కన్నుల పండుగగా సాగిన "కృష్ణవేణి నదీ విహారం"
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి):
ఈరోజు అనగా 07-04-2023 న సాయంత్రం మంగళ వాయిద్యములు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఆలయం నందలి రుద్రయాగం జరుగు యాగశాల నందు శ్రీ గంగా దుర్గామల్లేశ్వర స్వామివార్లకు ఆలయ వైదిక అర్చక సిబ్బందిచే శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లను పల్లకీపై ఊరేగింపుగా దుర్గాఘాట్ నకు తీసుకుని వచ్చి, పవిత్ర కృష్ణా నదీ తీరంవద్ద సిద్ధంచేసిన పంటు మీద స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించారు.
అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక అర్చక సిబ్బందిచే శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించారు. అనంతరం ప్రదోష కాలమందు కృష్ణ నదీ యందు స్వామి అమ్మవార్లకు 1.వేదపారాయణ, 2.లలితా సహస్ర నామములతో మరియు 3.మంగళ వాయిద్యములతో మూడు సార్లు జలవిహారం వైభవముగా నిర్వహించడం జరిగినది.
ఉత్తరాయణంలో వసంత ఋతువు మరియు దక్షిణాయణములో శరత్ ఋతువులు విషయం ఋతువులు అయినందును ఈ సమయము నందు దుర్గా అమ్మవారిని ఆరాదించుట శ్రేష్టమని, అందులో భాగముగా ఉత్తరాయణకాలం చైత్రమాసం నందు వసంత నవరాత్రులు, అనంతరం శ్రీఅమ్మవారి బ్రహ్మోత్సవములు వైభవముగా నిర్వహించడం జరిగినదని స్థానాచార్యుల వారు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే బ్రహ్మోత్సవములలో భాగముగా ఈరోజు మొట్టమొదటి సారిగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల "కృష్ణవేణి నదీ విహారం" నిర్వహించడం జరిగినదని, ఇక నుండి ప్రతి సంవత్సరం ఉత్తరాయణ కాలమందు "కృష్ణవేణి నదీ విహారం" కార్యక్రమం నిర్వహించేందుకు కృషి చేస్తామని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు మరియు కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ తెలిపారు.
ఈ కార్యక్రమం నందు గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, IAS , విజయవాడ నగర పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస రావు , సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణు , ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు , కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ , ట్రస్ట్ బోర్డు సభ్యులు బుద్దా రాంబాబు, చింతా సింహాచలం, చింకా శ్రీనివాస రావు, నంబూరి రవి, బచ్చు మాధవీ కృష్ణ, కేసరి నాగమణి, నిడమానూరి కల్యాణి, అల్లూరి కృష్ణవేణి, తొట్టడి వేదకుమారి గl పాల్గొన్నారు. వీరితో పాటుగా ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ మరియు వైదిక సిబ్బంది, వేదపండితులు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎల్.రమ, సహాయ కార్యనిర్వాహణాధికారి ఎన్. రమేష్ , అర్చకులు, పంటు దాత బొర్రా క్రాంతి కుమార్ మరియు కుటుంబసభ్యులు, ఏ సి పి హనుమంతరావు , ఇరిగేషన్ కార్యనిర్వాహక ఇంజినీరు కృష్ణా రావు మరియు పోలీసు శాఖ, రెవిన్యూ, ఎన్ డి ఆర్ ఎఫ్, ఇరిగేషన్ మరియు ఇతర శాఖ ల సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ గంగా దుర్గా మల్లేశ్వర స్వామివార్ల "కృష్ణ వేణి నదీ విహారము" ను భక్తులు విశేషముగా విచ్చేసి తిలకించారు.
అనంతరం స్వామి అమ్మవార్లు మంగళ వాయిద్యముల నడుమ పల్లకీపై ఊరేగింపుగా తిరిగి మహమండపం చేరుకున్నారు.
కార్యక్రమం దిగ్విజయం అవుటకు సహకరించిన అందరికీ ఆలయ చైర్మన్ మరియు కార్యనిర్వాహనాధికారి వారు ధన్యవాదములు తెలిపారు.
addComments
Post a Comment