తిరుపతి, మే 22 (ప్రజా అమరావతి);
ఉద్యోగుల క్వార్టర్స్ ను ఆధునీకరించండి
- తిరుపతిలో క్వార్టర్స్ ను పరిశీలించిన టీటీడీ ఈవో
టీటీడీ ఉద్యోగులు నివసించే రాంనగర్, వినాయక నగర్, కేటి క్వార్టర్స్ ను ఆధునీకరించాలని ఈవో
శ్రీ ఎ వి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. సమస్యలను సత్వరం పరిష్కరించడానికి ఫారెస్ట్, ఇంజినీరింగ్ , గార్డెన్, హెల్త్ విభాగాల అధికారులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. శనివారం జేఈఓ శ్రీ వీర బ్రహ్మంతో కలిసి ఆయన క్వార్టర్స్ ను పరిశీలించారు.. పలువురు ఉద్యోగుల ఇళ్ళలోకి వెళ్ళి వారి కుటుంబసభ్యులతో మాట్లాడి క్వార్టర్స్ లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా క్వార్టర్స్ ను ఆధునీకరించడంతో పాటు , అవసరమైన మరమ్మత్తులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. క్వార్టర్స్ లో తాగునీటి సమస్యను అధిగమించేందుకు అవసరమైన చోట్ల ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టాలన్నారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు, క్వార్టర్స్ లో విద్యుత్ వైరింగ్ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులందరు సొసైటీగా ఏర్పడి అనధికారిక వ్యక్తులు క్వార్టర్స్ లోకి రాకుండా చూసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి క్వార్టర్స్ లోకి ప్రవేశించే గేట్ల సంఖ్య తగ్గించుకోవాలని చెప్పారు. దీంతోపాటు తగినంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. క్వార్టర్స్ లో ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి అధికారులతో
ఈ సొసైటీ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఈవో సూచించారు.
అధికారులతో ఏర్పాటు చేసే కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై తమ దృష్టికి వచ్చిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీధుల్లో బిఎస్ఎన్ఎల్, డిష్ లాంటి వైర్లు చిందరవందరగా కాకుండా క్రమ పద్ధతిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులు , వారి కుటుంబసభ్యుల కోసం తిరుపతిలో ఇండోర్ స్టేడియం నిర్మాణం పనులు చేపట్టాలన్నారు.
చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ (ఎలక్ట్రికల్ ) శ్రీ వెంకటేశ్వర్లు, ఎస్టేట్ విభాగం ఓఎస్ డి
శ్రీ మల్లిఖార్జున, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్, ఈఈ లు శ్రీ మురళీకృష్ణ, శ్రీ మనోహర్, డిఈ లు శ్రీ చంద్రశేఖర్, శ్రీమతి సరస్వతి పాల్గొన్నారు.
addComments
Post a Comment