విజయవాడ (ప్రజా అమరావతి);
* ప్రాదేశిక సముద్ర జలాల్లో యాంత్రిక పడవల ద్వారా నిర్వహించే చేపల వేట నిషేధం..
* ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ 61 రోజుల పాటు చేపల వేట నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ..
- మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపల వేట 61 రోజులపాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాదేశిక సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు అనగా మెకనైజ్డ్ మరియు మోటారు బోట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల వేటను ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకూ మొత్తం 61 రోజుల పాటు వేటను నిషేధిస్తూ జి.ఓ. ఆర్ టి. నెం. 76, తేదీ: 06-04-2023 ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.
సముద్ర జలాల్లో చేపల వేట నిషేధం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వివిధ చేప రొయ్య జాతుల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలను రొయ్యలను సంరక్షించడం ద్వారా వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం తద్వారా సముద్ర మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేయడమన్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను అనుసరించి సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు (మెకనైజ్డ్ మరియు మోటారు బోట్లు) పై మత్స్య కారులు ఎటువంటి చేపల వేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించాలన్నారు. ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైనా చేపల వేట చేసిన ఎదల ఆయా బోట్ల యజమానులను ఆంధ్ర ప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్దీకరణ చట్టం 1994, సెక్షన్ (4) ననుసరించి శిక్షార్హులు అని అన్నారు. అట్టివారి బోట్లను, బోటులో ఉండే మత్స్య సంపదను స్వాధీన పరచుకోవడమే కాకుండా జరిమానా విధిస్తూ ప్రభుత్వం అందించే అన్ని రకాల రాయితీలను, సౌకర్యాలను నిలుపుదల చేయబడునని మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు.
ప్రభుత్వం ప్రకటించిన 61 రోజుల నిషిద్ధ కాలం ఖచ్చితంగా అమలు చేయుటకై మత్స్య శాఖ, పోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నావీ మరియు రెవిన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేయడమైనదని మత్స్య కారులందరూ సహకరించాలని మత్స్య శాఖ కమీషనర్ కె. కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
addComments
Post a Comment