వివిధ దేశాలలో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంక్షేమం



తాడేపల్లి (ప్రజా అమరావతి);


                                                                                                                                                                                                                                                                                                                        


వివిధ దేశాలలో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ధి, భద్రతే ధ్యేయంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS పనిచేస్తోంది. కొన్నిరోజులుగా సూడాన్ లో  పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న  నేపథ్యం లో సుడాన్ లోని భారతీయ రాయబార కార్యాలయం.... భారతీయులను పోర్ట్ అఫ్ సుడాన్ కు తరలిస్తోంది. అక్కడినుండి సముద్ర మార్గం లేదా విమానం ద్వారా జెడ్డాకు తరలిస్తున్నారు. అనంతరం భారతీయులను ఢిల్లీ, ముంబయిలకు చేరుస్తోంది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయుల కోసం  ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లను తెలుగు వారు సంప్రదిస్తున్నారు.  ఈ నేపథ్యంలో  ఎప్పటికప్పుడు పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. కేంద్ర ప్రభుత్వం భారతీయులను తరలిస్తున్న నేపథ్యంలో  ఢిల్లీ లేదా ముంబయి చేరుకుంటున్న  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులను, రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో వారి స్వస్థలాలకు చేర్చాలని  రాష్ట్ర ప్రభుత్వ అధికారులను, ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులను, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఇప్పటి వరకు పూర్తిగా కనుగొనబడిన (ట్రేస్ అయిన) సమాచారం ప్రకారం 58 మంది ఏపీ రాష్ట్రవాసులున్నారు. అందులో ఒకరు వారు పనిచేసే సంస్థ ద్వారా స్వదేశానికి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 34 మంది పోర్ట్ ఆఫ్ సుడాన్ కు చేరుకున్నారు.  వీరిలో ఇద్దరు జెడ్డాకు చేరుకున్నారు. జెడ్డాకు చేరుకున్న ఇద్దరిలో, ఒకరు (01) ఇవాళ రాత్రి 9 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు.  మరో ముగ్గురు అక్కడి భారత రాయబార కార్యాలయం అనుమతితో వారు పనిచేసే సంస్థ ద్వారా భారతదేశం చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక పోర్ట్ ఆఫ్ సుడాన్ లో  మిగిలిన 29 మంది రాష్ట్రవాసులు  జెడ్డా ద్వారా భారతదేశం తరలింపునకు అక్కడి రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది.  ఇక మిగిలిన 23 మందిని కూడా పోర్ట్ ఆఫ్ సుడాన్ కు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.  వీరిని కూడా జెడ్డా ద్వారా స్వదేశానికి తరలిస్తారు.



*మరోవైపు సుడాన్ లోని పరిస్థితి  విషయంలో వారం రోజులుగా ఏపీఎన్ఆర్టీ సొసైటీ పలు చర్యలు తీసుకుంది.*


1. సుడాన్ లో ఉన్న రాష్ట్ర ప్రజల గురించి తెలుసుకునేందుకు APNRTS సూడాన్ లో ఉన్న తెలుగు వారిని కాల్స్ ద్వారా సంప్రదించింది. తద్వారా 58 మంది ఏపీ వారు ఉన్నారని తెలుసుకొని వారందరితో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది.  వీరందరినీ ఎంబసీ తో రిజిష్టర్ చేయించడం జరిగింది. ఇంకా ఎవరైనా తెలుగు వారు ఉన్నారేమోనన్న సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం  జరుగుతోంది. 


2. అలాగే, తెలుగు వారి క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు, ఏప్రిల్ 23వ తేదీనే Ambassador of India to the Republic of Sudan (Khartoum) కి  APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి  ఇమెయిల్ పంపారు. భారతీయులను, ఏపీ వాసులను త్వరితగతిన స్వదేశం తరలించడానికి కృషి చేయాలని అభ్యర్థించడం జరిగింది. 


3. APNRTS ఎప్పటికప్పుడు Ambassador of India to the Republic of Sudan (Khartoum) తో సంప్రదింపులు జరుపుతోంది. అంతేకాకుండా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)  మరియు ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్‌లైన్ నంబర్‌లు 0863 234 0678, వాట్సాప్ నంబరు: 85000 27678 అందుబాటులో ఉంచడం జరిగింది. స్వదేశానికి రప్పించే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించడానికి ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమీషనర్ మరియు APNRT సొసైటీ  ఎల్లవేళలా  అందుబాటులో ఉంటుంది.  


4. ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమీషనర్ శ్రీ. హిమాన్షు శుక్లా,  APNRTS సీఈఓ శ్రీమతి. పి. హేమలత రాణి... రాష్ట్రవాసులను త్వరగా వారి స్వస్థలాలకు రప్పించడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో (MEA) సమన్వయం చేస్తున్నారు.



5. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం... కేంద్ర ప్రభుత్వం భారతీయులను స్వదేశానికి రప్పించిన వెంటనే, కేంద్ర విదేశాంగ శాఖతో సమన్వయము చేసుకొని... డిల్లీ, ముంబయి చేరుకున్న రాష్ట్రవాసులను సురక్షితంగా వారి వారి స్వస్థలాలకు చేర్చు ప్రక్రియ, దీనికి సంబంధించిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుందని ఏపీ భవన్ మరియు  APNRTS  అధికారులు  తెలిపారు.

Comments