*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
*పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా*
ఢిల్లీ (ప్రజా అమరావతి);
జగనన్న విద్యాకానుక’లో వస్తువులు నాణ్యత లోపిస్తే ఆ కంపెనీని దేశంలోనే నిషేధిస్తాం.
పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్
దిల్లీలోని ఎక్స్ఓ కంపెనీకి చెందిన బ్యాగులు, బూట్లు తయారీ కేంద్రాన్ని అకస్మిక తనిఖీ చేసి, స్వయంగా నాణ్యతలను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్
నాణ్యత విషయంలో రాజీపడేది లేదని కంపెనీ ప్రతినిధులను, సిబ్బందిని హెచ్చరించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ .
నాణ్యత లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యక్తిగత నంబరుకు మెసేజ్ చేయాలని విద్యార్థులకు తల్లిదండ్రులకు, అభ్యర్థన.
జగనన్న విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే కిట్ లో అన్ని వస్తువులు నాణ్యతతో కూడినవి, మన్నికగలవి ఇవ్వాలని, కిట్ లో ఏ వస్తువైనా సరిగా లేకపోయినా, నాణ్యత లోపించినా సంబంధిత తయారీ కంపెనీని దేశంలోనే లేకుండా నిషేధిస్తామని ఎక్స్ఓ ఫుట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన బ్యాగులు, బూట్ల వెండర్లను (విక్రేతలను) పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న విద్యాకానుక’ పథకంలో భాగంగా గత మూడేళ్లుగా విద్యార్థులకు బ్యాగుతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పిక్టోరియల్, ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలు ఇస్తున్న సంగతి తెలిసిందే.
*బ్యాగులో పుస్తకాల బరువును పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ.*
ఈ సందర్భంగా శనివారం దిల్లీలోని ఎక్స్ఓ ఫుట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన బ్యాగులు, బూట్లు తయారీ కేంద్రాన్ని, గోదాములను (గోడౌన్) అకస్మిక తనిఖీ చేశారు. మొదట బ్యాగుల తయారీ కేంద్రాన్ని, గోదామును సందర్శించి కొన్ని బ్యాగులు తీశారు. లార్జ్, మీడియం, స్మాల్ బ్యాగుల పరిమాణాలు (మెజర్ మెంట్)ను టెండర్లో ఇచ్చిన కొలమానాల ప్రకారం ఉన్నాయో లేవో స్వయంగా పరిశీలించారు.
తర్వాత ఒక బ్యాగులో 12 కేజీల బరువును ఉంచి పుస్తకాల బరువును తట్టుకోగలదో లేదో మన్నికను, బ్యాగు క్లాత్ నాణ్యతను, జిప్పులు, షోల్డర్ స్ట్రిప్ వంటివి స్వయంగా తనిఖీ చేశారు. కొన్ని బ్యాగులను యాదృచ్ఛికంగా (రాండమ్) గా తీసి 9 బ్యాగులను ఎంపిక చేసి క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా వారికి నాణ్యత పరీక్షల కోసం పంపారు. గత ఏడాది పంపిణీ చేసిన బ్యాగుల్లో సైజులు, జిప్పులు ఫెయిల్ కావడం, పుస్తకాల బరువును మోయలేకపోవడం వంటి నాణ్యత ప్రమాణాల్లో లోపించడంతో ఈసారీ స్వయంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.
*విద్యార్థుల బూట్లు తానే స్వయంగా ధరించి...*
అనంతరం బూట్ల తయారీ కంపెనీకి వెళ్లి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ బూట్లును రాండమ్ గా ఎంపిక చేసి వాటిల్లో ఆయన కాలికి సరిపోయే 9వ సైజు ధరించారు. నాణ్యత, గట్టిదనం, బాండింగ్ టెస్ట్ ను స్వయంగా పరిశీలించారు. అనంతరం తొమ్మిది జతల బూట్లును నాణ్యతా పరీక్షల కోసం క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా వారికి పంపించారు. గత ఏడాది కొన్ని బూట్లు మిస్ మ్యాచ్ అవ్వడం, మాటీ ఫినిషింగ్ తీసుకోవడం వల్ల త్వరగా నాణ్యత కోల్పోవడం వంటివి ఎదురయ్యాయి. ఈసారి అలాంటి సమస్యలు ఎదురుకాకుండా మరింత జాగ్రత్తలు తీసుకుని, గ్లాసీ ఫినిషింగ్ తో బూట్లు ఇవ్వనున్నామని తెలిపారు.
*నాణ్యత విషయంలో రాజీపడేది లేదు*
ఈ సందర్భంగా ప్యాక్టరీలో యాజమాన్యంతో, కార్మికులతో మాట్లాడుతూ బ్యాగులు, బూట్లు విద్యార్థులు చక్కగా ఉపయోగించుకునేలా తయారు చేయాల కోరారు. నాణ్యత విషయంలో రాజీపడేది లేదని అన్నారు. నాణ్యత లోపిస్తే దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు, ప్రపంచంలో అన్ని ప్రముఖ సంస్థలకు లేఖ రాసి ‘బ్లాక్ లిస్ట్’లో చేర్పిస్తామని కఠినంగా హెచ్చరించారు.
*నాణ్యత లేకపోతే నా పర్సనల్ నంబరుకు మెసేజ్ చేయండి*
వచ్చే విద్యా సంవత్సరం ఈ వస్తువులు విద్యార్థులకు సరఫరా చేసిన తర్వాత విద్యార్థులు గానీ, తల్లిదండ్రులు గానీ నాణ్యత విషయంలో ఏమైనా అసంతృప్తి చెందితే ఫోటో తీసి, వివరాలతో సహ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ వ్యక్తిగత వాట్సప్ నంబరు (90131 33636)కు సందేశం పంపాలని అభ్యర్థించారు. దీంతో పాటు వెంటనే 14417 టోల్ ఫ్రీ నంబరుకు సంబంధిత సమాచారాన్ని ఫిర్యాదు చేయాలని తెలియజేశారు.
*సమష్టిగా పని చేద్దాం*
పాఠశాలలు తెరిచేనాటికి ప్రతి విద్యార్థికి 100శాతం కిట్ అందించాలన్న లక్ష్యంతో తామంతా పని చేస్తున్నామని అన్నారు. గత ఏడాది ఇచ్చిన బ్యాగులు, బూట్లలో కొన్ని లోపాలు తలెత్తాయని విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి విమర్శలకు తావివ్వకుండా ముందునుంచే ప్రణాళికబద్ధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ బృహత్కార్యం విజయవంతం కావడానికి మనమంతా సమష్టి కృషితో పని చేయాలని అన్నారు.
ఈ తనిఖీల్లో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ తో పాటు సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి , సమగ్ర శిక్షా సీఈ శ్రీ కె.శ్రీనివాసరావు , ఎక్స్ఓ ఫుట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment