మా ఇంటి ఆడపడుచుకు అవమానం జరిగింది.

 *- మా ఇంటి ఆడపడుచుకు అవమానం జరిగింది


 *- మమ్మల్ని మన్నించాలని కోరుకుంటున్నాం* 

 *- గెల్పించినందుకు పరోక్షంగా మేం కూడా కారణమే* 

 *- దీనికి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం* 

 *- చంద్రబాబు సమక్షంలో శపథం చేసిన వెనిగండ్ల* 



గుడివాడ, ఏప్రిల్ 14 (ప్రజా అమరావతి): మా ఇంటి ఆడపడుచుకు అవమానం జరిగిందని, గుడివాడలో గెల్పించినందుకు పరోక్షంగా మేం కూడా కారణమని, మమ్మల్ని మన్నించాలని కోరుకుంటున్నామని, దీనికి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వెనిగండ్ల రాము శపథం చేశారు. గురువారం రాత్రి కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని వీకేజర్, వీఎన్బీ అండ్ ఏజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆవరణలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో వెనిగండ్ల రాము మాట్లాడారు. గత 20 ఏళ్ళుగా గుడివాడ నియోజకవర్గంలో ఎటువంటి మార్పు కన్పించడం లేదన్నారు. వాస్తవంగా రోజురోజుకూ దారుణంగా తయారవుతోందన్నారు. రోడ్లన్నీ ఎంతో దయనీయంగా మారిపోయాయన్నారు. గుడివాడ బైపాస్ రోడ్డు గోతులమయం కావడం వల్ల ఇటీవల పలువురు విద్యార్థులు ప్రమాదాలకు గురై గాయపడ్డారన్నారు. వారందరికీ తనవంతు సాయం చేసి పంపానన్నారు. ఈ రోడ్లకు మరమ్మతులు చేద్దామంటే చేసుకోనివ్వరని, వాళ్ళు ఎలాగూ రోడ్లను బాగు చేయరన్నారు. నందివాడ మండలంలో తమిరిశ రోడ్డు పనులు జరుగుతున్నాయనుకున్న దశలో కాంట్రాక్టర్ ను తరిమేశారన్నారు. గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి ఉండకూడదని అనుకుంటున్నారన్నారు. ప్రజలంతా చెప్పుచేతల్లో అణిగిమణిగి ఉండాలనుకుంటున్నారన్నారు. దీన్ని వచ్చే ఎన్నికల్లో సరిదిద్దుకుంటామన్నారు. గుడివాడ నియోజకవర్గంలో చదువుకున్న వారికి ఉద్యోగావకాశాలను కల్పించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నానన్నారు. ఇప్పటి వరకు 1400 ఉద్యోగాలను ఇప్పించానన్నారు. చంద్రబాబు హయాంలో వచ్చిన కంపెనీల్లోనే ప్లేస్ మెంట్స్ వచ్చాయన్నారు. గుడివాడ నియోజకవర్గంలో నిరుద్యోగులకు మరిన్ని జాబ్ మేళాలు అవసరమన్నారు. గత నాలుగేళ్ళుగా ఉద్యోగాలు చేయవచ్చనే విషయాన్ని కూడా మర్చిపోయారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పరిశ్రమలు గుడివాడకు వచ్చేలా చూడాలని కోరారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో మమ్మల్ని భాగస్వాములుగా చేయాలని చంద్రబాబుకు వెనిగండ్ల రాము విజ్ఞప్తి చేశారు.

Comments