పూర్తి వసతులతో టిడ్కో గృహాలు.



గుడివాడ (ప్రజా అమరావతి);


*పూర్తి వసతులతో టిడ్కో గృహాలు


*

 

*8,912 గృహాలను త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తాం..*

         *-- జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు*


          గుడివాడలోని టిడ్కో గృహాలు అన్ని వసతులతో నిర్మాణాలను పూర్తి చేసుకున్నాయని, త్వరలో వాటిని ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తామని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు.


          మంగళవారం ఆయన గుడివాడ మండలం బొమ్ములూరు సమీపంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న టిడ్కో గృహాలు, మల్లయపాలెం జగనన్న ఇళ్ల నిర్మాణాలను సందర్శించి  పురోగతిని పరిశీలించారు. పురోగతి పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తపరిచారు.


          ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుడివాడలో 80 ఎకరాలలో 8,912 టిడ్కో గృహాలను మొదటి, రెండు దశలలో నిర్మాణాలను చేపట్టి అన్ని మౌలిక వసతులను కల్పించి నిర్మాణాలను పూర్తి చేయటం జరిగిందన్నారు. లెవలింగ్, ఆర్చీ నిర్మాణం వంటి చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయని, అవి కూడా పూర్తి కాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా లబ్ధిదారులకు అందించనున్నామని చెప్పారు. గృహాల ప్రారంభోత్సవ సమయానికి మిగిలిన అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

సమీపంలోని రైలు బ్రిడ్జి కింద నుంచి మున్సిపాలిటీ పైపులైను నిర్మాణం, మురుగునీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ కు అధికారులు తెలిపారు. ఒకపక్క టిడ్కో గృహాలు మరో ప్రక్క జగనన్న ఇళ్లతో ఇది జిల్లాకు మోడల్ ప్రాజెక్ట్ గా నిలువనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 


          177 ఎకరాలలోని మల్లయ్య పాలెం జగనన్న ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలిస్తూ, లేఅవుట్లో మౌలిక వసతులను కల్పించి లబ్ధిదారులు గృహాలను త్వరితగతిన నిర్మించుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. మంజూరైన 4వేల గృహాలకు గాను 2,100 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నట్లు ఆయనకు అధికారులు తెలిపారు.


*రీసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్:*

గుడివాడ మండలం, బొమ్మలూరు గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న పొలాలలో సర్వే సిబ్బంది చేపడుతున్న రీసర్వే పనుల పురోగతిని కలెక్టర్ పి.రాజాబాబు మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు.

          బొమ్ములూరు గ్రామంలో 719 సరిహద్దు రాళ్ళను పాతాల్సి ఉండగా ఐదు వందలు పూర్తి చేశామని, మండలం మొత్తం మీద 16 వేలకు గాను 6,050 సరిహద్దు రాళ్ళను పాతినట్లు కలెక్టర్ కు అధికారులు తెలిపారు. పక్క గ్రామాల నుంచి అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని రోజుకు వెయ్యి చొప్పున వారం రోజుల్లో మిగిలిన స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.


          గుడివాడ ఆర్డీవో పి.పద్మావతి, డి ఆర్ డి ఏ పీడీ పిఎస్ఆర్ ప్రసాద్, హౌసింగ్ పీడీ జీవీ సూర్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సత్యనారాయణ రాజు, మున్సిపల్ కమిషనర్ వి.మురళీకృష్ణ, టిడ్కో ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.చిన్నోడు, సర్వే ఏడి గోపాల్ రాజ్, ఎంపీడీవో వెంకటరమణ, తహసీల్దారు కే.ఆంజనేయులు, హౌసింగ్ డీఈ రామోజీ నాయక్, విద్యుత్ శాఖ, గ్రామ మండల సర్వే అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.


Comments