ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా టిడిపి మహానాడు.

 *- ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా టిడిపి మహానాడు


*

 *- ఎన్టీఆర్, చంద్రబాబు పాలనలోనే పేదలకు సంక్షేమం* 

 *- నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు అండగా నిలబడతాం*

 *- యువత సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాం*

 *- అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి, ఉద్యోగావకాశాలు*

 *- నేటి తరానికి తెలిసేలా డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ల ఏర్పాటు*

 *- ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న యువగళం ఫోటో ఎగ్జిబిషన్*

 *-  మహానాడులో ఏపీకి సంబంధించి 15 తీర్మానాలు*

 *- గుడివాడ నుండి మహానాడుకు భారీగా తరలివెళ్తున్నాం* 

 *- మీడియాతో తెలుగుదేశం పార్టీ నేత వెనిగండ్ల రాము*



గుడివాడ, మే 26 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా జరిగిన ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహిస్తోందని ఆ పార్టీ నేత వెనిగండ్ల రాము చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది జరిగే ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు జరుగుతోందన్నారు. దీనిలో భాగంగా ఈనెల 27వ తేదీన 10 ఎకరాల విస్తీర్ణంలో 15 వేలమందితో ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. 60 ఎకరాల విస్తీర్ణంలో జరిగే బహిరంగ సభకు దేశ, విదేశాల నుండి దాదాపు 15 లక్షల మంది హాజరుకానున్నారని తెలిపారు. అలాగే 140 ఎకరాల విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్, రక్తదాన శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీ, భోజన స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను టిడిపి అధినాయకత్వం పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా లక్షలాదిగా తరలివస్తున్న పార్టీ అభిమానులకు గోదావరి రుచులను, ఆతిథ్యాన్ని రుచి చూపనున్నారని చెప్పారు. ఎన్టీఆర్, చంద్రబాబు పరిపాలనలోనే పేదలకు సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో కృషి జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు అండగా నిలబడతామన్నారు.

యువతలో నూతనోత్సాహాన్ని, భరోసాను నింపే దిశగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకమని అన్నారు. యువత సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వైసిపి పాలనలో యువత ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పిస్తామన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో పేదల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు, రాష్ట్రాభివృద్ధి కోసం జరిగిన కృషి తదితర అంశాలను నేటి తరానికి తెలియజేసేలా మహానాడులో డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది జరిగే మహానాడులో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. మహానాడులో ఏపీకి సంబంధించి పోలవరం, అమరావతి నిర్లక్ష్యంతో పాటు సహజ వనరుల దోపిడీ, ఆర్థిక సంక్షోభం, అవినీతి తదితర అంశాలపై 15 తీర్మానాలు చేయనున్నారని చెప్పారు. మహానాడు జరిగే ప్రదేశాలతో పాటు జాతీయ రహదారి పొడవునా భారీ ఫ్లెక్సీలను, కటౌట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, రాజమహేంద్రవరం నగరమంతా తెలుగుదేశం పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయని తెలిపారు. మహానాడుకు గుడివాడ నియోజకవర్గం నుండి పెద్దఎత్తున టిడిపి శ్రేణులతో తరలి వెళ్తున్నామని వెనిగండ్ల రాము చెప్పారు.

Comments