నెల్లూరు, ఏప్రిల్ 14 (ప్రజా అమరావతి): భారతావని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని, శుక్రవారం ఉదయం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సూర్యచంద్రులు ఉన్నంతవరకు భారతావని మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప మహనీయుడు, రాజనీతిజ్ఞుడు అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. సమాజంలో ఎస్సీ, ఎస్టి, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించి వారు రాజ్యాధికారం వైపు పయనించేలా జీవితాంతం అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన గొప్ప ధీశాలి అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమాజం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, అలాగే ఎస్సీ, ఎస్ టి, బీసీ, మైనార్టీ వర్గాల్లో అట్టడుగు కులాల్లోని వారిని గుర్తించి రాజకీయంగా గుర్తింపు కల్పించడంతోపాటు ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. అంబేద్కర్ స్మృతివనం పేరిట అమరావతిలో అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటుకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ ఆశయ సాధనకు కట్టుబడి ఆ మహనీయుని అడుగుజాడల్లో పయనించి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మంత్రి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఎస్ టి ఎస్ సి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
addComments
Post a Comment