మరో వారం రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తికానుంది.


 

నెల్లూరు, మే 22 (ప్రజా అమరావతి): మరో వారం రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తికానుందని, ఈ కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నూటికి నూరు శాతం అమలు చేయడం తమ  ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. 


సోమవారం సాయంత్రం మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. 


తొలుత స్థానిక ప్రజా ప్రతినిధులు, యువత గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి మంత్రిని గ్రామంలోనికి ఆహ్వానించారు. అనంతరం పొన్నూరమ్మ దేవస్థానంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. 


 ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి, తిరిగి వారి వద్దకు వెళ్లి మీకు ఇచ్చిన హామీని నెరవేర్చామని చెప్పడం ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. పరిపాలన  అంటే మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.  గతంలో ఏ ముఖ్యమంత్రి నోట కూడా రాని మాట మీ కుటుంబంలో మంచి జరిగి ఉంటే మీ బిడ్డను ఆశీర్వదించండి అని ధైర్యంగా ప్రజలను అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఎవరి ఊహకు అందని విధంగా  గ్రామస్థాయిలోనే గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ విలేజ్ క్లినిక్ వంటి భవనాలను నిర్మించి, సంపూర్ణంగా ప్రజలకు అన్ని అందుబాటులో తీసుకొచ్చి మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన వెంటనే మరొకసారి గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలయ్యాయో పరిశీలించి, వాటిని సంపూర్ణంగా నెరవేర్చేందుకు  చర్యలు చేపడతామన్నారు. 

 ఈ కార్యక్రమంలో   ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, స్థానిక ప్రజా ప్రతినిధులు మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


Comments