మలేరియా వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి.

 *మలేరియా వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 24 (ప్రజా అమరావతి):


మలేరియా వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈనెల 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని మలేరియా పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మలేరియా వ్యాధి నిర్మూలన కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మలేరియా వ్యాధి ప్రబలకుండా దోమల పెరుగుదలను అరికట్టాలన్నారు. ఇంటి మురికి కాలువలో చెత్తాచెదారం వేయకూడదని, మురికి నీరు ఎప్పుడూ పారేటట్లు చూడాలని, ఇంటి పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా చూడాలన్నారు. మురికినీరు నిల్వలో వారానికి ఒకసారి కిరోసిన్ ఆయిల్ లేక వాడిన ఇంజన్ ఆయిల్ ను చల్లి దోమల పుట్టుకను నివారించాలన్నారు. దోమల ద్వారా వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా తదితర వ్యాధులు రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిపిఎమ్ఓ కేసీ. కుళ్లాయప్ప నాయక్, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, అసిస్టెంట్ మలేరియా అధికారి లక్ష్మనాయక్, తదితరులు పాల్గొన్నారు.



Comments