బాధ్యతగా పనిచేయాలి.

 బాధ్యతగా పనిచేయాలి*



*: నాణ్యమైన భోజనం అందించడంలో నెలకొన్న చిన్నచిన్న సమస్యలను సవరించుకొని అధికారులు జాగ్రత్తగా పని చేయాలి*


*: ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి*



పుట్టపర్తి , ఏప్రిల్ 04 (ప్రజా అమరావతి):


నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ - 2013 అమలులో బాధ్యతగా పనిచేయాలని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.


మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ - 2013 అమలుపై ఐసిడిఎస్, సివిల్ సప్లయిస్, ఆరోగ్య, విద్య, తదితర సంబంధిత శాఖల అధికారులతో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్, ఫుడ్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ సురేష్, ఆర్డీఓ భాగ్యరేఖ, తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ గా మమ్మల్ని నియమించి కఠినంగా పనిచేయాలని ఆదేశించారన్నారు. ఆరోగ్యకర ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడం కోసం ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేయాలన్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కు లోబడి కేంద్ర, రాష్ట్ర ఇస్తున్న సబ్సిడీ కార్యక్రమాల్లో ఉచిత ఆహారాలకు సంబంధించి ఏపీ ఫుడ్ కమిషన్ అజమాయిషీ ఉంటుందన్నారు.


జిల్లాలోని రేషన్ షాపుల వద్ద రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్రానికి సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోటోలు ఉండేలా బోర్డులను ప్రదర్శించాలని డీఎస్ఓని ఆదేశించారు. ఎంఎల్ఎస్ పాయింట్లకు వెళ్లి బియ్యం తక్కువ రాకుండా చూడాలని, ఎంఎల్ఎస్ పాయింట్లకు, డీలర్లకు నెలకొన్న గ్యాప్ ను రాకుండా చూడాలని, డీలర్లతో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎండియూ వాహనాలు ఇంటింటికి తిరగడం లేదని తమ దృష్టికి వచ్చిందని, వాహనాలు ఇంటింటికి తిరిగి బియ్యం, నిత్యవసరాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. పీఎం మాతృ వందన పథకం కింద గర్భిణీలకు ప్రసవం తర్వాత 5,000 రూపాయలు అందించడం జరుగుతుందని, అర్హత కలిగిన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు సమన్వయంతో పనిచేసి గర్భిణీల వివరాలను సేకరించాలని, ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చేలా చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పు, నూనె, పాలు, గుడ్లు, చిక్కీలు, అటుకులు, బెల్లం చాలా జాగ్రత్తగా పంపిణీ చేస్తున్నామన్నారు. నిత్యావసరాలు పంపిణీ, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై జిల్లా నుంచి 35 ఫిర్యాదులు వాట్సాప్ ద్వారా తమకు అందాయని, వాటిలో 5, 6 తప్ప మిగిలినవన్నీ నకిలీ ఫిర్యాదులు అన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ అధికారులు పనిచేయాలన్నారు. ఉన్నత పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల్లో పోషక విలువలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యం ఇస్తున్నామని, దీని ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఈ విషయమై పూర్తిస్థాయిలో అధికారులు అవగాహన కలిగి ఉండి హాస్టల్ విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు నాసిరకం పాలు, కందిపప్పు, గుడ్లు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయని, పేద పిల్లలకు చేరాల్సిన పోషక ఆహారాన్ని మెనూ ప్రకారం తప్పనిసరిగా అందించాలన్నారు. హాస్టల్లలో ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం చేయరాదని, అధికారులు, శ్రద్ధగా జాగ్రత్తగా పని చేయాలని, పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా అధికారులందరి సహాయ సహకారాలు అవసరం అన్నారు. పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజనం పై పర్యవేక్షణ చేయాలని, ఈ విషయమే ప్రధానోపాధ్యాయులు అందరికీ తెలియజేయాలని డీఈవోను ఆదేశించారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లను ఆ శాఖ డిడి తరచుగా తనిఖీలు చేయాలని, విద్యార్థులకు ఏం భోజనం పెడుతున్నారు అనేది పరిశీలించాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు ఒక రోజుకు మెస్ చార్జీల కింద 46.67 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, త్వరలో 52.67 రూపాయలకు పైగా ఇవ్వడం జరుగుతుందని, ఈ విషయం విద్యార్థులకు తెలియజేయాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఖచ్చితంగా భోజనం అందించాలన్నారు. విద్యార్థులకు, పిల్లలకు నాణ్యమైన భోజనం అందించడంలో నెలకొన్న చిన్నచిన్న సమస్యలను సవరించుకొని అధికారులు జాగ్రత్తగా పని చేయాలని ఆదేశించారు.


