*- టీడీపీలో అనూహ్యంగా పెరిగిన "వెనిగండ్ల గ్రాఫ్"*
*- బడుగు, బలహీన వర్గాలే లక్ష్యంగా కార్యక్రమాలు*
*- రంజాన్ తోఫాతో ముస్లిం మైనార్టీలతోనూ మమేకం*
గుడివాడ, ఏప్రిల్ 20 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ నేత వెనిగండ్ల రాము గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిందన్న విషయాన్ని టీడీపీ అధిష్టానం గుర్తించినట్టుగా ప్రచారమైతే సాగుతోంది. ఈ నెల 13, 14 తేదీల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గుడివాడలో పర్యటించారు. అప్పటి వరకు వెనిగండ్ల ఒక లెక్క, చంద్రబాబు పర్యటన తర్వాత ఇంకో లెక్క అన్నట్టుగా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. చంద్రబాబు తొలిరోజు గుడివాడ పర్యటనకు వెనిగండ్ల ఆధ్వర్యంలో దాదాపు 20 వేల మంది కార్యకర్తలు తరలిరావడం అప్పట్లో చర్చనీయాంశమైంది. గుడివాడ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబుకు వెనిగండ్ల ఘనస్వాగతం పలకడం జరిగింది. చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో, బహిరంగ సభలు పూర్తిస్థాయిలో విజయవంతమయ్యాయి. 2వ రోజు పర్యటనలో భాగంగా అంబేద్కర్ జయంతి వేడుకలు, పాస్టర్లతో జరిగిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలో వెనిగండ్ల ప్రముఖ పాత్ర పోషించడాన్ని చంద్రబాబు స్వయంగా చూడడంతో పాటు ఇప్పటి వరకు గుడివాడ నియోజకవర్గంలో నిర్వహించిన వెనిగండ్ల సేవా, పార్టీ కార్యక్రమాల ఫొటో ఎగ్జిబిషన్ ను కూడా మెచ్చుకోవడం జరిగింది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అందివచ్చిన అవకాశాన్ని వెనిగండ్ల సద్వినియోగం చేసుకోవడంతో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని టీడీపీలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. చంద్రబాబు పర్యటన తర్వాత బడుగు, బలహీన వర్గాలే లక్ష్యంగా వెనిగండ్ల తన కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. గుడివాడ పట్టణంలో నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి వేడుకల్లో బీసీ సామాజిక వర్గాలతో వెనిగండ్ల మమేకమైనట్టుగా కన్పించింది. సర్దార్ గౌతులచ్చన్న ఆశయాల సాధనకు కృషి చేస్తానంటూ వెనిగండ్ల చేసిన ప్రకటనతో బలహీన వర్గాలకు ఆయన మరింత దగ్గరయ్యే అవకాశం ఏర్పడింది. వెనిగండ్ల నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ బడుగు, బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. ఫౌండేషన్ పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాలను కూడా అదే బలహీన వర్గాలకు అందేలా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీన వర్గాల పార్టీ అంటూ ఆయా వర్గాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కూడా వెనిగండ్ల కృషి చేయడం జరుగుతోంది. దీనిలో భాగంగా రంజాన్ తోఫా కార్యక్రమాన్ని గుడివాడ పర్యటనలో చంద్రబాబు చేతులమీదుగా వెనిగండ్ల ప్రారంభించడం జరిగింది. వచ్చే ఎన్నికల నాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు వెనిగండ్ల ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద చంద్రబాబు గుడివాడ పర్యటన తర్వాత ప్రత్యర్థుల అంచనాలకు అందని వెనిగండ్ల మార్క్ రాజకీయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
addComments
Post a Comment