విభిన్న ప్ర‌తిభావంతుల్లో భ‌రోసా నింపేందుకే గుర్తింపు శిబిరాలు.



విభిన్న ప్ర‌తిభావంతుల్లో భ‌రోసా నింపేందుకే గుర్తింపు శిబిరాలు



అన్ని వ‌ర్గాల సంతోషంకోసం సి.ఎం. చేస్తున్న కృషిలో భాగ‌మే ఈ కార్య‌క్ర‌మం


డిప్యూటీ స్పీక‌ర్ శ్రీ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి


 


విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 21 (ప్రజా అమరావతి):


స‌మాజంలో ఇత‌రుల‌తో స‌మానంగా తాము లేమ‌ని అధైర్య‌ప‌డ‌కుండా, విభిన్న ప్ర‌తిభావంతుల‌కు అండ‌గా ప్ర‌భుత్వాలు వున్నాయ‌ని భ‌రోసా ఇచ్చేందుకు నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో నిర్వ‌హిస్తున్న ఉప‌క‌రణాల పంపిణీ  గుర్తింపు శిబిరాలు దోహ‌దం చేస్తాయ‌ని రాష్ట్ర శాస‌న‌స‌భ ఉప స‌భాప‌తి శ్రీ కోల‌గ‌ట్ల వీర‌భద్ర‌స్వామి అన్నారు.  జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమ‌శాఖ‌, అలిమ్ కో, హైద‌రాబాద్‌ల ఆధ్వ‌ర్యంలో విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ఉచిత ఉప‌క‌ర‌ణాల పంపిణీ గుర్తింపు శిబిరం శుక్ర‌వారం న‌గ‌రంలోని కంటోన్మెంట్‌లోని న‌గ‌ర‌పాల‌క సంస్థ మునిసిప‌ల్ హైస్కూల్‌లో జ‌రిగింది. శిబిరాన్ని ప్రారంభించి అక్క‌డికి వ‌చ్చిన దివ్యాంగుల‌తో డిప్యూటీ స్పీక‌ర్ మాట్లాడారు. అధికారుల‌తో మాట్లాడి శిబిరంలో చేసిన ఏర్పాట్ల‌ను తెలుసుకున్నారు. రాష్ట్ర విభిన్న‌ప్ర‌తిభావంతుల శాఖ ద్వారా ప‌ది మంది దివ్యాంగుల‌కు బ్యాట‌రీతో కూడిన మూడు చ‌క్రాల స్కూట‌ర్ల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల‌ పాల‌తో అభిషేకం చేశారు. అనంత‌రం మాట్లాడుతూ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సుఖ సంతోషాల‌తో వుండాల‌ని ముఖ్య‌మంత్రి చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో భాగంగా ఈ శిబిరం ఏర్పాట‌య్యింద‌న్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా ఈ గుర్తింపు శిబిరాలు నిర్వ‌హించి అర్హులైన విభిన్న‌ప్ర‌తిభావంతుల‌కు ఉచితంగా ఉప‌క‌ర‌ణాలు అందించ‌నున్నాయ‌ని చెప్పారు. జిల్లాలో ఇప్ప‌టికే ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ శిబిరాలు పూర్త‌య్యాయ‌ని వీటి ద్వారా 2027 మంది విభిన్న ప్ర‌తిభావంతుల‌కు రూ.2.70 కోట్ల విలువైన 3178 ప‌రిక‌రాలు, ఉప‌క‌ర‌ణాలు అందించేందుకు గుర్తించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ శిబిరాల ద్వారా అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు విభిన్న‌ప్ర‌తిభావంతుల‌కు అండ‌గా వున్నామ‌నే ధైర్యాన్ని క‌ల్పించార‌ని పేర్కొన్నారు. శిబిరానికి హాజ‌రైన వారికి ఉచితంగా భోజ‌నం అందించే ఏర్పాట్లు కూడా పంచ‌ముఖ ఆంజ‌నేయ అన్న‌దాన ట్ర‌స్టు ద్వారా చేశామ‌న్నారు.


న‌గ‌ర మేయ‌ర్ వి.విజ‌య‌ల‌క్ష్మి మాట్లాడుతూ త‌మ దైనందిన ప‌నుల‌ను ఇత‌రుల‌పై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం లేకుండా పూర్తి చేసుకోవ‌డానికి విభిన్న‌ప్ర‌తిభావంతుల‌కు ఉప‌క‌ర‌ణాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌న్నారు. ఈ శిబిరంలో అంద‌జేస్తున్న ఉప‌క‌ర‌ణాలు జాగ్ర‌త్త‌గా వినియోగించుకోవాల‌ని సూచించారు.


న‌గ‌ర డిప్యూటీ మేయ‌ర్ రేవ‌తి, విభిన్న‌ప్ర‌తిభావంతుల శాఖ స‌హాయ సంచాల‌కులు జ‌గ‌దీష్‌, జిల్లా ప‌రిష‌త్ డిప్యూటీ సి.ఇ.ఓ. రాజ్‌కుమార్‌, త‌హ‌శీల్దార్ బంగార్రాజు, మునిసిప‌ల్ కో ఆప్ష‌న్ స‌భ్యుడు అబ్దుల్ ర‌హీం త‌దిత‌రులు పాల్గొన్నారు


 



Comments