పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించాలి.

 *పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించాలి**: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 20 (ప్రజా అమరావతి):


జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి అవసరమైన ప్రోత్సాహం అందించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. శనివారం పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమలు & ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ & ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ, DIEPC) సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవారికి రుణాలు అందించేలా బ్యాంకర్లు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో స్టాండప్ ఇండియా, పీఎంఈజీపి కింద పరిశ్రమల స్థాపన కోసం ముందుకు వచ్చే వారికి రుణాలు ఇచ్చేలా చూడాలన్నారు. స్టాండప్ ఇండియా కింద ఎస్టీ, ఎస్సిలకు 10 లక్షల రూపాయల లోపు రుణాలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. స్టాండప్ ఇండియా కింద ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎంత మందికి రుణాలు అందించారు అనే వివరాలను పరిశీలించాలని, ఏ కమ్యూనిటీకి రుణాలు మంజూరు చేస్తున్నారు అన్నది చూడాలని ఆదేశించారు. స్టాండప్ ఇండియా, పీఎంఈజీపి కింద రుణాలు మంజూరు చేయడం లేదని మెంబర్లు తెలియజేయగా, సంబంధించిన వివరాలు అందిస్తే పరిశీలిస్తామన్నారు. ఏపీఐఐసి భూముల్లో గ్రౌండ్ వాటర్ శాఖ అనుమతి తీసుకున్న తర్వాత బోర్లు వేయాలని సూచించారు. హిందూపురం పరిధిలోని గొల్లాపురం వద్ద ఉన్న ఫార్మా ఇండస్ట్రీలలో రీ బోర్ వేయకుండా చర్యలు తీసుకోవాలని, స్థానిక తహసిల్దార్, ఆర్డీవోల సహకారం తీసుకుని ఫార్మా ఇండస్ట్రీలలో తనిఖీలు చేపట్టాలన్నారు. సింగల్ డెస్క్ పోర్టల్ లో పెండింగు కేసులను గడువులోపు పరిష్కరించాలన్నారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2020- 23 కింద 2 క్లెయిమ్ లకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీని మంజూరు చేయాలని, బీసీ ఉమెన్ మరియు మెన్ కేటగిరీ కింద 12 క్లెయిమ్ లకు మూలధన పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదించింది. జగనన్న బడుగు వికాసం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సంబంధించి 7 క్లెయిమ్ లకు మూలధన పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో సులభతర వాణిజ్య విధానం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కింద వివిధ శాఖల నుంచి 217 మంది దరఖాస్తుదారులు (యూజర్స్) అనుమతులు పొందారన్నారు. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) ద్వారా సులభతర వాణిజ్య విధానం కింద జిల్లాలో అనుమతులు పొందిన వారికి ఫోన్ చేసి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఆయా శాఖల అధికారులు తమ పరిధిలోని అనుమతులు పొందిన దరఖాస్తుదారులు అందరికీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఫీడ్ బ్యాక్ విషయమై అవగాహన కల్పించాలన్నారు. ఫీడ్ బ్యాక్ కోసం ఎవరికి ఫోన్ చేసినా యూజర్స్ రెస్పాండ్ అయ్యే విధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు సంబంధించి ఆయా శాఖల అధికారులు అనుమతులు పొందిన యూజర్స్ తో ముందుగా మాట్లాడి సమస్యలు గుర్తించి పరిష్కరించాలన్నారు.


ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎస్.చాంద్ భాష, ఏపీపీసీబీ ఎన్విరాన్మెంటల్ అధికారి శంకర్రావు, ఏపీఎస్పీడీసీఎల్ డిఈఈ మోసెస్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మురళీమోహన్, లీడ్ జిల్లా మేనేజర్ రమణ కుమార్, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్రాంచ్ మేనేజర్ వెంకట్ మహేష్, లేబర్ అసిస్టెంట్ కమిషనర్ రఘురాములు, జిల్లా ఫైర్ అధికారి శంకర ప్రసాద్,  దళిత్ చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటరమణ, ఎస్సీ,ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్, అహుడ వైస్ చైర్మన్ మురళి కృష్ణ గౌడ్, మార్కెటింగ్ ఏడి నరసింహ మూర్తి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.Comments