కేవలం శిలాఫలకాలకే పరిమితం కాకుండా అభివృద్ధి పనులు పూర్తి

 

నెల్లూరు, మే 17 (ప్రజా అమరావతి):  కేవలం శిలాఫలకాలకే పరిమితం కాకుండా అభివృద్ధి పనులు పూర్తి


చేసి ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఆవిష్కరిస్తూ గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 


గురువారం సాయంత్రం తోటపల్లిగూడూరు మండలం విలుకానిపల్లి గ్రామంలో   గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, ఏమైనా సమస్యలు ఉన్నాయని ఆరా తీశారు. 


తొలుత నెల్లూరు- కోడూరు రోడ్డు నుండి విలుకానిపల్లె మీదుగా పొట్లపూడి వరకు రూ. 60 లక్షలతో నిర్మించిన తారురోడ్డును  మంత్రి ప్రారంభించారు. 


 ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గం లోని 89 సచివాలయాల్లో 85 సచివాలయాల పరిధిలో  దిగ్విజయంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేసామని, త్వరలోనే సర్వేపల్లి లో నిర్వహించే కార్యక్రమంతో నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగడానికి సహకరించిన స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు అందరికీ మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని, చిన్న గ్రామమైన విలుకాని పల్లెలో సైడ్ కాలువలు, సిమెంట్ రోడ్లు, ఇంటింటికి కొలాయి, ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను చేపట్టామన్నారు.  గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. 

 ఈ కార్యక్రమంలో  ఎంపీపీ స్వర్ణలత, సర్పంచ్ గోపిరెడ్డి పావని, ఎంపీడీవో హేమలత, తాసిల్దార్ శివయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు కావలి రెడ్డి రంగారెడ్డి, చిల్లకూరు సుధీర్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


Comments