సమాజంలో వైద్యుల పాత్రే కీల‌కం

 

విజయవాడ (ప్రజా అమరావతి);

* సమాజంలో వైద్యుల పాత్రే కీల‌కం


* రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ద 

* వైద్య ఆరోగ్య శాఖలో 49వేల ఉద్యోగ నియ‌మాకాలు చేప‌ట్టాం

* టీచింగ్ ఆస్ప‌త్రుల్లో అన్ని సేవ‌లు ప‌క్కాగా అమ‌లుకావాలి

* క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్లు, సూప‌రింటెండెంట్ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం అవ‌స‌రం

* వైద్య రంగంలో ఇప్పటికే అనేక విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన జగనన్న ప్రభుత్వం 

-  రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి శ్రీమతి విడ‌ద‌ల ర‌జిని


విజయవాడ:స‌మాజంలో వైద్యుల పాత్ర ఎంతో కీల‌క‌మైన‌ద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని అన్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లు, ప్ర‌భుత్వ టీచింగ్ ఆస్ప‌త్రుల ప‌రిపాల‌నా విభాగానికి చెందిన అధికారుల‌కు విజ‌య‌వాడ‌లో ఫార్చ్యూన్ మురళి హోటల్ లో  బుధ‌వారం శిక్ష‌ణా కార్యక్ర‌మం ప్రారంభ‌మైంది. రెండు రోజుల‌పాటు జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి తొలి రోజు మంత్రి విడ‌ద‌ల ర‌జిని ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి రజని  మాట్లాడుతూ రెండు రోజుల‌పాటు సిబ్బందికి స‌ర్వీస్ రూల్స్‌, ఫైల్స్ నిర్వ‌హ‌ణ‌, ఆస్ప‌త్రి, కళాశాల‌ల్లో ప‌రిపాల‌నా బాధ్య‌త‌లు త‌దిత‌ర అంశాల‌పై శిక్ష‌ణ ఇస్తున్న‌ట్లు చెప్పారు. జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక వైద్య ఆరోగ్య రంగంలో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చార‌న్నారు. రాష్ట్రంలో 49 వేల మందిని కేవ‌లం  వైద్య ఆరోగ్య‌శాఖ‌లోనే కొత్త‌గా నియ‌మించార‌న్నారు. టీచింగ్ ఆస్ప‌త్రుల‌పై ప‌నిభారం త‌గ్గేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయి నుంచి హెల్త్ కేర్‌ను బ‌లోపేతం చేశారన్నారు. ఇప్పుడు ప్ర‌తి గ్రామానికీ విలేజ్ హెల్త్ కేర్ సెంట‌ర్ తీసుకొచ్చామనీ , ఇందులో ప్రాథ‌మిక వైద్య ప‌రీక్ష‌ల‌న్నీ చేస్తున్నారన్నారు. మందులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. 80 శాతం మంది ప్ర‌జ‌లు ఇప్పుడు ఈ స్థాయిలోనే వైద్యం పొందుతున్నారన్నారు. టెర్షియ‌రీ కేర్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం  పూర్తి స్థాయిలో బ‌లోపేతం చేశార‌న్నారు. ఆస్ప‌త్రుల నిర్మాణం, వ‌స‌తుల ఏర్పాటు, సిబ్బంది నియామకాలు.. ఇలా పూర్తి ప‌టిష్టంగా మ‌న వైద్య వ్య‌వ‌స్థ  మారింద‌న్నారు. 

ఈ ఏడాది నుంచి ఐదు కొత్త మెడిక‌ల్ క‌ళాశాల‌లు

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి జిల్లాకు క‌నీసం ఒక మెడిక‌ల్ క‌ళాశాల అయినా ఉండాల్సిందేన‌నే ల‌క్ష్యంతో ఏకంగా 17 మెడికల్ క‌ళాశాల‌లు నిర్మిస్తున్నారన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి రూ. 2500 కోట్ల ఖర్చుతో 750 మెడికల్ సీట్లతో  5 కాలేజీ లలో అడ్మిషన్స్ ప్రారంభించనున్నామని ఆగష్టు నుండి క్లాసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.  మెడికల్ కాలేజీ ల వలన భావి తరాలకు అవసరమైన వైద్యులను అందుబాటులోనికి తీసుకురానున్నామన్నారు.  మెడిసిన్ చదువుకునే సమయంలో ఎలాంటి మోటివ్ ఉంటుందో వైద్యుడుగా వైద్య సేవలు అందించేటప్పుడు కూడా అదే స్ఫూర్తి కొనసాగించాలని వైద్యులకు సూచించారు.  ఈ సందర్భంగా కోవిడ్ సమయంలో వైద్యులు అందించిన సేవలు వెలకట్టలేనివని మంత్రి ప్రశంసించారు.  

