రూ.2వేల నోటును ఉపసంహరించుకోవడం మంచి నిర్ణయం.

 *- రూ.2వేల నోటును ఉపసంహరించుకోవడం మంచి నిర్ణయం


 *- సాధారణ ప్రజలపై ఏ మాత్రం ప్రభావం కన్పించదు* 

 *- ఆర్ధిక వ్యవస్థకు కూడా చేకూరనున్న ప్రయోజనం* 

 *- మీడియాతో ఐఎఫ్ఎస్ అధికారి కాకొల్లు భస్మాకరరావు* 



గుడివాడ, మే 22 (ప్రజా అమరావతి): రూ.2వేల నోటును ఉపసంహరించుకోవడం మంచి నిర్ణయమని ఐఎఫ్ఎస్ అధికారి కాకొల్లు భస్మాకరరావు అభిప్రాయపడ్డారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడలో ఆయన ఒక ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా భస్మాకరరావు మాట్లాడుతూ రూ. 2వేల నోటు ఉపసంహరణ నిర్ణయంలో రాజకీయాలు కూడా భాగమయ్యాయని తెలిపారు. దాదాపు రూ.4. 28లక్షల కోట్ల విలువైన రూ. 2వేల నోట్లు మార్కెట్లో చలామణిలోకి వచ్చాయన్నారు. ఆ తర్వాత ఈ నోట్లను ముద్రించలేదన్నారు. రానురానూ రూ. 2వేల నోట్లు చలామణిలో కన్పించకుండా పోయాయన్నారు. అంత పెద్ద నోటును మార్కెట్లో మార్చుకోవడం సామాన్యులకు కూడా కష్టంగా ఉందన్నారు. డబ్బును పెద్దఎత్తున దాచుకునే వారికి ఈ రూ.2వేల నోట్లు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. రాజకీయాల్లో ఓట్లు కొనుగోలు చేసే పొలిటికల్ మాస్టర్స్ వల్ల రూ. 2వేల నోట్లు విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయాయన్నారు. అవన్నీ బ్లాక్ మార్కెట్లోనే ఉండిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో రూ. 2వేల నోట్ల ప్రభావం సాధారణ ప్రజలపై ఏ మాత్రం కన్పించదన్నారు. గత మూడు, నాలుగేళ్ళుగా దూరదృష్టితో ఉన్న రాజకీయ నాయకులు, గుజరాత్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన కొన్ని సంస్థలు రూ.2వేల నోట్లను ఉపసంహరించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి అనేకసార్లు విన్నవించడం జరిగిందన్నారు. ఈ నోట్లు ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారన్నారు. బ్యూరోక్రసీ, రాజకీయ నాయకులు, సక్రమంగా పన్నులు చెల్లించని పారిశ్రామికవేత్తల చేతుల్లోనే రూ. 2వేల నోట్లు మగ్గిపోతున్నాయన్నారు. ఈ నోట్లు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి పనికిరావన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయన్నారు. ఈ పరిస్థితుల్లో రూ.2వేల నోట్లను ఉపసంహరించుకోవడం ద్వారా బ్యాంక్ లలో డిపాజిట్ చేసుకునే వెసులుబాటును కల్పించడం శుభపరిణామమని చెప్పారు. ఎంత మొత్తాన్నైనా డిపాజిట్ చేసుకునే అవకాశం ఇవ్వడం వల్ల రూ. 2వేల నోట్లన్నీ బ్యాంక్ ల వద్దకు చేరతాయన్నారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుతుందన్నారు. రూ.2వేల నోట్లను బ్యాంక్ ల్లో డిపాజిట్ చేసుకునేవారు అవి ఏ విధంగా వచ్చాయో చెబితే సరిపోతుందన్నారు. బ్లాక్ మనీగా పెట్టుకున్న వారికి మాత్రమే ఇబ్బందులు ఉంటాయన్నారు. రూ.2వేల నోట్లను ఉపసంహరించుకోవడం వల్ల ప్రజలకు నష్టం ఉండదని భస్మాకరరావు అభిప్రాయపడ్డారు.

Comments