*- శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారిని దర్శించుకున్న వెనిగండ్ల
*
*- పాలకవర్గం ఆహ్వానం మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు*
*- వెనిగండ్లను ఘనంగా సన్మానించిన ఆలయ కమిటీ, పట్టణ వైశ్య సంఘం*
*- శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి చిత్రపటం బహుకరణ*
*- అమ్మవారి జయంతి మహోత్సవంలో పాల్గొనడం నా అదృష్టం*
*- శ్రీ వాసవీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోనే విద్యనభ్యసించా*
*- వైశ్య ప్రముఖుల సమక్షంలో గత స్మృతులను గుర్తు చేసుకున్న వెనిగండ్ల*
*- అమ్మవారి ఆశీస్సులతో గుడివాడ ప్రజలు సుభిక్షంగా ఉండాలి*
*- చంద్రబాబుకు శక్తియుక్తులనివ్వాలని వేడుకున్న వెనిగండ్ల*
గుడివాడ, ఏప్రిల్ 30 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మ వారి దేవస్థానాన్ని ఆదివారం తెలుగుదేశం పార్టీ నేత, వెనిగండ్ల ఫౌండేషన్ అధినేత వెనిగండ్ల రాము దర్శించుకున్నారు. శ్రీ వాసవీ అమ్మవారి జయంతి సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవస్థానం, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసిన వెనిగండ్ల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి జన్మదిన మహోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన వెనిగండ్లకు వైశ్య ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వెనిగండ్లకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలతో పాటు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ పాలకవర్గం, పట్టణ వైశ్య సంఘం నేతలు వెనిగండ్లను శాలువాతో ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. కాగా, శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి జయంతి మహోత్సవంలో భాగంగా పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు జవ్వాజి గంగరాజు పతాకావిష్కరణ చేశారు. విస్సంశెట్టి వారి వంశీయులచే వంశపారంపర్యంగా నిర్వహిస్తున్న శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారికి విశేష పూజ, శ్రీ మత్కన్యకా పరమేశ్వరీ మూర్తులైన 102 మంది బాలకన్యలకు విశేష పూజలు విస్సంశెట్టి వెంకట కిరణ్ కుమార్- వీర నాగపద్మ శేషారత్నం దంపతుల చేతుల మీదుగా వైభవంగా జరిగాయి. శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవస్థాన ఆధ్యాత్మిక కమిటీ, వాసవి క్లబ్ వనిత విదర్భపురి పర్యవేక్షణలో సామూహిక కుంకుమార్చనను ఆలయ అర్చకులు చావలి గోపి సత్య వీరేంద్ర గురుక్కల్ శర్మ పర్యవేక్షణలో నిర్వహించారు. నీరాజన మంత్ర పుష్పం అనంతరం గుడివాడ పట్టణ వైశ్య ప్రముఖులు, వైశ్య సంఘాలు, భక్తుల సహకారంతో తదియారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా వెనిగండ్ల స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం వెనిగండ్ల మాట్లాడుతూ శ్రీ వాసవీ అమ్మవారి జయంతి మహోత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అమ్మవారి ఆలయ ఆవరణలో ఉన్న శ్రీ వాసవీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే తాను 10 వ తరగతి వరకు చదివానంటూ వైశ్య ప్రముఖుల సమక్షంలో గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. గుడులవాడ గుడివాడ పట్టణంలోని ప్రముఖ దేవాలయాల్లో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఒకటని అన్నారు. ఈ ఆలయం గుడివాడకు తలమానికమే కాకుండా ప్రత్యేకించి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి పరమ పవిత్రమైన పుణ్యధామంగా వీరాజిల్లుతోందన్నారు. అత్యంత మహిమాన్వితురాలిగా అందరూ విశ్వసించే అమ్మవారిని నిత్యం తలిచి కొలిచి తరిస్తుండడం అనాదిగా వస్తోందన్నారు. దీంతో ఆలయ ప్రాశస్త్యం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో గుడివాడ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రజల కోసం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. 2024 ఎన్నికల్లో టిడిపి విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన శక్తి యుక్తులను అమ్మవారు ప్రసాదించాలని వెనిగండ్ల వేడుకున్నారు.
addComments
Post a Comment