మీ కుటుంబంలో మేలు జరిగిందని విశ్వసిస్తేనే నన్ను ఆశీర్వదించి, అండగా నిలవండి


నెల్లూరు, మే 20 (ప్రజా అమరావతి):   మీ కుటుంబంలో మేలు జరిగిందని విశ్వసిస్తేనే నన్ను ఆశీర్వదించి, అండగా నిలవండి


అని ప్రజలను ధైర్యంగా అడిగిన ఏకైక ముఖ్యమంత్రి  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, గతంలో ఎవరూ కూడా ఇలా  అడగలేదని,  మంచి చేశామని విశ్వాసం, నిబద్ధత ఉంది కాబట్టే ముఖ్యమంత్రి  ధైర్యంగా ప్రజల ఆశీర్వాదం కోరుతున్నారని  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. 


శనివారం సాయంత్రం మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, ఏమైనా సమస్యలు ఉన్నాయని ఆరా తీశారు. 

 తొలుత గ్రామంలో నూతనంగా నిర్మించిన వైయస్సార్ విలేజ్ క్లినిక్ ను డి ఎం హెచ్ వో పెంచలయ్య, స్థానిక నాయకులతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కంపేట హైస్కూల్లో చేపట్టిన నాడు నేడు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ఎన్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన అక్కంపేట హైస్కూల్ విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు.


 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ విలేజ్ క్లినిక్ లు, గ్రామ సచివాలయాలు,  మౌలిక సదుపాయాలు, పాఠశాలల అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం ... ఇలా చెప్పుకుంటూపోతే గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తూ పేదలకు అండగా ఉంటున్న  ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు. పేదవాడు బాగుండాలని ఆలోచన చేసి ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా సంక్షేమ పథకాల లబ్ధిని వారికి అందిస్తూ, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందన్నారు. ప్రపంచ దేశాలను భయపెట్టిన కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న పరిస్థితులను కూడా అధిగమించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడా ఆపకుండా కొనసాగించామని మంత్రి గుర్తు చేశారు.  గత నాలుగేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు ఆనందంగా ఉన్నారని, ధాన్యం ఉత్పత్తి కూడా అధికంగా వచ్చిందని... దీనికి కారణం పాలకుడు మంచివాడైతే ప్రకృతి కూడా సహకరిస్తుందని  మంత్రి చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గం లో తనకు ముందు అనేక మంది శాసనసభ్యులు పనిచేశారని, వారందరికంటే అధికంగా గ్రామాల్లో ఈ నాలుగేళ్లలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. భవిష్యత్తులో మరింత ఎక్కువగా గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి ఈ సందర్భంగా పునరుద్గాటించారు.

 ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో పెంచలయ్య, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, సర్పంచ్ నారపరెడ్డి జాంబవతి, స్థానిక  ప్రజా ప్రతినిధులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


Comments