ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

 



మచిలీపట్నం ఏప్రిల్ 24 (ప్రజా అమరావతి);


ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాల


ని, ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని, అవసరమైనప్పుడు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు.


సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రకృతి వైపరీత్యాలు, మంచినీటి సరఫరా, గృహ నిర్మాణం, రి సర్వే తదితర అంశాలపై  సంయుక్త కలెక్టర్, డిఆర్ఓ,  జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదివారం జిల్లాలో కురిసిన వర్షాలకు ఆస్తి ప్రాణ నష్ట వివరాలు, దెబ్బతిన్న పంటల వివరాలు  సంబంధిత ఆర్డిఓలను అడిగి తెలుసుకున్నారు. చల్లపల్లి, అవనిగడ్డ, కృత్తివెన్ను మండలాల్లో మొత్తం నలుగురు వ్యక్తులు చనిపోయారని మచిలీపట్నం ఆర్డిఓ ఐ కిషోర్ జిల్లా కలెక్టర్ కు వివరించారు.


అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడైనా ప్రమాదాలు సంభవించే పరిస్థితి ఉంటే తక్షణమే స్పందించి తగిన సహాయ చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు.

జిల్లాలో ఆదివారం సంభవించిన వర్షాలకు సంబంధించిన సమాచారం సకాలంలో జిల్లా కలెక్టరేట్ కు రాకపోవడం సరైనది కాదని స్పష్టం చేశారు.


వర్షాల వలన  ఎవరైనా చనిపోయిన, పంట నష్టమైన వాటికి సంబంధించిన సమాచారం వెంటనే జిల్లా కలెక్టరేట్ కు చేరవేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

క్షేత్రస్థాయిలో ఉన్న వార్డు, గ్రామ సచివాలయాలు ఈ విషయంలో చాలా జాగరూకతతో ఉండాలన్నారు.


విషయ తీవ్రతను బట్టి తనతో గాని జాయింట్ కలెక్టర్ తో గాని డిఆర్ఓ తో గాని వెంటనే సంప్రదించాలన్నారు.


జిల్లాలో వేసవి దృష్ట్యా 343 గ్రామాల్లో మంచి నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని గుర్తించడం జరిగిందన్నారు. సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పాటు ఎంపీడీవోలు, తాసిల్దారులు ఆర్డీవోలు ఆయా గ్రామాలను సందర్శించి నీటి కొరత  నివారణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు ముందస్తుగా రూపొందించాలన్నారు. 

ఆయా గ్రామాల్లో నీటి వసతి కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.


పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో మచిలీపట్నం తాడిగడప మున్సిపాలిటీలు నాగాయలంక మండలం  వెనుకబడి ఉన్నాయని అనుకున్న విధంగా పురోగతి సాధించేందుకు వీలుగా సంబంధిత అధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.


రీ సర్వే కార్యక్రమంలో భాగంగా ఇంకా  31 వేల సరిహద్దు రాళ్ళను ఏర్పాటు చేయవలసి ఉన్నందున ఆ పనులు వేగవంతం చేయాలన్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు సిబ్బందిలో  సామర్థ్యం పెంపుదల కోసం అవగాహన కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు.


ఈ టెలికాన్ఫరెన్స్ లో

సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దారులు పాల్గొన్నారు.


Comments