100 శాతం జీఈఆర్‌ రేషియో పెంపు దిశగా అడుగులు.


విజయవాడ (ప్రజా అమరావతి);


*100 శాతం జీఈఆర్‌ రేషియో పెంపు దిశగా అడుగులు*


*విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్) పెంచేందుకు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్లకు, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సూచన*



గ్రామ,వార్డు సచివాలయాల సేవలను వినియోగించుకొని రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల స్థాయిలో 100%  విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్)పై దృష్టి సారించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖాధికారులను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 


గ్రామ, వార్డు సచివాలయాల మధ్య పోటీని సృష్టించి తద్వారా ఆయా సచివాలయాల పరిధిలో 100% జీఈఆర్ సాధించి తమను తాము గర్వంగా ప్రకటించుకునేలా ఆ వ్యవస్థలను ప్రోత్సహించాలని  సూచించారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో  1 సెప్టెంబర్, 2005 నుండి 31 ఆగస్టు, 2018 మధ్య జన్మించిన ప్రతి బిడ్డ 1 నుండి 12వ తరగతి వరకు చదివి ఉత్తీర్ణత సాధించారా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలన్నారు.


ఏ ఒక్క విద్యార్థి కూడా పాఠశాల, కళాశాలల్లో చేరకుండా ఉండకూడదని, ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పిల్లల వారీగా ట్రాకింగ్, 100 శాతం జీఈఆర్ సాధించిన సచివాలయాల సంఖ్యపై పర్యవేక్షణ ద్వారా చేరికల నిష్పత్తిని రెండంచెల ప్రక్రియలలో సమీక్షించాలన్నారు.


గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో (జీఈఆర్) సాధించే క్రమంలో వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోవాలని తదనుగుణంగా వారికి శిక్షణ అందించేందుకు కృషి చేయాలని అధికారులను ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు.  ప్రతి సచివాలయ పరిధిలోని వాలంటీర్ తమకు కేటాయించిన 50 గృహాల పరిధిలోని ఇళ్లను సందర్శించి 1 సెప్టెంబర్, 2005 నుండి 31 ఆగస్టు, 2018 మధ్య జన్మించిన పిల్లల వివరాలు సేకరించడం, 18 నుండి 23 సంవత్సరాల వయస్సు ఉన్న వారు కాలేజీలో చేరేలా చర్యలు చేపట్టడం ద్వారా 100 శాతం జీఈఆర్ సాధించేందుకు కృషి చేయాలన్నారు. అదే విధంగా పాఠశాల విద్యా శాఖ, ఇంటర్మీడియట్ బోర్డు, పాలిటెక్నిక్,ITI పోర్టల్‌లో నమోదు చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.


పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను కార్పొరేట్ స్థాయిలో అందించేందుకు ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిందని, విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ జీఈఆర్ పెంచేందుకు కృషి చేయాలన్నారు. వందశాతం అక్షరాస్యత, 100 శాతం జీఈఆర్‌ రేషియో పెంచే లక్ష్యంగా నిర్దేశించుకొని అధికారులు ఆ దిశగా అడుగులు వేయాలని పరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సూచించారు. 


Comments