జగనన్న గోరుముద్ద కింద రాగిజావ పంపిణీ చేసే కార్యక్రమంలో ప్రభుత్వంతో భాగమైన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ అభినందించారు. రేషన్ బియ్యం సరఫరా లో అవకతవకులు, నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా, జగనన్న గోరుముద్ద, వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్రభుత్వ పథకాల ద్వారా నాణ్యమైన ఆహారము, ఆహార పదార్థాలు అందకపోతే కమిషన్ కి ఫిర్యాదు చేయవచ్చునాన్ని తెలిపారు,  ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్9490551117 నెంబర్ తో ఉన్నదని తెలిపారు. జిల్లాలో మూడు రోజులుగా క్షేత్రస్థాయిలో తాను అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలను, చౌక  ధర దుకాణాలలో   ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. వాటిల్లో ఎక్కడ పెద్దగా సమస్యలు కనిపించలేదని, ఇంతకుముందు కంటే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వస్తోందన్నారు. మధ్యాహ్న భోజనం కింద ఆయా చోట్ల చాలా బాగా భోజనం పెడుతున్నారన్నారు. ఆహారానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పేద పిల్లలకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్ మాట్లాడుతూ కొత్త జిల్లా ఏర్పడి ఒక ఏడాది అయ్యిందని, ఇక్కడ అధికారులంతా బాగా పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆరోగ్యం, విద్య, సివిల్ సప్లైస్, ఐసిడిఎస్ తదితర శాఖల పరిధిలో అధికారులంతా కొంచెం శ్రద్ధ పెట్టి పని చేయాలన్నారు. ఆయా శాఖల పరిధిలో వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించాలని, హాస్టల్లలో, పాఠశాలల్లో మెనూని ప్రదర్శించేలా చూడాలని, నాణ్యమైన భోజనం అందించడంలో అధికారుల మానిటరింగ్ చాలా ముఖ్యమన్నారు. పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ ప్రకారం భోజనం అందించేలా సచివాలయ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్లు తనిఖీలు చేయాలని, నిత్యం మానిటర్ చేసుకుంటూ ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు.


ఈ సందర్భంగా ఫుడ్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అనేది చాలా ముఖ్యమైనదని, ఆయా శాఖల జిల్లా అధికారులు బాధ్యతతో పనిచేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలన్నారు.


ఈ సమావేశంలో, సివిల్ సప్లై అధికారి  వంశీకృష్ణారెడ్డి,  డి ఎం,  అశ్వత్ నారాయణ నాయక్, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిడి శివరంగ ప్రసాద్, ఇంచార్జి డిఈఓ మీనాక్షి,  బీసీ వెల్ఫేర్  నిర్మల జ్యోతి, గిరిజన సంక్షేమ అధికారి  మోహన్ రావు, ఐ సి డి ఎస్ పి డి  లీల కుమారి,సివిల్ సప్లయిస్  డిప్యూటీ తహల్దారులు, వివిధ సంక్షేమ  వసతి గృహాల అధికారులు వంశీకృష్ణరెడ్డి, తాసిల్దార్ నవీన్ కుమార్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


అనంతరం, రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ్ ప్రతాపరెడ్డి, స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు  కలెక్టర్ బసంత్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు



Comments