ఎస్సీ సంక్షేమంలో ఏపీకి ఎదురులేదు..



ఎస్సీ సంక్షేమంలో ఏపీకి ఎదురులేదు..


దేశవ్యాప్తంగా 34.68లక్షల ఎస్సీ కుటుంబాలకు సాయం

దీనిలో ఒక్క ఏపీలోనే 33.57 లక్షల కుటుంబాలు

కేంద్ర ప్రభుత్వ గణాంకాలతో రుజువైన వాస్తవం

మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి.

అమరావతి, మే 1 (ప్రజా అమరావతి): ఎస్సీ సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ కు దేశంలోనే ఎదురులేదని నిరూపణ అయిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిసి 1.11 లక్షల ఎస్సీ కుటుంబాలకు సాయం చేస్తే, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 33.57 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేసిందని వివరించారు. 

రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాగార్జున మాట్లాడుతూ, ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా అన్ని రాష్ట్రాలు కలిపి ఎస్సీలకు చేస్తున్న సాయం కంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న సాయమే  అత్యధికంగా ఉందని నిరూపణ అయిందని చెప్పారు. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారంగా గత ఆర్థిక ఏడాది మూడవ త్రైమాసికం (థర్డ్ క్వార్టర్) నాటికి అంటే 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిసి ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా 34 లక్షలా 68 వేల 986 కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని, అయితే ఈ మొత్తం కుటుంబాలలో ఒక్క ఏపీలోనే  ఏకంగా 33 లక్షలా 57 వేలా 52 కుటుంబాలకు సాయం చేయడం జరిగిందని తెలిపారు. ఈ లెక్కన ఏపీ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిసి ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా ఎస్సీలకు కేవలం 1 లక్షా 11 వేలా 934 కుటుంబాలకు మాత్రమే సాయం చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 33 లక్షలా 52 వేల కుటుంబాలకు సాయం చేసిందని వివరించారు. ఎస్సీ కుటుంబాలకు సాయం చేయడంలో 33.57 లక్షల కుటుంబాలతో ఏపీ ప్రధమ స్థానంలో ఉండగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్న కర్ణాటక, త్రిపుర రాష్ట్రాలు కేవలం 20 వేల పైచిలుకు కుటుంబాలకు మాత్రమే సాయాన్ని అందించాయని చెప్పారు. కేంద్రం ప్రకటించిన ఈ గణాంకాలు ఎస్సీల అభివృద్ధి పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం కాగా, రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధిని గాలికి వదిలేసారని అవాస్తవాలను ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు, ఆయనకు వత్తాసుపలుకుతున్న విపక్షాలకు చెంపపెట్టు అని నాగార్జున అభిప్రాయపడ్డారు. ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఐదేళ్ల చంద్రబాబు నాయుడి పాలనలో  చేసిన ఖర్చు మొత్తంగ రూ.33,625 కోట్లు కాగా, మూడేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు  రూ.49,710.17 కోట్లు అని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో ఎస్సీల సంక్షేమానికి రూ.33629 కోట్లు ఖర్చు చేస్తే, జగన్మోహన్ రెడ్డి తన మూడున్నరేళ్ల పరిపాలన కాలంలో  ఎస్సీల కోసం రూ. 58353 కోట్లను ఖర్చు చేసారని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఎస్సీలలో 8,66,835 మందికి రూ.4,415 కోట్లు పింఛన్లుగా ఇస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 11,51,222 మందికి రూ.10,191 కోట్లు పింఛన్లుగా అందించడం జరుగుతోందని, ఇది ఎస్సీలకు మేలు చేయడం కాదా,? అని ప్రశ్నించారు. స్వయం ఉపాధి పథకాల్లో చంద్రబాబు నాయుడు హయాంలో  ‘పేదరికంపై గెలుపు’ అనే పేరుతో ఐదేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీలకు మొత్తం రూ. 3,010.8 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తే, తమ ప్రభుత్వ హయాంలో వైయస్సార్ చేయూత, ఆసరా తదితర పథకాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవడానికి ఎస్సీ, ఎస్టీలకు మూడున్నరేళ్ల కాలంలోనే మొత్తం రూ. 7,132.8 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందని వివరించారు. ఇది కాకుండా బ్యాంకు రుణాల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు 2019-20-లో రూ.15791 కోట్లు, 2020-21లో రూ.18689 కోట్లు, 2021-22లో రూ.28577 కోట్లు చొప్పున మూడేళ్ల కాలంలో మొత్తం రూ. 63,057 కోట్ల రుపాయల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందని నాగార్జున తెలిపారు. 615504 మంది ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులను ఇవ్వడం ద్వారా ఏపీ  దేశంలోనే నెంబర్.1 గా ఉందని కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు గీటురాళ్లని చెప్పారు.  వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు అబద్దాలు అభూతకల్పనలు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమం విషయంగా చంద్రబాబుతో తాను బహిరంగ చర్చకు సిద్ధమేనని పునరుద్ఘాటించారు. గతంలో దళితులను దారుణంగా అవమానించి, మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు దళితుల గడపల్లోకి వెళ్తే ఆయనను తరిమికొట్టడానికి దళిత జాతి సిద్ధంగా ఉందని నాగార్జున పేర్కొన్నారు.

Comments