ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలదే పైచేయి.


విజయవాడ (ప్రజా అమరావతి);


*ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలదే పైచేయి*



*ఇంటర్ ఫలితాల్లో 72 శాతం ఉత్తీర్ణత*

*రికార్డ్ సమయంలో చెప్పిన సమయానికే ఇంటర్ ఫలితాలు విడుదల*

*మొదటి సంవత్సర ఫలితాల్లో తొలి మూడు స్థానాల్లో వరుసగా కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు*

*ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తొలి మూడు స్థానాల్లో వరుసగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి*

*ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు అవకాశం*

*సీడీ కీ:T#A&B@2023*


:- *విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ*


విజయవాడ : ఇంటర్మీయట్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించినట్లు విద్యాశాఖా మంత్రి శ్రీ. బొత్స సత్యనారాయణ వెల్లడించారు. బుధవారం విజయవాడ బందర్ రోడ్ లోని లెమన్ ట్రీ ప్రిమియర్ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు 2023, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇంటర్మీడియట్, వొకేషనల్ పరీక్షా ఫలితాల కోసం https://examresults.ap.nic.in , www.bie.ap.gov.in అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని దీనికి సంబంధించిన సీడీ కీ : T#A&B@2023 అని తెలిపారు.


ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 3,79,758 మంది విద్యార్థులు హజరుకాగా 72 శాతం అనగా 2,72,001 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. అదే విధంగా మొదటి సంవత్సరం పరీక్షలకు 4,33,275 మంది విద్యార్థులు హజరు కాగా 61 శాతం అనగా 2,66,326 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 75 శాతం మంది బాలికలు, 68 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 65 శాతం బాలికలు, 58 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారన్నారు. 


                    ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన విడుదల చేసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, 70 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమ గోదావరి జిల్లా రెండవ స్థానంలో, 68 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా మూడవ స్థానంలో నిలిచాయన్నారు. అదే విధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో, 78 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు రెండవ స్థానంలో, 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమ గోదావరి జిల్లా మూడవ స్థానంలో నిలిచాయన్నారు.


         ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో 46 శాతం ఉత్తీర్ణతతో వైఎస్సార్ కడప జిల్లా, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 57 శాతం ఉత్తీర్ణతతో విజయనగరం జిల్లా చివరి స్థానంలో నిలిచాయన్నారు. 

     

*మే 6వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు అవకాశం*..


ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్మీడియట్ బోర్డుకు తెలియజేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 1 వరకు రెండు విడతల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇంటర్ బోర్డు త్వరలో విడుదల చేస్తుందని తెలిపారు. అదే విధంగా జూన్ 5 నుంచి జూన్ 9 వరకు సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.


ఒకేషనల్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలకు 36,031 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 17,507 మంది విద్యార్థులు (49 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు 31,293 మంది విద్యార్థులు హాజరుకాగా 19,430 మంది విద్యార్థులు (62 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా 72 శాతంతో ప్రథమస్థానంలో నిలవగా, కర్నూలు 50 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచాయన్నారు.

 

          ఇంటర్ పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమర్థవంతంగా నిర్వహించటమే కాకుండా ఫలితాలను సైతం రికార్డ్ స్థాయిలో అనుకున్నా సమయానికి ఫలితాలను వెల్లడించడం సంతోషంగా ఉందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తామని చెప్పారు. విద్య, వైద్యంకు ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే విద్య వ్యవస్థలో అనేక సంస్కరణలు చేస్తున్నట్లు చెప్పారు. వాటి ఫలితంగానే ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ బడులు బలోపేతం చేయటం జరిగిందన్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందన్నారు. విద్యపై పెట్టిన ప్రతి పైసా పెట్టుబడితో సమానమని తమ ప్రభుత్వం నమ్ముతుందన్నారు.


            కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి ఎం.వి శేషగిరి బాబు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, సర్వశిక్ష ఎస్ బీ డీ శ్రీనివాస్, ఎండీఎం డైరక్టర్ నిధి మీనన్, పాఠ్య పుస్తకాల ముద్రణా సంస్థ డైరెక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 



Comments