రూ.8500 కోట్ల‌కుపైగా నిధుల‌తో ఇప్ప‌టికే ఉన్న మెడిక‌ల్ క‌ళాశాల‌లు, టీచింగ్ ఆస్ప‌త్రుల‌ను తీర్చి దిద్దుతున్నార‌ని కొనియాడారు. ప్రైమ‌రీ కేర్‌, సెకండ‌రీ కేర్‌, మెడిక‌ల్ క‌ళాశాలల నిర్మాణం, అభివృద్ధి, టీచింగ్ ఆస్ప‌త్రుల అభివృద్ధి వీట‌న్నింటి కోసం ఏకంగా రూ.16వేల కోట్ల రూపాయ‌లు రాష్ట్ర  ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తోందన్నారు. ఆరోగ్య‌శ్రీ కింద ఏటా 3వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు చేస్తున్నామ‌న్నారు. ఇదంతా పేద ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యం అందించ‌డం కోస‌మేన‌న్నారు. జ‌బ్బుల వ‌ల్ల ఏ కుటుంబం కూడా ఆర్థికంగా చితికి పోకూడ‌ద‌నే ల‌క్ష్యంంతో ప్ర‌భుత్వం ప‌నిచేస్తోందన్నారు. ప్ర‌భుత్వం అందిస్తున్న ఈ ఫ‌లాలు స‌క్ర‌మంగా ప్ర‌జ‌ల‌కు అందాలంటే వైద్యుల‌ కృషి ఎంతో కీల‌కమ‌న్నారు. సిబ్బంది బాగా ప‌నిచేస్తే... ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యాన్ని అందించ‌గ‌లిగితే.. రాష్ట్ర ప్రభుత్వం  ల‌క్ష్యం నెర‌వేరిన‌ట్లేన‌ని ఆకాంక్షించారు.

సిబ్బంది స‌మ‌య‌పాల‌న పాటించాలి

ఆస్ప‌త్రుల్లో ని సిబ్బంది స‌మ‌య పాల‌న పాటించేలా చూడాల‌ని మంత్రి రజిని స్పష్టం చేశారు. ప్ర‌తి వైద్యుడూ క‌చ్చితంగా ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు విధుల్లో ఉండాల‌న్నారు. రోగుల‌తో వైద్య సిబ్బంది ఆప్యాయంగా మాట్లాడాలన్నారు. ఆస్ప‌త్రుల సూప‌రింటెండెంట్లు - వైద్య క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం  ఉండాలన్నారు. వైద్య సిబ్బందితో స‌మ‌ర్థ‌వంతంగా ఎలా ప‌నిచేయించాలో మీరే కూర్చుకుని మాట్లాడుకుని ఆ మేర‌కు మెరుగైన సేవ‌లు అందేలా చూడాల‌న్నారు.హెచ్‌డీఎస్‌, సీడీఎస్ స‌మావేశాలు స‌క్ర‌మంగా, క్ర‌మం త‌ప్ప‌కుండా నిర్వ‌హించేలా చూడాల‌న్నారు. శానిటేష‌న్ చాలా బాగుండాలన్నారు. సెక్యూరిటీ, డైట్‌, పెస్ట్ కంట్రోల్, లాండ్రీ లాంటి స‌ర్వీసు విభాగాల‌న్నీ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాల్సిందేన‌ని, అందుకు మీ స‌హ‌కారం ఎంతో అవ‌స‌రమ‌న్నారు. డీఎంఈ విభాగం ముఖ్య అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా టీచింగ్ ఆస్ప‌త్రుల సూప‌రింటెండెంట్లు, డిప్యూటీ సూప‌రింటెండెంట్లు, సీఎస్ ఆర్ ఎంవోలు, ఏడీలు, అడ్మినిస్ట్రేట‌ర్లు, వైద్య క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లు, ఏడీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Comments