ఈనెల 13న యోగోత్సవం
విజయనగరం కోటలో ప్రత్యేక యోగా కార్యక్రమం
విజయనగరం, మే 11 (ప్రజా అమరావతి) ః
యోగా పై విస్తృత ప్రచారమే లక్ష్యంగా ఈనెల 13న జిల్లాలో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గీతం యూనివర్సిటీ అప్లైయిడ్ సైకాలజీ విభాగాధిపతి, ప్రొఫెసర్ కె.సునీత తెలిపారు. స్థానికంగా గురజాడ స్వగృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, యోగా ప్రశస్త్యాన్ని, ప్రయోజనాలను వివరించారు. శారీరకంగా, మానసికంగా ధృడంగా తయారయ్యేందుకు యోగా ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. యోగాను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రతీఏటా జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. సామరస్య జీవన విధానమే లక్ష్యంగా, యోగాపై దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని నిర్వహించేందుకు 100 రోజుల కౌంట్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, దీనిలో భాగంగా 39వ రోజు ప్రచార కార్యక్రమం విజయనగరంలో మే 13న జరుగుతుందని తెలిపారు. ఆయుష్ మంత్రిత్వశాఖ, మోరార్జీదేశాయ్ యోగ జాతీయ సంస్థ ఆద్వర్యంలో జరిగే యోగా దినోత్సవంలో భాగంగా, యోగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలను ఎంపిక చేశారని తెలిపారు. దీనిలో భాగంగా విజయనగరంలో గీతం డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయనగరం, విశాఖపట్నం నగరాలను మాత్రమే ఎంపిక చేయడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. మే 13 ఉదయం 5.30 గంటలు నుంచి 7 గంటలు వరకు విజయనగరం కోటలోని మోతిమహల్ లో జరిగే ఈ ప్రత్యేక యోగా కార్యక్రమంలో వివిధ విద్యాసంస్థలు, యోగ శిక్షణా సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతీఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ సునీత విజ్ఞప్తి చేశారు.
విలేకర్ల సమావేశంలో అకాడమీ ఆఫ్ యోగా కాన్‌స్వీక్సెన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్.శ్రీకృష్ణ, యోగ నిపుణులు ఎన్.రవి, సన్యాశిరావు, భారతి పాల్గొన్నారు. ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు.
addComments
Post a Comment