స్పందన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి.

 *స్పందన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 17 (ప్రజా అమరావతి):


స్పందన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి 93 అర్జీలను స్వీకరించడం జరిగింది.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన గ్రీవెన్స్ లో అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించడంపై ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. స్పందన గ్రీవెన్స్ లో రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న స్పందన గ్రీవెన్స్ కు అర్జీలు తక్కువగా వస్తున్నాయని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్పందన పిటిషన్లను ఆన్లైన్లో వచ్చిన వెంటనే ఓపెన్ చేసి చూడాలని, వాటి పరిష్కారానికి ఆయా శాఖల జిల్లా అధికారులు సకాలంలో చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో అర్జీలు రాసే సమయంలో, రిజిస్ట్రేషన్ల దగ్గర అర్జీదారుడికి ఎలాంటి ఆలస్యం లేకుండా చూడాలని, ఇందుకోసం ఎక్కువ మంది సిబ్బందిని నియమించాలన్నారు. స్పందన కార్యక్రమం వద్ద అర్జీదారుడు ఎదురుచూసేందుకు వీలుగా అవసరమైన కుర్చీలను వేయించాలన్నారు. గ్రీవెన్స్ నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు వారు పని చేస్తున్న ప్రధాన కార్యాలయం ప్రాంతంలో ఖచ్చితంగా నివాసం ఉండాలన్నారు. జిల్లా అధికారులు పని చేసే చోట నివాసం ఉండడం వల్ల కింది స్థాయి అధికారులు కూడా పనిచేసే చోట నివాసం ఉంటారన్నారు. జిల్లా అధికారులు జిల్లా కేంద్రంలో, డివిజన్ అధికారుల డివిజన్ హెడ్ క్వార్టర్లలో, మండల అధికారులు మండల స్థాయిలో నివాసం ఉండాలన్నారు. అధికారులు పర్మిషన్ తీసుకోకుండా బయటికి ఎక్కడికి వెళ్లరాదన్నారు. ప్రతివారం ఆయా శాఖల అభివృద్ధిపై పురోగతి చూపించారా లేదా అనేది పరిశీలించడం జరుగుతుందని, ప్రతివారం అభివృద్ధి పనుల్లో పురోగతి చూపించాలన్నారు. వచ్చే ఏడాదికాలం చాలా కీలకమని, అధికారులందరూ కష్టపడి పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలన్నారు.


ఈ కార్యక్రమంలో సిపిఓ విజయ్ కుమార్, డ్వామా పిడి రామాంజనేయులు, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిఆర్డీఏ పిడి నరసయ్య, డిపిఓ విజయ్ కుమార్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిడి శివరంగ ప్రసాద్, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, డిఈఓ మీనాక్షి, డిసిఓ కృష్ణ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి చాంద్ భాష, చేనేత జౌళి శాఖ ఏడి రమేష్, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, బిసి వెల్ఫేర్ శాఖ అధికారి నిర్మలా జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments