*- చంద్రబాబుతో అంబేద్కర్ జయంతి కలను నెరవేర్చుకున్న వెనిగండ్ల*
*- అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు చంద్రబాబు నివాళి*
*- ప్రాధాన్యత సంతరించుకున్న పాస్టర్ల సమావేశం*
*- గుడివాడ పర్యటనంతా చంద్రబాబు వెన్నంటే వెనిగండ్ల*
గుడివాడ, ఏప్రిల్ 14 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా కృష్ణాజిల్లా గుడివాడలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించాలన్న కలను టీడీపీ సీనియర్ నేత వెనిగండ్ల రాము నెరవేర్చుకున్నారు. చంద్రబాబు గుడివాడ పర్యటనకు సంబంధించి మొదటగా ఖరారైన టూర్ షెడ్యూల్లో 13వ తేదీన రోడ్ షో, బహిరంగ సభ అనంతరం నూజివీడు నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. ఈ నెల 7వ తేదీన మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబును కలవడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పర్యటనను విజయవంతం చేసేందుకు అవలంభించాల్సిన వ్యూహంపై చంద్రబాబుకు వెనిగండ్ల క్లారిటీ ఇచ్చారు. 13వ తేదీన రోడ్ షో, బహిరంగ సభ అనంతరం రాత్రికి గుడివాడలోనే బస చేసి, 14వ తేదీన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనాలని, ఈ సందర్భంగా పాస్టర్లతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వెనిగండ్ల చెప్పడంతో వెనువెంటనే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు పర్యటన 13, 14 తేదీలకు మారిపోయింది. ఒకవైపు గుడివాడ టీడీపీలో గ్రూపు తగాదాలు లేకుండా నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తూనే మరోవైపు చంద్రబాబు గుడివాడ పర్యటన విజయవంతానికి వెనిగండ్ల తీవ్రంగా శ్రమించారు. ఇంకోవైపు 13వ తేదీ రాత్రి గుడివాడలోనే చంద్రబాబు బనకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశారు. చంద్రబాబు చేతులమీదుగా అంబేద్కర్ జయంతి వేడుకలను వెనిగండ్ల దగ్గరుండి మరీ జరిపించారు. అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు చంద్రబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను సాధించాల్సిన అవసరాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. అంతకు ముందు జరిగిన పాస్టర్ల సమావేశంలో చంద్రబాబుతో కలిసి వెనిగండ్ల పాల్గొన్నారు. పాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ చంద్రబాబు దృష్టికి వచ్చాయి. ఇదిలా ఉండగా చంద్రబాబు గుడివాడ పర్యటన ఖరారైనప్పటి నుండి వెనిగండ్ల వార్తల్లో నిలుస్తూ వచ్చారు. గుడివాడ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగేలా చంద్రబాబును వెనిగండ్ల ఒప్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తొలిరోజు పర్యటనలో నిమ్మకూరు నుండి గుడివాడ వరకు ఎక్కడ చూసినా చంద్రబాబు ఫ్లెక్సీలు, కటౌట్లు, స్వాగత బ్యానర్లు కన్పించేలా పబ్లిసిటీని వెనిగండ్ల అంతకు మించిన స్థాయికి చేర్చారు. గుడివాడలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు స్వయంగా వెనిగండ్ల కెపాసిటీని గమనిస్తూనే వచ్చారు. ఇక రెండవ రోజు చంద్రబాబు పర్యటనలో వెనిగండ్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంబేద్కర్ జయంతి వేడుకలు, పాస్టర్లతో జరిగే సమావేశానికి చంద్రబాబును వెనిగండ్ల ఒప్పించడమేనని చెప్పవచ్చు. గుడివాడలో రెండు రోజుల పర్యటన ముగిసే వరకు చంద్రబాబు వెన్నంటే వెనిగండ్ల ఉండడం గుడివాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
addComments
Post a Comment