*ఏపీలో కోవిడ్ పూర్తిగా అదుపులో వుంది*
*కొవిడ్ పరీక్షల విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు*
*ఏపీలో విస్తృతంగా కోవిడ్ పరీక్షలు*
*గత రెండు వారాల్లో 15,096 మందికి పరీక్షలు*
*ఇందులో 267 మందికి కోవిడ్ లక్షణాలు*
*వీరందరూ తమ తమ ఇళ్లల్లోనే చికిత్స పొందుతున్నారు*
*కొవిడ్ పై పూర్తి అప్రమత్తంగా వున్నాం*
*ఆక్సిజన్ ప్లాంట్లు, పీహెచ్‌సీల నిర్వహణకు కేంద్రం నిధులివ్వాలి*
*ఏపీకి మరో 20 లక్షల కొవిడ్ బూస్టర్ డోసుల్ని కేంద్రం ఇవ్వాలి*
*కేంద్ర మంత్రికి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విజ్ఞప్తి*
మంగళగిరి, గుంటూరు జిల్లా (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ పూర్తిగా అదుపులో ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గత రెండువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15,096 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఇందులో 267 మందికి కొవిడ్ లక్షణాలున్నట్లు తేలిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రస్తుతం వీరంతా ఇంటి వద్దే ఉంటూ వైద్య ఆరోగ్య సేవలు పొందుతున్నారని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొవిడ్ పరీక్షల
విషయంలో నిరంతరం వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేస్తున్నారని మంత్రి రజిని అన్నారు. దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకునేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి రజిని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు మరో 20 లక్షల బూస్టర్ డోసులను కేంద్రం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ ప్లాంట్లు, పీహెచ్‌సీల నిర్వహణ తదితర అవసరాలకు అయ్యే మొత్తాన్ని నేషనల్ హెల్త్ మిషన్ భరించాలని మంత్రి రజిని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు తమ రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులు, కేంద్రం పరంగా అందించాల్సిన వైద్య అవసరాల గురించి కేంద్ర మంత్రి డాక్టర్ మాండవీయకు పలు విజ్ఞప్తులు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో మాండవీయతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పర్వీన్ పవార్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున మంత్రి రజినితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ మరియు మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్ , ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
addComments
Post a Comment