, సిపిఓ విజయ్ కుమార్, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిఆర్డీఏ పిడి నరసయ్య, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, డిపిఓ విజయ్ కుమార్ రెడ్డి, డిసిఓ కృష్ణ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment