స్కూళ్లు తెరిచే నాటికి నాడు-నేడు ప‌నులు పూర్తికావాలి.స్కూళ్లు తెరిచే నాటికి నాడు-నేడు ప‌నులు పూర్తికావాలి


విద్యార్ధులు డ్రాప‌వుట్ కాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాలి

భ‌వ‌న నిర్మాణాలు త్వ‌ర‌గా పూర్తిచేయాలి

ఫ్యామిలీ డాక్ట‌ర్ విధానంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి

అధికారుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి నాగ‌ల‌క్ష్మి ఆదేశాలు

రాజాం, గ‌రివిడి మండ‌లాల్లో ప‌ర్య‌ట‌న‌

క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల అమ‌లుపై ప‌రిశీల‌న‌


విజ‌య‌న‌గ‌రం, మే 11 (ప్రజా అమరావతి):

నాడు - నేడు కింద పాఠ‌శాల‌ల్లో చేప‌ట్టిన మ‌ర‌మ్మ‌త్తులు, పాఠ‌శాలల ఆధునీక‌ర‌ణ ప‌నుల‌ను వేస‌వి సెలవుల అనంత‌రం పాఠ‌శాల‌లు తెరిచేలోగా పూర్తిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి నాగ‌ల‌క్ష్మి ఎస్ మండ‌ల విద్యాశాఖ అధికారుల‌ను ఆదేశించారు. ఆయా పాఠ‌శాల‌ల్లో చేప‌ట్టిన మ‌రుగుదొడ్లు, పాఠ‌శాల భ‌వ‌నాల మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు వేస‌వి సెల‌వుల్లోనే పూర్తిచేయాల‌న్నారు. ఈ ప‌నుల కోసం నిధుల కొరత లేద‌ని త్వ‌ర‌గా పూర్తిచేయ‌డంపై దృష్టిసారించాల‌ని చెప్పారు. ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన విద్యార్ధులు త‌ర్వాత చ‌దువును కొన‌సాగించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. ఆయా గ్రామాల టీచ‌ర్లు, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి, వ‌లంటీర్లు, సంక్షేమ కార్య‌ద‌ర్శులు ఒక జ‌ట్టుగా ఏర్ప‌డి విద్యార్ధుల త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడాల‌న్నారు. రాజాం మండ‌ల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బొద్దాం జిల్లాప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను క‌లెక్ట‌ర్ గుర‌వారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా నాడు-నేడు ప‌నుల‌ను ప‌రిశీలించారు. ప‌దో త‌ర‌గ‌తి ఫెయిలైన విద్యార్ధులంద‌రినీ ప్ర‌త్యేక త‌ర‌గ‌తుల‌కు ర‌ప్పించి వారంద‌రూ ఉత్తీర్ణుల‌య్యేలా త‌గిన శిక్ష‌ణ ఇవ్వాల‌ని పాఠ‌శాల ప్ర‌దానోపాధ్యాయుడిని ఆదేశించారు.


జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి నాగ‌ల‌క్ష్మి ఎస్ రాజాం మండ‌లం బొద్దాం, సోపేరు గ్రామాల్లో గురువారం ప‌ర్య‌టించారు. ఉపాధిహామీ ప‌నులు, హౌసింగ్ కాల‌నీల నిర్మాణం, స‌చివాల‌యం, రైతుభ‌రోసా కేంద్రం, వెల్ నెస్ సెంట‌ర్ భ‌వ‌నాల నిర్మాణాల‌ను, స‌చివాల‌యాల ప‌నితీరును, నాడు -నేడు కింద జ‌రుగుతున్న ప‌నుల‌ను క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు.  బొద్దాంలోని జ‌గ్గువానిపేట చెరువులో జ‌రుగుతున్న ఉపాధిహామీ ప‌నుల‌ను ప‌రిశీలించి ఉపాధిహామీ సిబ్బంది, వేత‌న‌దారుల‌తో మాట్లాడారు. వేత‌నాల చెల్లింపులు స‌క్ర‌మంగా జ‌రుగుతున్న‌దీ లేనిదీ తెలుసుకున్నారు. ప‌నుల్లో ఎంద‌రు పాల్గొంటున్నారు, గ్రామ పంచాయ‌తీలో గుర్తించిన ఉపాధి ప‌నుల వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక కార‌ణాల వ‌ల్ల వేత‌నాలు అంద‌డంలో జాప్యం జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఉపాధిహామీ అధికారుల‌ను ఆదేశించారు.


బొద్దాంలోని పేద‌లంద‌రికీ ప‌థ‌కంలో మంజూరైన ఇళ్ల కాల‌నీని సంద‌ర్శించి ల‌బ్దిదారులతో మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పూర్తి చెల్లింపులు జ‌ర‌గ‌లేద‌ని కొంద‌రు ల‌బ్దిదారులు వివ‌రించ‌గా దీనిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. సామూహిక గృహ‌ప్ర‌వేశాల కోసం నిర్దేశించిన ల‌క్ష్యం మేర‌కు ఇళ్ల నిర్మాణాలు పూర్త‌య్యేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని గృహ‌నిర్మాణ సంస్థ ఏ.ఇ.ని ఆదేశించారు.


సోపేరు గ్రామంలో మంజూరైన గ్రామ స‌చివాల‌యం భ‌వనాన్ని ప‌రిశీలించి దాదాపుగా పూర్తికావ‌చ్చినందున నెలాఖ‌రులోగా దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాల‌న్నారు. శ్లాబ్ ద‌శ‌లో ఆగిపోయిన రైతుభ‌రోసా కేంద్రం, వెల్ నెస్ కేంద్ర భ‌వ‌నాల‌ను మ‌రో రెండు నెల‌ల స‌మ‌యంలో పూర్తిచేయాల‌ని పంచాయ‌తీరాజ్ డి.ఇ.ని ఆదేశించారు.


గ్రామ స‌చివాల‌యాన్ని సంద‌ర్శించి వివిధ శాఖ‌ల కార్య‌ద‌ర్శులు అందిస్తున్న సేవ‌ల‌పై ఆరా తీశారు. స‌చివాల‌య కార్య‌ద‌ర్శుల‌కు స‌రిప‌డే రీతిలో యూనిఫాంలు స‌ర‌ఫ‌రా కాలేద‌ని మండ‌ల అధికారులు వివ‌రించ‌గా రాష్ట్ర స్థాయి అధికారుల‌తో మాట్లాడి స‌ర‌ఫ‌రా చేసేలా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. గ్రామంలో స్వ‌చ్ఛ‌సంక‌ల్పం కింద పారిశుధ్ద్య కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌, ప‌న్నుల వ‌సూలు తదిత‌ర అంశాల‌పై ఆరా తీశారు. స‌చివాల‌యం ద్వారా గ్రామంలో అందుతున్న ఆరోగ్య సేవ‌ల‌పై ఆరోగ్య కార్యక‌ర్త‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ర‌క్త‌హీన‌త గ‌ల బాలిక‌లు, ప్ర‌సూతి మ‌హిళ‌ల‌కు అందిస్తున్న ఆరోగ్య సేవ‌ల‌పై అడిగి తెలుసుకున్నారు. హెమోగ్లోబిన్ శాతాన్ని కొలిచే హెచ్‌బి మీట‌ర్ వున్న‌దీ లేనిదీ ప‌రిశీలించి త‌నే స్వ‌యంగా ప‌రీక్షించుకున్నారు.


ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆర్‌.డి.ఓ. అప్పారావు, ఎంపిడిఓ శంక‌ర్రావు, ఇ.ఓ.పి.ఆర్‌.డి. శ్రీ‌నివాస్‌, త‌హ‌శీల్దార్ కామేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.


గూడెపువ‌ల‌స‌లో ఫ్యామిలీ డాక్ట‌ర్ విధానం ప‌రిశీల‌న‌


గ‌రివిడి మండ‌లం గూడెపు వ‌ల‌స‌లో ఫ్యామిలీ డాక్ట‌ర్ కార్య‌క్ర‌మం ద్వారా గ్రామీణుల‌కు అందుతున్న వైద్య సేవ‌ల‌ను క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. గ్రామంలో మ‌ధుమేహం, ర‌క్త‌పోటు త‌దిత‌ర జీవ‌న‌శైలి వ్యాధులతో బాధ‌ప‌డుతున్న‌ వారి గుర్తింపు ప్ర‌క్రియ ఎంత‌మేర‌కు జ‌రిగింద‌నే అంశంపై ఆరా తీశారు. ఇప్ప‌టివ‌ర‌కు గ్రామంలోని 74శాతం మందితో స‌ర్వే పూర్త‌యిన వైద్యులు వివ‌రించ‌గా వంద‌శాతం గుర్తింపు పూర్తిచేయాల‌ని ఆదేశించారు. ప్ర‌సూతి మ‌హిళ‌ల‌కు అందిస్తున్న వైద్య సేవ‌ల గురించి తెలుసుకున్నారు.  గ్రామ‌స్తుల‌కు ఈ కార్య‌క్ర‌మంపై తెలియ‌జేస్తే వారు మ‌రింత అధికంగా ఈ కార్య‌క్ర‌మం ద్వారా అందే సేవ‌ల‌ను వినియోగించుకునే అవ‌కాశం వుంటుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో త‌హ‌శీల్దార్ టి.గోవింద‌, వైద్యాధికారి డా.కె.రాజ్య‌ల‌క్ష్మి పాల్గొన్నారు.Comments