గుడివాడలో మంచినీరివ్వాలంటే భగీరథ ప్రయత్నమే చేయాల్సి వస్తోంది.

 *- గుడివాడలో మంచినీరివ్వాలంటే భగీరథ ప్రయత్నమే చేయాల్సి వస్తోంది


 *- ట్యాంకర్లు ఏర్పాటు చేసినా మున్సిపల్ అధికారులు సహకరించడం లేదు* 

 *- 2024 లో విజయం సాధించి శాశ్వతంగా పరిష్కరించేందుకు  కృషి చేస్తా*

 *- అప్పటి వరకు ఐకమత్యంగా పోరాడుదామని వెనిగండ్ల పిలుపు*



గుడివాడ, ఏప్రిల్ 27 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడలో ప్రజలకు మంచినీరివ్వాలంటే భగీరథ ప్రయత్నమే చేయాల్సి వస్తోందని    తెలుగుదేశం పార్టీ నేత వెనిగండ్ల రాము అన్నారు. గురువారం గుడివాడలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఆయన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెనిగండ్ల మీడియాతో మాట్లాడుతూ మంచినీటికి గుడివాడ ప్రజలు నానాయాతన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భగీరథ ప్రయత్నమే ఇక్కడ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచినీటిని అందించేందుకు ట్యాంకర్లను ఏర్పాటు చేశానని, మున్సిపల్ అధికారులు మాత్రం సహకరించడం లేదన్నారు. డబ్బులు చెల్లిస్తామని చెబుతున్నప్పటికీ మంచినీరు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మంచినీరిచ్చే కార్యక్రమం ఎవరు చేస్తున్నారు, దీనివల్ల ఎవరికి పేరు వస్తుందని మాత్రమే చూస్తున్నారన్నారు. తాను పేరు కోసం ఇవన్నీ చేయడం లేదని గుర్తు చేశారు. ప్రస్తుత ఎండాకాలంలో మంచినీటి కోసం ప్రజలు ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. ప్రజల బాధలను అర్థం చేసుకుని మంచినీరు ఇవ్వాలని మున్సిపల్ అధికారులను కోరుకుంటున్నానని చెప్పారు. 2024 ఎన్నికల్లో గుడివాడలో టిడిపి విజయం సాధిస్తుందని, ఆ తర్వాత మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అప్పటివరకు అందరం కలిసి ఐకమత్యంగా పోరాడుదామని వెనిగండ్ల పిలుపునిచ్చారు.

Comments