అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తిచేయాలి.



నెల్లూరు, ఏప్రిల్ 19 (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అనేక అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తిచేయాల


ని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరి నారాయణన్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. 

 బుధవారం ఉదయం కలెక్టర్ రాపూరు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని సిద్దవరం గ్రామంలో చేపడుతున్న భూముల రీ సర్వేను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా, సక్రమంగా రీ సర్వే చేయాలని, ప్రభుత్వ నిబంధన ప్రకారం భూమికి హద్దు రాళ్లను నాటాలన్నారు. అనంతరం రాపూరులోని ప్రాథమిక పాఠశాల, కండలేరు డ్యాంలోని జడ్పీ హైస్కూల్లో చేపట్టిన మనబడి నాడు నేడు పనులను పరిశీలించారు. తరగతి గదులు, మరుగుదొడ్లను తనిఖీ చేసి చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. రెండో విడత మంజూరైన నాడు నేడు పనులను త్వరగా మొదలు పెట్టాలని అధికారులకు సూచించారు. అలాగే రాపూరు లో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా రెండో విడత పేదలకు మంజూరు చేసిన జగనన్న లేఅవుట్ లోని ఇంటి స్థలాలను పరిశీలించారు. ఈ లేఅవుట్ లో విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని, త్వరగా ఇంటి నిర్మాణాలు మొదలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. 

 అనంతరం బొజ్జనపల్లి గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. స్పందన రిజిష్టర్, తనిఖీ రిజిష్టరు, సిబ్బంది ఆన్లైన్ అటెండెన్స్ మొదలైన రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం తెలిపే వాల్ పోస్టర్లు, ఆయా పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. 

 కలెక్టర్ వెంట సర్వే రికార్డుల ఎడి హనుమాన్ ప్రసాద్, సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి, తహసిల్దార్ సుభాషిణి, ఎంపీడీవో వీరరాజు, సర్వేయర్ అశోక్ కుమార్, హెచ్ఎంలు హరి ప్రసాద్, శ్రీనివాసులు రెడ్డి, హౌసింగ్ ఏఇ రామకృష్ణ తదితరులు ఉన్నారు. 

Comments